Donald Trump : ప్రపంచ ఫార్మా రంగంలో భూకంపం.. ట్రంప్ దెబ్బకు కుదేలైన దిగ్గజ కంపెనీలు
ట్రంప్ దెబ్బకు కుదేలైన దిగ్గజ కంపెనీలు

Donald Trump :అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన అమెరికా ఫస్ట్ విధానాన్ని మరో మెట్టు ఎక్కించారు. లిబరేషన్ డే సందర్భంగా ఆయన తీసుకున్న కొత్త నిర్ణయం ప్రకారం.. అమెరికా ప్రభుత్వంతో ధరల విషయంలో ఒప్పందం కుదుర్చుకోని, అలాగే అమెరికా గడ్డపై మందుల తయారీ ఫ్యాక్టరీలు పెట్టని కంపెనీలపై ఏకంగా 100 శాతం టారిఫ్ (దిగుమతి పన్ను) విధించనున్నారు. అంటే విదేశాల నుంచి వచ్చే పేటెంట్ మందుల ధరలు ఇకపై రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ఈ నిర్ణయం ద్వారా ప్రపంచంలోని దిగ్గజ ఫార్మా కంపెనీలు అమెరికాలో పెట్టుబడులు పెట్టేలా ఒత్తిడి తెస్తున్నారు.
ఒప్పందం చేసుకుంటేనే ఊరట
అయితే అన్ని కంపెనీలకు ఈ పన్ను వర్తించదు. ఏ కంపెనీలైతే అమెరికా ప్రభుత్వంతో మోస్ట్ ఫేవరెడ్ నేషన్ ప్రైసింగ్ డీల్ కుదుర్చుకుంటాయో, అలాగే అమెరికాలోనే మందులు తయారు చేస్తామని హామీ ఇస్తాయో, అటువంటి కంపెనీలకు ఈ పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది. ప్రస్తుతం అమెరికాలో పెట్టుబడులు పెడుతున్నప్పటికీ, ఇంకా పూర్తిస్థాయిలో డీల్ కుదుర్చుకోని కంపెనీలపై ప్రస్తుతానికి 20 శాతం పన్ను విధిస్తారు. ఇది వచ్చే నాలుగేళ్లలో దశలవారీగా 100 శాతానికి పెరుగుతుంది.
చర్చలకు సమయం.. కానీ తప్పనిసరి
ఈ కొత్త నిబంధనల విషయంలో కంపెనీలు ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు ట్రంప్ సర్కార్ కొంత సమయం ఇచ్చింది. పెద్ద కంపెనీలకు 120 రోజులు, చిన్న కంపెనీలకు 180 రోజుల గడువు ఇచ్చారు. ఈ లోపు ఆయా కంపెనీలు అమెరికాలో తమ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయడం లేదా ధరల తగ్గింపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దేశ భద్రత దృష్ట్యా, మందుల కోసం ఇతర దేశాలపై ఆధారపడటం తగ్గించుకోవడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు ఉద్దేశమని వైట్ హౌస్ వర్గాలు చెబుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా నిరసనలు.. పెరగనున్న ధరలు
ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఫార్మా కంపెనీల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ టారిఫ్ల వల్ల మందుల ధరలు విపరీతంగా పెరుగుతాయని, దీని ప్రభావం సామాన్య రోగులపై పడుతుందని వారు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా, పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలపై పెట్టే పెట్టుబడులు తగ్గిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం మందులే కాకుండా స్టీల్, అల్యూమినియం, కాపర్ వంటి లోహాలపై కూడా టారిఫ్ నిబంధనలను ట్రంప్ మార్చడం గమనార్హం.
దేశాల వారీగా వేర్వేరు పన్నులు
ట్రంప్ ప్రభుత్వం కొన్ని దేశాలకు మాత్రం ప్రత్యేక రాయితీలు ఇచ్చింది. యూరప్ దేశాలు, జపాన్ నుంచి వచ్చే మందులపై 15 శాతం పన్ను ఉండగా, బ్రిటన్ నుంచి వచ్చే వాటిపై కేవలం 10 శాతం పన్ను మాత్రమే ఉంటుంది. ఏదేమైనా, ట్రంప్ తీసుకున్న ఈ ట్రేడ్ వార్ నిర్ణయం వల్ల ప్రపంచవ్యాప్తంగా మెడికల్ సప్లై చైన్ దెబ్బతినే అవకాశం ఉంది. అమెరికాలో ఫ్యాక్టరీలు పెట్టని పక్షంలో విదేశీ కంపెనీలు అమెరికా మార్కెట్ నుంచి తప్పుకోవాల్సి వస్తుందా లేదా ధరలు పెంచి వినియోగదారులపై భారం వేస్తాయా అనేది వేచి చూడాలి.

