Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ జెనెరిక్ ఔషధాల దిగుమతిపై సంచలన టాక్స్ విధింపుల ప్రణాళికను ప్రకటించారు. గ్లోబల్ ఫార్మాస్యూటికల్ మార్కెట్‌లో కలకలం రేపుతున్న ఈ కొత్త పన్ను విధానం ప్రకారం.. మొదటి రెండేళ్ల పాటు విదేశీ జెనెరిక్ ఔషధాలపై 0% పన్ను మాత్రమే ఉంటుంది. అయితే ఆ తర్వాత మూడో ఏడాది నుంచి ఏకంగా 100% టాక్స్, నాలుగో ఏడాది నుంచి ఏకంగా 200% రికార్డు స్థాయి దిగుమతి సుంకం విధించనున్నారు. అమెరికాలో మేడ్ ఇన్ అమెరికా మంత్రంతో స్థానిక ఔషధ తయారీని ప్రోత్సహించడం, భారత్, చైనా లాంటి దేశాలపై ఉన్న ఆధారపడటాన్ని తగ్గించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం.

ట్రంప్ టారిఫ్ బాంబ్ వెనుక ఉన్న ప్లాన్ ఇదే

అమెరికా హెల్త్ కేర్ రంగంలో విక్రయించే మొత్తం ఔషధాల్లో దాదాపు 90 శాతానికి పైగా జెనెరిక్ మందులే ఉంటాయి. తమ దేశ పౌరులు వాడే మందులు తమ సొంత గడ్డపైనే తయారవ్వాలని ట్రంప్ గట్టి పట్టుదలతో ఉన్నారు. మొదటి రెండేళ్ల పాటు 0% పన్ను మినహాయింపు ఇవ్వడం వల్ల అమెరికాలో సడన్‌గా మందుల కొరత ఏర్పడకుండా ఉండటంతో పాటు, ఫార్మా కంపెనీలు తమ ప్లాంట్లను అమెరికాకు తరలించడానికి తగినంత సమయం దక్కుతుంది. ఈ నిర్దేశిత గడువులోగా అమెరికాలో తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేయని కంపెనీలపై ఆ తర్వాత 100%, 200% టారిఫ్ దెబ్బ పడుతుంది. అయితే పేటెంట్ పొందిన బ్రాండెడ్ మందులకు ఈ నిబంధనల నుంచి వెసులుబాటు కల్పించారు.

వరల్డ్ ఫార్మసీ భారత్‌పై పడే ప్రభావం ఎంత?

ప్రపంచవ్యాప్తంగా ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్‎గా పేరుగాంచిన భారత్‌కు అమెరికానే అతిపెద్ద ఎగుమతిదారు. అమెరికా వాడే జెనెరిక్ మందులలో సుమారు 40% భారత్ నుంచే సరఫరా అవుతాయి. డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, సిప్లా, అరబిందో ఫార్మా, లూపిన్ వంటి దిగ్గజ భారతీయ కంపెనీలకు అమెరికా ప్రధాన రాబడి వనరుగా ఉంది. ట్రంప్ నిర్ణయంతో మొదటి రెండేళ్లు భారతీయ కంపెనీలకు ఎటువంటి నష్టం ఉండదు. కానీ 100%, 200% టారిఫ్ అమలులోకి వచ్చాక భారతీయ మందుల ధరలు అమెరికాలో విపరీతంగా పెరిగిపోయి లాభాల మార్జిన్లపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అమెరికా మార్కెట్లో నిలబడాలంటే భారతీయ కంపెనీలు అక్కడ స్థానికంగానే తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడం లేదా అమెరికన్ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం తప్ప వేరే మార్గం ఉండదు.

భారత్ ఫార్మా ఎగుమతుల గణాంకాలు

2025-26 ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు భారత ఫార్మా ఎగుమతులు నెలకు దాదాపు 40 మిలియన్ డాలర్ల నుంచి 53 మిలియన్ డాలర్ల వరకు సాగాయి. ఇండియా మొత్తం ఫార్మా ఎగుమతులలో అత్యధికంగా 34% కంటే ఎక్కువ వాటా ఒక్క అమెరికాదే కావడం విశేషం. యుఎస్ఎఫ్ డిఏ ఆమోదించిన ఫార్ములేషన్ ప్లాంట్లు, మార్కెట్ ఆథరైజేషన్లు ప్రపంచంలోనే అత్యధికంగా మన దేశానికే ఉన్నాయి. కాబట్టి దీర్ఘకాలంలో ట్రంప్ టారిఫ్ విధానం భారత ఫార్మా రంగానికి పెద్ద సవాలుగానే మారనుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story