Donald Trump : ట్రంప్ బ్రహ్మాస్త్రం.. 20 దేశాలకు షాక్..అపాయం అనుమానం ఉన్నవాళ్లంతా దేశం దాటి రావొద్దట
అపాయం అనుమానం ఉన్నవాళ్లంతా దేశం దాటి రావొద్దట

Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఇమ్మిగ్రేషన్ విధానాలను మరింత కఠినం చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1వ తేదీ నుంచి మరో 20 కొత్త దేశాల పౌరులపై కఠినమైన ప్రయాణ ఆంక్షలు విధించనున్నారు. ఈ కొత్త ఆంక్షలతో కలిపి, అమెరికాలోకి ప్రవేశం పూర్తిగా నిషేధించబడిన లేదా కఠినమైన పరిమితులు ఎదుర్కొనే దేశాల సంఖ్య 35కు పైగా పెరిగింది. ట్రంప్ ప్రభుత్వం చట్టబద్ధంగా అమెరికాలోకి ప్రవేశించే వారి సంఖ్యను పరిమితం చేయడానికి తీసుకున్న అతిపెద్ద చర్య ఇదే అని నిపుణులు చెబుతున్నారు.
ఏయే దేశాలపై ప్రభావం?
ఈ కొత్త ఆదేశం ఆఫ్రికా, పసిఫిక్ ప్రాంత దేశాలపై ఎక్కువగా ప్రభావం చూపనుంది. సిరియా, దక్షిణ సూడాన్, నైజర్, మాలి, బుర్కినా ఫాసో దేశాల పౌరులపై అమెరికా పూర్తిగా నిషేధం విధించింది. పాలస్తీనా అథారిటీ జారీ చేసిన పత్రాలు ఉన్నవారికి కూడా అమెరికా ప్రవేశం ఉండదు. అంగోలా, బెనిన్, నైజీరియా, సెనెగల్, టాంజానియా, టోంగా, జాంబియా, జింబాబ్వే వంటి మరో 15 దేశాలపై పాక్షిక ఆంక్షలు విధించారు. అంటే, ఈ దేశాల పౌరులకు అమెరికా వీసా పొందడం ఇకపై చాలా కష్టం కానుంది.
ఒకే సంఘటనతో మారిపోయిన విధానం
ఈ కఠిన వైఖరి వెనుక గత నెలలో జరిగిన ఒక సంఘటన ప్రధాన కారణం. రెహ్మానుల్లా లకన్వాల్ అనే ఆఫ్ఘన్ పౌరుడు ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులపై కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ఒక సైనికుడు మరణించాడు. విచారణలో ఆ నిందితుడు 2021లో బైడెన్ పరిపాలన సమయంలో ఆఫ్ఘన్ సహకారుల కోసం రూపొందించిన ఒక ప్రత్యేక కార్యక్రమం ద్వారా అమెరికాలోకి వచ్చినట్లు తేలింది.
ఈ ఘటన తర్వాత హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోమ్, అధ్యక్షుడు ట్రంప్‌కు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. హంతకులను అమెరికాకు పంపుతున్న ప్రతి దేశంపై పూర్తి నిషేధం విధించాలని ఆమె గట్టిగా డిమాండ్ చేశారు. ట్రంప్ కూడా థర్డ్ వరల్డ్ దేశాల నుంచి వచ్చే వలసదారులపై శాశ్వత నిషేధం విధించేందుకు ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు.
విద్యార్థులు, కుటుంబాలపై ప్రభావం
ఈ కొత్త ఆదేశం కేవలం పర్యాటకులకు మాత్రమే కాదు, అమెరికాలో స్థిరపడాలని కలలు కనేవారిపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. కొత్త నిబంధనల ప్రకారం, అమెరికా పౌరుల జీవిత భాగస్వాములు, పిల్లలు, తల్లిదండ్రులు అమెరికాకు రావడానికి కూడా ఇప్పుడు ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తోబుట్టువులు, పెద్దలైన పిల్లల వీసా దరఖాస్తు మార్గాలు దాదాపుగా మూతపడ్డాయి.
గతంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీలో సీనియర్ అధికారిగా పనిచేసిన డగ్ ర్యాండ్.. "ఈ జాబితాలో ఉన్న దేశాల నుంచి దాదాపుగా ఏ పౌరుడికీ అమెరికా తలుపులు తెరవకుండా ఈ కొత్త విధానం పూర్తిగా మూసివేస్తుంది" అని వ్యాఖ్యానించారు. యుద్ధ సమయంలో అమెరికా సైన్యానికి సహాయం చేసిన ఆఫ్ఘన్ పౌరుల ఇమ్మిగ్రేషన్ దరఖాస్తులు కూడా నిరవధికంగా నిలిపివేయబడటంతో, వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
జాత్యహంకారం, భద్రతపై వాదనలు
ఈ నిర్ణయంపై అమెరికాలో పెద్ద చర్చ జరుగుతోంది. ట్రంప్ మద్దతుదారులు దీనిని జాతీయ భద్రతకు అవసరమైన సాధారణ నిర్ణయంగా సమర్థిస్తున్నారు. ఒక వ్యక్తి గురించి పూర్తి సమాచారం తెలియకుండా, దేశానికి ప్రమాదం ఉంటే, వారిని అనుమతించకూడదు అని వారు వాదిస్తున్నారు. అయితే విమర్శకులు మాత్రం ఇది వివక్షతో కూడిన నిర్ణయమని, పాత విభేదాలను మళ్లీ పెంచుతుందని ఆరోపిస్తున్నారు.

