మోదీ దెబ్బకు 18 శాతానికి దిగొచ్చాడు

Trump-Modi Trade Deal:అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన చారిత్రాత్మక ఫోన్ సంభాషణ తర్వాత భారత్-అమెరికా వాణిజ్య సంబంధాల్లో కొత్త శకం మొదలైంది. ఫిబ్రవరి 2, 2026 నాడు ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా భారత్‌పై విధిస్తున్న టారిఫ్‌లను భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఒకప్పుడు 50 శాతం వరకు ఉన్న ఈ సుంకాలు ఇప్పుడు 18 శాతానికి దిగిరావడం భారత ఎగుమతిదారులకు అతిపెద్ద ఊరట.

గతేడాది రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామనే కారణంతో అమెరికా భారత్‌పై ఏకంగా 50 శాతం వరకు సుంకాలు (25% రెసిప్రొకల్ + 25% పెనాల్టీ) విధించింది. దీనివల్ల మన దేశం నుంచి అమెరికాకు వెళ్లే టెక్స్‌టైల్స్, ఆటో పార్ట్స్, ఇంజనీరింగ్ వస్తువులు, రత్నాల ఎగుమతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తాజాగా జరిగిన ఒప్పందంతో ఆ 25 శాతం పెనాల్టీని పూర్తిగా తొలగించి, రెసిప్రొకల్ టారిఫ్‌ను కూడా 25 నుంచి 18 శాతానికి తగ్గించారు. భవిష్యత్తులో ఈ సుంకాలను సున్నా శాతానికి తీసుకురావడమే లక్ష్యమని ట్రంప్ పేర్కొనడం గమనార్హం.

ఈ ఒప్పందంలో భాగంగా ఒక కీలక షరతుకు భారత్ అంగీకరించినట్లు ట్రంప్ తెలిపారు. భారత్ ఇకపై రష్యా నుంచి ముడి చమురు కొనుగోలును నిలిపివేసి, అమెరికా, వెనిజులా నుంచి పెద్ద మొత్తంలో చమురును కొనుగోలు చేయనుంది. ఇది ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి సహాయపడుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. సుమారు 500 బిలియన్ డాలర్ల విలువైన అమెరికన్ ఎనర్జీ, టెక్నాలజీ, వ్యవసాయ ఉత్పత్తులను భారత్ కొనుగోలు చేయబోతోంది.

ట్రంప్ తన పోస్ట్‌లో ప్రధాని మోదీని తన ప్రాణమిత్రుడిగా అభివర్ణించారు. "మోదీ తన దేశానికి అత్యంత గౌరవనీయమైన, శక్తివంతమైన నాయకుడు. మా ఇద్దరి మధ్య చాలా విషయాలు చర్చకు వచ్చాయి. మేము ఇద్దరం పనులు పూర్తి చేసే వ్యక్తులం" అని ప్రశంసించారు. దీనికి ప్రతిస్పందనగా ప్రధాని మోదీ కూడా మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులపై సుంకాలు తగ్గినందుకు 1.4 బిలియన్ల భారత ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు.

ఈ ఒప్పందం ప్రకారం భారత్ కూడా అమెరికా నుంచి వచ్చే వ్యవసాయ ఉత్పత్తులు, పప్పు ధాన్యాల మీద సుంకాలను తగ్గించనుంది. దీనివల్ల భారతీయ వినియోగదారులకు నాణ్యమైన అమెరికన్ వస్తువులు తక్కువ ధరకే లభించే అవకాశం ఉంది. ఈ పరిణామం భారత స్టాక్ మార్కెట్లకు, ముఖ్యంగా ఎగుమతి ఆధారిత కంపెనీలకు (IT, Pharma) భారీ బూస్ట్‌ను ఇవ్వనుంది. మొత్తానికి ఈ బిగ్ డీల్ భారత్-అమెరికా ఆర్థిక బంధాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లబోతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story