అమెరికా కొత్త రూల్స్‌తో వణికిపోతున్న ఎగుమతిదారులు

Trump Tariffs : అమెరికా సుప్రీంకోర్టు గతంలో ట్రంప్ విధించిన కొన్ని టారిఫ్‌లను అప్పట్లో కొట్టేసింది. దాంతో ఇప్పుడు ఆయన మరింత పక్కాగా కొత్త నిబంధనలను రూపొందించారు. దీని ప్రకారం, ముడి ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై 50 శాతం టారిఫ్ యథాతథంగా కొనసాగుతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న మార్పు చేశారు. ఇకపై ఈ పన్ను కంపెనీలు చెప్పే డిక్లేర్డ్ ప్రైస్ మీద కాకుండా, మార్కెట్లో అమ్మే అసలు ధర మీద వేస్తారు. తక్కువ రేటు చూపించి పన్ను ఎగ్గొట్టే కంపెనీల ఆట కట్టించడానికే ట్రంప్ ఈ ఎత్తుగడ వేశారు.

చిన్న వస్తువులకు ఊరట.. పెద్ద వాటికి వాత

మెటల్ వాడకం తక్కువగా ఉన్న వస్తువులకు ట్రంప్ ప్రభుత్వం కొంత రాయితీ ఇచ్చింది. ఏదైనా వస్తువు తయారీలో స్టీల్, అల్యూమినియం లేదా రాగి వాటా 15 శాతం కంటే తక్కువగా ఉంటే (ఉదాహరణకు పర్ఫ్యూమ్ బాటిల్స్, చిన్న చిన్న పరికరాలు), వాటిపై ఎలాంటి పన్ను ఉండదు. కానీ, యంత్రాలు, వాషింగ్ మెషీన్లు, గ్యాస్ స్టవ్‌లు వంటి 15 శాతం కంటే ఎక్కువ మెటల్ ఉన్న వస్తువులపై ఏకంగా 25 శాతం పన్ను బాదుడు ఉంటుంది. దీనివల్ల అమెరికాలో ఇలాంటి వస్తువుల ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది.

ఇండస్ట్రియల్ రంగానికి బూస్ట్

అమెరికాలో మ్యాన్యుఫ్యాక్చరింగ్ పెంచేందుకు కొన్ని ప్రత్యేక రాయితీలు కూడా ఇచ్చారు. పారిశ్రామిక యంత్రాలు, ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్ దిగుమతిపై పన్నును 15 శాతానికి తగ్గించారు. ఈ వెసులుబాటు 2027 వరకు ఉంటుంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన పాయింట్ ఏంటంటే.. వస్తువు విదేశాల్లో తయారైనా, అందులో వాడిన మెటల్ మొత్తం అమెరికాదే అయితే, దానిపై కేవలం 10 శాతం పన్ను మాత్రమే పడుతుంది. తద్వారా అమెరికా మెటల్ ఇండస్ట్రీకి గిరాకీ పెంచాలని ట్రంప్ ప్లాన్ చేశారు.

భారత ఎగుమతులపై ప్రభావం ఎంత?

అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భారత ఉక్కు, అల్యూమినియం రంగాలకు గట్టి షాక్ తగిలేలా ఉంది. భారత్ నుంచి అమెరికాకు పెద్ద ఎత్తున ఈ లోహాలు ఎగుమతి అవుతుంటాయి. 50 శాతం పన్ను అంటే మన వస్తువుల ధరలు అక్కడ పెరిగిపోయి, పోటీలో వెనుకబడిపోయే ప్రమాదం ఉంది. కేవలం ముడి పదార్థాలే కాకుండా, ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతులపై కూడా ఈ ప్రభావం కనిపిస్తుంది. గ్లోబల్ సప్లై చైన్ నెమ్మదించడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ధరల అస్థిరత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story