Financial Planning : రిటైర్మెంట్ ప్లానింగ్.. SIP, EPF, NPSలలో ఏది బెస్ట్
SIP, EPF, NPSలలో ఏది బెస్ట్

Financial Planning : ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికీ తమ సంపాదనను ఎక్కడ, ఎలా పెట్టుబడి పెట్టాలనే ఆలోచన ఉంటుంది. రిటైర్మెంట్ కోసం సరైన ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవాలంటే SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్), EPF (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్), NPS (నేషనల్ పెన్షన్ సిస్టమ్) అనే ఈ మూడు పథకాలు చాలా ముఖ్యమైనవి. అయితే ఈ మూడింటిలో దేనిలో ఎంత పెట్టుబడి పెట్టాలనే విషయంలో చాలా మందికి గందరగోళం ఉంటుంది. తమ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి, వయస్సును బట్టి ఈ మూడు పథకాలలో పెట్టుబడిని ఎలా విభజించుకోవాలనే వివరాలు తెలుసుకుందాం.
రిటైర్మెంట్ ఫండ్‌ను బలంగా మార్చే ఈ మూడు ముఖ్యమైన పథకాల గురించి ముందుగా తెలుసుకోవాలి.
సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP): ఇది పెట్టుబడి పెట్టడానికి అత్యంత సులభమైన మార్గం. ప్రతి నెలా చిన్న మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టి, దీర్ఘకాలంలో పెద్ద మొత్తాన్ని కూడబెట్టవచ్చు. ముఖ్యంగా ఈక్విటీ SIPలు ద్రవ్యోల్బణం కంటే ఎక్కువ రాబడిని ఇవ్వగలవు. ఎక్కువ కాలం ఉన్న యువతకు, రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉన్నవారికి ఇది చాలా తెలివైన ఎంపిక.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF): ఇది ఉద్యోగులందరికీ తప్పనిసరిగా ఉండే, సురక్షితమైన పెట్టుబడి. దీనిలో హామీతో కూడిన రాబడి లభిస్తుంది. కావాలంటే ఇందులో అదనంగా కూడా డబ్బు జమ చేయవచ్చు. తమ డబ్బుకు సేఫ్టీ, స్థిరమైన రాబడిని కోరుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్.
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS): ఈ పథకం ప్రత్యేకంగా రిటైర్మెంట్ కోసం రూపొందించబడింది. ఇందులో మీ డబ్బును ఈక్విటీ, డెట్ రెండింటిలోనూ పెట్టుబడి పెడతారు. దీని వల్ల రిస్క్, స్థిరత్వం మధ్య సరైన బ్యాలెన్స్ ఏర్పడుతుంది. దీంతో పాటు ఇందులో పన్ను ఆదా ప్రయోజనాలు కూడా లభిస్తాయి. మధ్య వయస్కులు తమ రిటైర్మెంట్ ఫండ్‌ను బలోపేతం చేసుకోవడానికి NPSలో ఎక్కువ పెట్టుబడి పెట్టడం లాభదాయకం.
వయస్సును బట్టి పెట్టుబడిని ఎలా విభజించాలి?
మీ వయస్సు ఆధారంగా ఈ మూడు పథకాలలో పెట్టుబడిని ఎలా విభజించాలో చూద్దాం.
20-30 సంవత్సరాల మధ్య వయస్కులు: ఈ వయస్సులో రిస్క్ తీసుకునే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు మీ మొత్తం పెట్టుబడిలో 60% నుంచి 70% వరకు SIPలో పెట్టుబడి పెట్టవచ్చు. EPFలో కొంత మొత్తం జమ చేయడం తప్పనిసరి. NPSలో కావాలంటే తక్కువగా పెట్టుబడి పెట్టవచ్చు.
30-40 సంవత్సరాల మధ్య వయస్కులు: ఈ దశలో రిస్క్ కొంచెం తగ్గించుకుంటూ, స్థిరత్వంపై దృష్టి సారించాలి. కాబట్టి, SIP, EPFలలో బ్యాలెన్స్ పాటించాలి. అదే సమయంలో పన్ను ప్రయోజనాలు పొందడానికి, రిటైర్మెంట్ ఫండ్‌ను పెంచడానికి NPSలో మీ సహకారాన్ని పెంచడం చాలా ప్రయోజనకరం.
50 సంవత్సరాలు పైబడిన వారు: ఈ దశలో భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. మీ మొత్తం పెట్టుబడిలో 60% నుంచి 70% వరకు EPF, NPSలో పెట్టుబడి పెట్టవచ్చు. SIP వాటాను తగ్గించి, తక్కువ రిస్క్ ఉన్న మార్గాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ పోర్ట్‌ఫోలియోను సురక్షితంగా ఉంచుకోవచ్చు.
ఈ మూడు పథకాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ పోర్ట్‌ఫోలియో బ్యాలెన్సుడ్గా ఉంటుంది. SIP నుంచి వృద్ధి, EPF నుంచి భద్రత, NPS నుంచి పన్ను ప్రయోజనాలు లభిస్తాయి.

