Donald Trump :ట్రంప్ మాస్ వార్నింగ్.. అమెరికా కంపెనీలపై చెయ్యేస్తే యూరోప్ ఖేల్ ఖతం
యూరోప్ ఖేల్ ఖతం

Donald Trump : టెక్ దిగ్గజం గూగుల్ పై యూరోపియన్ యూనియన్ దాదాపు 1 బిలియన్ డాలర్ల (సుమారు రూ.8,300 కోట్లు) భారీ జరిమానా విధించడం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపింది. ఈ చర్యపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమెరికన్ కంపెనీలను కావాలనే టార్గెట్ చేస్తున్నారని, దీనికి యూరోప్ చాలా పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది" అని తీవ్రంగా హెచ్చరించారు. ఈ నిర్ణయంతో అమెరికా, యూరోపియన్ యూనియన్ మధ్య మరోసారి ట్రేడ్ వార్ మొదలయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి.
గూగుల్‌పై యూరోపియన్ కమిషన్ మోపిన ఆరోపణలు ఏమిటి?
డిజిటల్ మార్కెట్స్ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించిందనే ఆరోపణలతో యూరోపియన్ కమిషన్ గూగుల్‌పై ఈ జరిమానా విధించింది.
రైవల్ సెర్చ్ ప్రమోషన్: గూగుల్ తన సెర్చ్ ఇంజన్‌లో స్వంత షాపింగ్, ట్రావెల్, ఇతర సేవలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, ఇతర కంపెనీల సేవలను వెనక్కి నెడుతోందని ఈయూ ఆరోపించింది.
ప్లేస్టోర్ ఆంక్షలు: ప్లేస్టోర్‌ను ఉపయోగించే యాప్ డెవలపర్లు తమ కస్టమర్లను ఇతర ప్లాట్‌ఫారమ్‌లకు మళ్లించకుండా లేదా అక్కడ మెరుగైన ఆఫర్లు చూపించకుండా గూగుల్ అడ్డుకుంటోందని పేర్కొంది.
60 రోజుల గడువు: గూగుల్ తన బిజినెస్ విధానాలను మార్చుకోవడానికి 60 రోజుల సమయం ఇచ్చింది. ఒకవేళ మారకపోతే, గూగుల్ రోజూ చేసే ప్రపంచవ్యాప్త వ్యాపారంలో 5% వరకు అదనపు రోజువారీ ఫైన్ వేస్తామని హెచ్చరించింది.
భగ్గుమన్న డొనాల్డ్ ట్రంప్
ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "అమెరికా యూరోప్‌కు పిగ్గీ బ్యాంక్ కాదు" అని ఘాటుగా వ్యాఖ్యానించారు. అమెరికన్ టెక్ కంపెనీలపై ఇటువంటి పక్షపాత వైఖరితో కూడిన జరిమానాలు విధించడాన్ని తన ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించదని స్పష్టం చేశారు.
అమెరికా చట్టాల్లోని సెక్షన్ 301 ప్రకారం యూరోపియన్ యూనియన్ వ్యాపార విధానాలపై దర్యాప్తు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు సూచించారు. ఈ చట్టం కింద దర్యాప్తు పూర్తి అయితే, యూరోప్ నుండి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపై భారీగా అదనపు టారిఫ్‌లు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడికి ఉంటుంది.
యూరోపియన్ యూనియన్, గూగుల్ స్పందన
ఈ వ్యవహారంపై యూరోపియన్ కమిషన్ ఉపాధ్యక్షురాలు తేరెసా రిబేరా స్పందిస్తూ.. ఎంత పెద్ద కంపెనీ అయినా మార్కెట్లో ఇతరులను తొక్కేసే హక్కు ఉండదని, అందరికీ సమాన అవకాశాలు ఉండాలనే ఉద్దేశంతోనే ఈ చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు.
మరోవైపు గూగుల్ సీనియర్ అధికారి కెంట్ వాకర్ యూరోప్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఈ నిర్ణయం తమ ఉత్పత్తుల నాణ్యతను తగ్గిస్తుందని, దీనివల్ల అంతిమంగా వినియోగదారులే నష్టపోతారని వ్యాఖ్యానించారు. 2017 నుంచి ఇప్పటివరకు యూరోపియన్ యూనియన్ ఆండ్రాయిడ్, ఆన్‌లైన్ అడ్వర్టైజింగ్ తదితర కేసుల్లో గూగుల్‌పై బిలియన్ల కొద్దీ డాలర్ల జరిమానాలు విధించింది. ఈ కొత్త వివాదం గ్లోబల్ టెక్ రంగాన్ని, పెట్టుబడిదారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

