Donald Trump: భారత్‌కు ట్రంప్ మరో షాక్.. చైనా, భారత్ సహా 16 దేశాలపై కొత్త టారిఫ్ పిడుగు
16 దేశాలపై కొత్త టారిఫ్ పిడుగు

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి దిగుమతి సుంకాల అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు. భారత్, చైనా, యూరోపియన్ యూనియన్ సహా 16 ఆర్థిక వ్యవస్థలపై కొత్త టారిఫ్‌లు విధించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ రాయితీలతో విదేశీ కంపెనీలు అధికంగా ఉత్పత్తి చేస్తున్నాయన్నది అమెరికా ఆరోపణ. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే భారత ఎగుమతులు, వస్త్ర, రసాయన, ఇంజినీరింగ్ రంగాలపై ప్రభావం పడే అవకాశం ఉంది.
ట్రంప్ ఎందుకు ఈ 16 ఆర్థిక వ్యవస్థలపై గురి పెట్టారు?
అమెరికా ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 11న 1974 నాటి అమెరికా వాణిజ్య చట్టంలోని సెక్షన్ 301 కింద విచారణ ప్రారంభించింది. విదేశీ ప్రభుత్వాలు తమ దేశాల్లోని పరిశ్రమలకు సబ్సిడీలు, తక్కువ వడ్డీ రుణాలు, ఇతర ఆర్థిక ప్రోత్సాహకాలు ఇస్తున్నాయని ట్రంప్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీనివల్ల ఆయా దేశాల్లోని కంపెనీలు అవసరానికి మించి వస్తువులను తయారు చేసి తక్కువ ధరలకు ప్రపంచ మార్కెట్లో విక్రయిస్తున్నాయని అమెరికా వాదిస్తోంది. దీంతో అమెరికాలోని తయారీ సంస్థలు పోటీని తట్టుకోలేక నష్టపోతున్నాయని చెబుతోంది. ఈ వ్యవహారంపై అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమీసన్ గ్రీర్ విచారణ చేపట్టారు. ఈ వారం విచారణ ఫలితాలను వెల్లడించే అవకాశం ఉందని వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం పేర్కొంది.
ట్రంప్ టార్గెట్ చేసిన 16 దేశాలు ఇవే..
ఈ విచారణ పరిధిలో మొత్తం 16 ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయి. వాటిలో భారత్, చైనా, యూరోపియన్ యూనియన్, సింగపూర్, స్విట్జర్లాండ్, నార్వే, ఇండోనేషియా, మలేషియా, కంబోడియా, థాయ్‌లాండ్, దక్షిణ కొరియా, వియత్నాం, తైవాన్, బంగ్లాదేశ్, మెక్సికో, జపాన్ ఉన్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. యూరోపియన్ యూనియన్ ఒక దేశం కాదు. ఇందులో 27 సభ్య దేశాలు ఉన్నాయి. అంటే ఈ ప్రతిపాదనల ప్రభావం 16 దేశాలకే పరిమితం కాకుండా మరిన్ని దేశాలకు విస్తరించే అవకాశం ఉంది.
ఏ దేశంపై ఎంత టారిఫ్ పడొచ్చు?
కొత్త టారిఫ్‌లకు సంబంధించి తుది శాతాలను అమెరికా ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. అయితే వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం జపాన్, దక్షిణ కొరియా, యూరోపియన్ యూనియన్ దేశాలపై మొత్తం దిగుమతి సుంకాలు 15 శాతం లేదా అంతకంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది. భారత్, వియత్నాం విషయంలో మాత్రం అంతకంటే ఎక్కువ సుంకాలు విధించే అవకాశాలున్నాయి. చైనాపై మరింత కఠినమైన సుంకాలు విధించవచ్చని అమెరికా అధికారులు భావిస్తున్నట్లు కథనాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఉన్న దిగుమతి సుంకాలకు అదనంగా కొత్త టారిఫ్‌లు విధించే అవకాశం కూడా ఉంది. అయితే ఏ వస్తువులకు మినహాయింపులు ఇస్తారు? కొత్త ధరలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి? అనే అంశాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
భారత్‌పై ఎలాంటి ప్రభావం పడుతుంది?
ఈ కొత్త టారిఫ్‌లతో భారత ఎగుమతి రంగానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా అమెరికాకు వస్తువులు ఎగుమతి చేసే వస్త్ర పరిశ్రమ, చెప్పుల తయారీ, రసాయనాలు, ఇంజినీరింగ్ ఉత్పత్తులు, సోలార్ మాడ్యూల్స్, పెట్రోకెమికల్స్ రంగాలపై ప్రభావం పడవచ్చు. అమెరికా దిగుమతి సుంకాలు పెంచితే అక్కడి కొనుగోలుదారులకు భారత వస్తువులు మరింత ఖరీదుగా మారతాయి. దీంతో ఆర్డర్లు తగ్గే ప్రమాదం ఉంటుంది. ఎగుమతి సంస్థల లాభాలు తగ్గడంతో పాటు కొత్త ఉద్యోగాల కల్పనపైనా ప్రభావం పడవచ్చు. భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. పోటీ దేశాలతో పోలిస్తే భారత వస్తువులకు తక్కువ టారిఫ్‌లు ఉండాలని భారత్ కోరుకుంటోంది.

