Trade War : అగ్రరాజ్యం ఆక్రోశం.. 16 దేశాలపై ఆర్థిక పిడుగు.. గ్లోబల్ ట్రేడ్ లో పెను ప్రకంపనలు
గ్లోబల్ ట్రేడ్ లో పెను ప్రకంపనలు

Trade War : ప్రపంచ వాణిజ్య రంగంలో అగ్రరాజ్యం అమెరికా మరోసారి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం భారత్, చైనా సహా 16 ప్రధాన దేశాలపై యుద్ధం ప్రకటించినంత పని చేస్తూ, సెక్షన్ 301 కింద సమగ్ర వాణిజ్య విచారణను ప్రారంభించింది. అమెరికా మార్కెట్‌పై తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా ట్రంప్ యంత్రాంగం ఈ వ్యూహాత్మక అడుగు వేసింది. ఫిబ్రవరిలో అమెరికా సుప్రీం కోర్టు ట్రంప్ విధించిన గ్లోబల్ టారిఫ్‌లను రద్దు చేస్తూ షాక్ ఇచ్చిన నేపథ్యంలో, ఇప్పుడు ట్రేడ్ యాక్ట్ 1974లోని నిబంధనలను ఆయుధంగా చేసుకుని కొత్త నిబంధనలను తెరపైకి తెచ్చింది.
అమెరికా రాడార్‌లో భారత్ ఎందుకు ఉంది?
అమెరికా ఆరోపణల ప్రకారం.. భారత్, చైనా వంటి దేశాలు తమ స్థానిక పరిశ్రమలకు భారీగా రాయితీలు ఇస్తూ, తక్కువ ధరలకే వస్తువులను అమెరికా మార్కెట్‌లో కుమ్మరిస్తున్నాయి. దీనివల్ల అమెరికాలోని స్థానిక కంపెనీలు నష్టపోతున్నాయని వాషింగ్టన్ వాదిస్తోంది. ఈ దేశాల్లోని తక్కువ కూలీ రేట్లు, ప్రభుత్వ రంగ సంస్థల అనైతిక వ్యాపార పద్ధతులు, కరెన్సీ విధానాలపై అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ జామీసన్ గ్రీర్ లోతుగా దర్యాప్తు చేయనున్నారు. ఈ జాబితాలో జపాన్, దక్షిణ కొరియా, మెక్సికో వంటి దేశాలు ఉన్నా, అమెరికాకు సన్నిహితంగా ఉండే కెనడాను మాత్రం ఈ జాబితా నుండి మినహాయించడం గమనార్హం.
వెట్టిచాకిరి వస్తువులపై నిషేధం
కేవలం పరిశ్రమల సబ్సిడీలే కాకుండా, వెట్టిచాకిరి ద్వారా తయారైన వస్తువుల దిగుమతులపై కూడా అమెరికా కన్నెర్ర చేస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా మరో సెక్షన్ 301 విచారణను చేపట్టింది. ఈ విచారణ పరిధిలోకి దాదాపు 60కి పైగా దేశాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా చైనాలోని షిన్జియాంగ్ ప్రాంతంలో మైనారిటీల చేత బలవంతంగా పని చేయిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో, అక్కడి నుంచి వచ్చే సోలార్ ప్యానెల్స్ వంటి ఉత్పత్తులపై అమెరికా ఇప్పటికే ఆంక్షలు విధించింది. ఇప్పుడు ఇతర దేశాల ఉత్పత్తులపైనా ఇటువంటి నిఘాను పెంచాలని ట్రంప్ సర్కార్ నిర్ణయించింది.
మన ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావం ఏంటి?
ఈ విచారణల వల్ల 2026 వేసవి నాటికి భారతీయ ఉత్పత్తులపై అమెరికా భారీగా దిగుమతి సుంకాలు విధించే ప్రమాదం ఉంది. అమెరికా మనకు అతిపెద్ద ఎగుమతి భాగస్వామి. ఒకవేళ మన వస్తువులపై ట్యాక్స్‌లు పెరిగితే, అమెరికాలో భారతీయ వస్తువులు ఖరీదైనవిగా మారిపోతాయి. దీనివల్ల మన ఎగుమతిదారుల ఆదాయం తగ్గడమే కాకుండా, దేశీయంగా తయారీ రంగంలో ఉద్యోగాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఏప్రిల్ 15 వరకు ప్రజాభిప్రాయ సేకరణ జరిపి, జూలై కల్లా ఈ విచారణ ప్రక్రియను ముగించాలని అమెరికా పట్టుదలగా ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో భారత్ దౌత్యపరంగా ఎలా స్పందిస్తుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

