US Defense Budget : అగ్రరాజ్యం అమెరికాను రక్షణ రంగంలో తిరుగులేని శక్తిగా మార్చేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ స్కెచ్ వేశారు. 2027 ఆర్థిక సంవత్సరానికి గాను ఏకంగా 1.5 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ.125 లక్షల కోట్లు) మెగా డిఫెన్స్ బడ్జెట్‌ను ప్రతిపాదించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా చరిత్రలోనే రక్షణ రంగానికి కేటాయించిన అతిపెద్ద వార్షిక బడ్జెట్ ఇదే కావడం విశేషం. కేవలం ఆయుధాలే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డ్రోన్లు, అత్యాధునిక యుద్ధనౌకల తయారీపై ఈ బడ్జెట్‌లో సింహభాగం కేటాయించారు.

బడ్జెట్‌లో ప్రధానాంశాలు - టెక్నాలజీకే పెద్దపీట

ట్రంప్ ప్రతిపాదించిన ఈ బడ్జెట్‌లో ప్రెసిడెన్షియల్ ప్రయారిటీస్ పేరుతో కొత్త విభాగాలను చేర్చారు. ఇందులో ప్రధానంగా గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థ, ఏఐ (AI) డేటా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డ్రోన్ డామినెన్స్‌పై దృష్టి పెట్టారు. కేవలం పాతకాలం ఆయుధాలతో కాకుండా, ఆధునిక సాంకేతికతతో యుద్ధం చేసేలా అమెరికా సైన్యాన్ని తీర్చిదిద్దడం ఈ బడ్జెట్ ప్రధాన ఉద్దేశ్యం.

సముద్రంపై పట్టు కోసం గోల్డెన్ ఫ్లీట్

నౌకాదళాన్ని బలోపేతం చేసేందుకు ట్రంప్ భారీగా నిధులు కేటాయించారు. 18 యుద్ధనౌకలు, 16 సపోర్ట్ షిప్‌ల తయారీ కోసం సుమారు 65 బిలియన్ డాలర్లను కేటాయించారు. 1962 తర్వాత నౌకాదళానికి ఈ స్థాయిలో ఆర్డర్లు ఇవ్వడం ఇదే మొదటిసారి. చైనా సముద్రంలో ఎదురవుతున్న సవాళ్లను తిప్పికొట్టడమే లక్ష్యంగా ఈ గోల్డెన్ ఫ్లీట్ ప్రాజెక్టును చేపట్టారు.

ఆకాశంలో డ్రోన్ల హవా

ఈ బడ్జెట్‌లో డ్రోన్ల తయారీ, పరిశోధనల కోసం రికార్డు స్థాయిలో నిధులు కేటాయించారు. అటానమస్ డ్రోన్ ప్లాట్‌ఫామ్‌ల కోసం 53.6 బిలియన్ డాలర్లు, యాంటీ డ్రోన్ టెక్నాలజీ కోసం 21 బిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నారు. అంటే యుద్ధ రంగంలో మనుషులు కాకుండా డ్రోన్లే కీలక పాత్ర పోషించబోతున్నాయని స్పష్టమవుతోంది. అలాగే లాక్‌హీడ్ మార్టిన్ F-35 ఫైటర్ జెట్ల కొనుగోలును ఏటా 85కి పెంచారు.

సైనికులకు శుభవార్త - కొత్త నియామకాలు

ఆయుధాలతో పాటు సైనికుల సంక్షేమానికి కూడా ట్రంప్ ప్రాధాన్యం ఇచ్చారు. జూనియర్ సైనికులకు 7%, మధ్య స్థాయి అధికారులకు 6%, టాప్ ర్యాంక్ అధికారులకు 5% చొప్పున జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా, 2027లో కొత్తగా 44,000 మంది సైనికులను రిక్రూట్ చేసుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే ప్రస్తుతం ఇరాన్‌తో జరుగుతున్న ఉద్రిక్తతల కోసం ఈ బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు చూపలేదు, అవసరమైతే వాటి కోసం సప్లిమెంటరీ బడ్జెట్ తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.

బడ్జెట్ విభజన

ఈ మొత్తం 1.5 ట్రిలియన్ డాలర్లను రెండు భాగాలుగా విభజించారు. 1.15 ట్రిలియన్ డాలర్లను బేస్ బడ్జెట్‌గా, మిగిలిన 350 బిలియన్ డాలర్లను ఎక్స్‌ట్రా ప్యాకేజీగా ప్రతిపాదించారు. దీన్ని ఆమోదించుకోవడానికి అమెరికా కాంగ్రెస్‌లో ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టనున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story