Trump Tariff : అమెరికాలో ట్రంప్ టారిఫ్ బాంబు.. మందులపై 100 శాతం పన్ను.. భారత్‌కు ఊరట
మందులపై 100 శాతం పన్ను.. భారత్‌కు ఊరట

Trump Tariff : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2న ఒక కీలక ఉత్తర్వుపై సంతకం చేశారు. దీని ప్రకారం అమెరికాలోకి దిగుమతి అయ్యే కొన్ని రకాల పేటెంట్ మందులు, వాటి తయారీకి వాడే ముడి పదార్థాలపై 100 శాతం సుంకం పడనుంది. అయితే, గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ నివేదిక ప్రకారం.. ఈ నిర్ణయం వల్ల భారత్ పెద్దగా నష్టపోదు. ఎందుకంటే, అమెరికాకు భారత్ ఎగుమతి చేసే మందులలో అత్యధిక భాగం జనరిక్ (తక్కువ ధరలో లభించే సాధారణ) మందులే. అమెరికాలో వాడే మందుల్లో 90 శాతానికి పైగా జనరిక్ మందులే ఉంటాయి. ప్రస్తుతానికి ఈ జనరిక్ మందులపై ట్రంప్ ఎటువంటి పన్నులు విధించలేదు. దీంతో భారత ఫార్మా కంపెనీలు ఊపిరి పీల్చుకున్నాయి.
ఎగుమతుల్లో భారత్ హవా
భారత ఔషధ రంగానికి అమెరికా అతిపెద్ద మార్కెట్. 2025 సంవత్సరంలో భారత్ దాదాపు 9.7 బిలియన్ డాలర్ల విలువైన మందులను అమెరికాకు ఎగుమతి చేసింది. ఇది మన దేశం ప్రపంచవ్యాప్తంగా చేసే మొత్తం ఔషధ ఎగుమతుల్లో (25.8 బిలియన్ డాలర్లు) దాదాపు 38 శాతానికి సమానం. కేవలం తక్కువ ధరకే కాకుండా నాణ్యమైన జనరిక్ మందులను సరఫరా చేయడంలో భారత్ ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో ఉంది. ట్రంప్ విధించిన ఈ కొత్త పన్నులు కేవలం ఖరీదైన పేటెంట్ మందులకే పరిమితం కావడంతో, భారత ఎగుమతులకు ఎటువంటి ఆటంకం కలగదని విశ్లేషకులు భావిస్తున్నారు.
వణికిపోతున్న అగ్రరాజ్యాలు
ట్రంప్ తీసుకున్న ఈ 100 శాతం పన్ను నిర్ణయం వల్ల ప్రధానంగా ఐర్లాండ్, జర్మనీ, స్విట్జర్లాండ్, బెల్జియం, డెన్మార్క్, బ్రిటన్, జపాన్ దేశాలు తీవ్రంగా నష్టపోనున్నాయి. ఎందుకంటే ఈ దేశాలే అమెరికాకు అత్యధికంగా పేటెంట్ మరియు అత్యంత ఖరీదైన బ్రాండెడ్ మందులను సరఫరా చేస్తాయి. ఇప్పుడు ఈ మందుల ధరలు అమెరికాలో రెట్టింపు కానున్నాయి. ఒకవేళ భవిష్యత్తులో ట్రంప్ తన పన్ను పరిధిని జనరిక్ మందుల వరకు విస్తరిస్తే మాత్రం భారత్‌కు ఇబ్బందులు తప్పవు. కానీ ప్రస్తుతానికి మన ఫార్మా హబ్ సురక్షితంగానే ఉంది.
భారత కంపెనీలకు చిన్నపాటి సెగ
అన్ని కంపెనీలకు ఊరట లభించినప్పటికీ, పేటెంట్ మందులు లేదా వాటికి సంబంధించిన ముడి పదార్థాలను అమెరికాకు సరఫరా చేసే భారతీయ సంస్థలకు మాత్రం కొంత ఇబ్బంది తప్పదు. జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపిన వివరాల ప్రకారం.. స్పెషాలిటీ డ్రగ్స్ తయారు చేసే కొన్ని భారత కంపెనీలపై ఈ పన్నుల ప్రభావం ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ, మన దేశం ఎగుమతి చేసే మెజారిటీ మందులు సాధారణమైనవి కాబట్టి, ఓవరాల్‌గా భారత ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావం చాలా తక్కువని ఆయన స్పష్టం చేశారు.

