భూమి చుట్టూ 5 సార్లు చుట్టేయొచ్చు..ఎక్కడ ఉందంటే ?

Rail Network: భారతదేశంలో రైలు ప్రయాణం అనేది కేవలం ఒక ప్రయాణం మాత్రమే కాదు మన జీవితంలో ఒక భాగం. మన రైల్వేను దేశానికి జీవనాడి అని పిలుస్తాం, అది నిజం కూడా. మన రైల్వే నెట్‌వర్క్ ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్దది. అయితే ప్రపంచంలోనే అత్యంత విశాలమైన, పొడవైన రైల్వే నెట్‌వర్క్ ఏ దేశానిదో తెలుసా. చైనా లేదా రష్యా అనుకుంటే పొరపాటే. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ అమెరికా వద్ద ఉంది. ఈ నెట్‌వర్క్ పరిమాణం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.

అమెరికన్ రవాణా శాఖ, అసోసియేషన్ ఆఫ్ అమెరికన్ రైల్‌రోడ్స్ (AAR) గణాంకాల ప్రకారం.. అమెరికా రైల్వే నెట్‌వర్క్ 2,20,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ విస్తరించి ఉంది. దీని విస్తీర్ణం ఎంత పెద్దదంటే ఈ పట్టాలన్నింటినీ ఒకే సరళ రేఖలో కలిపితే అవి భూమిని దాదాపు ఐదు సార్లు చుట్టేయగలవు. ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉన్న భారత రైల్వే నెట్‌వర్క్ (సుమారు 68,000 కి.మీ)కంటే ఇది చాలా రెట్లు పెద్దది. భారతదేశంతో సహా చాలా దేశాలలో రైల్వే నిర్వహణ, నియంత్రణ పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. కానీ అమెరికా మాత్రం చాలా భిన్నమైన మార్గాన్ని ఎంచుకుంది. అక్కడ రైల్వే మౌలిక సదుపాయాలు, నిర్వహణ పెద్ద ఎత్తున ప్రైవేట్ కంపెనీల చేతుల్లో ఉన్నాయి.

ఈ మోడల్ ఈనాటిది కాదు 1800ల నాటిది. దేశం తూర్పు, పశ్చిమ భాగాలను కలుపడానికి అప్పట్లో ప్రైవేట్ రైల్ కంపెనీల మధ్య తీవ్రమైన పోటీ ఉండేది. ఈ పోటీ ఫలితంగానే 1869లో మొదటి ట్రాన్స్‌కాంటినెంటల్ రైలు మార్గం పూర్తయింది. ఈ ప్రైవేటీకరణ కారణంగానే అమెరికన్ రైల్వే నెట్‌వర్క్ ఇంత వేగంగా విస్తరించింది. ఇప్పుడు యూనియన్ పసిఫిక్, బీఎన్ఎస్ఎఫ్ రైల్వే, CSX వంటి దిగ్గజ కంపెనీలు ఈ వ్యవస్థను నిర్వహిస్తున్నాయి.

వేగవంతమైన హై-స్పీడ్ లేదా బుల్లెట్ రైళ్ల విషయంలో జపాన్, చైనా, యూరప్ దేశాలు ముందున్నా, అమెరికా కొంచెం వెనుకబడి ఉంటుంది. దీనికి కారణం అమెరికన్ రైల్వే వ్యవస్థ ప్రయాణీకుల కంటే సరుకు రవాణా పై ఎక్కువ దృష్టి సారించడం. అక్కడ Amtrak వంటి ప్రభుత్వ ప్రయాణీకుల సేవలు ఉన్నప్పటికీ, ఆ పట్టాల యాజమాన్యం ఎక్కువగా ప్రైవేట్ సరుకు రవాణా కంపెనీల చేతిలోనే ఉంది. అందుకే సరుకు రవాణా రైళ్లకు అధిక ప్రాధాన్యత ఇస్తారు.

అమెరికాలో రవాణా అయ్యే మొత్తం సరుకులో దాదాపు 28% రైల్వే ద్వారానే జరుగుతుంది. ఒకే ఒక్క గూడ్స్ రైలు ఒకేసారి 280 ట్రక్కులు మోయగలిగేంత సరుకును రవాణా చేయగలదు. 2025 చివరి నాటికి అమెరికా రైల్ రవాణా పరిశ్రమ విలువ సుమారు 103 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 8.5 లక్షల కోట్లు) ఉంటుందని అంచనా. కేవలం సరుకు రవాణా మార్కెట్ మాత్రమే 2030 నాటికి 84.79 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా.

అమెరికా ఈ రైల్వే నెట్‌వర్క్ కేవలం పట్టాల గూడు మాత్రమే కాదు. ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిది. దేశంలోని నౌకాశ్రయాలు, పారిశ్రామిక నగరాలు, వ్యవసాయ ప్రాంతాలు, పెద్ద మార్కెట్లు అన్నీ ఈ నెట్‌వర్క్‌తో అనుసంధానించబడి ఉంటుంది. ఈ వ్యవస్థ ప్రతి సంవత్సరం బిలియన్ల డాలర్ల ఆర్థిక కార్యకలాపాలను సృష్టిస్తుంది. ఈ వ్యవస్థ ప్రైవేట్ చేతుల్లో ఉండటం వల్ల, మౌలిక సదుపాయాలు, నిర్వహణపై అయ్యే భారీ ఖర్చును కూడా ఆ కంపెనీలే భరిస్తాయి. తద్వారా ప్రభుత్వంపై భారం తగ్గుతుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story