7శాతం పడిపోయిన రేట్లు

Crude Oil Prices : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ విరమణ ప్రకటించగానే దాని ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలపై స్పష్టంగా కనిపించింది. ఈ ప్రకటన తర్వాత బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్, యూఎస్ డబ్ల్యూటీఐ ధరలు భారీగా పడిపోయాయి. రెండు రకాల చమురు ధరలు కలిపి దాదాపు 7 శాతం వరకు తగ్గాయి. ఈ పరిణామం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపబోతోంది.

ట్రంప్ యుద్ధ విరమణ ప్రకటనతో, చమురు ధరలు ఒక్కసారిగా ధడాల్ మని పడిపోయాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 2.69 డాలర్లు (3.76%) తగ్గి 68.79 డాలర్లకు చేరుకుంది. సెషన్ ప్రారంభంలోనే 4% కంటే ఎక్కువ పడిపోయిన తర్వాత, ఇది జూన్ 11 తర్వాత అత్యల్ప స్థాయికి చేరింది. యూఎస్ డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 2.7 డాలర్లు (3.94%) తగ్గి 65.46 డాలర్లకు పడిపోయింది. ఇది సెషన్ ప్రారంభంలోనే జూన్ 9 తర్వాత అత్యంత బలహీనమైన స్థాయికి పడిపోయి, దాదాపు 6% నష్టపోయింది.

సోమవారం ట్రంప్ ప్రకటన చేస్తూ, ఇజ్రాయెల్, ఇరాన్ పూర్తి యుద్ధ విరమణకు అంగీకరించాయని తెలిపారు. "ఇరాన్ వెంటనే యుద్ధ విరమణను ప్రారంభిస్తుంది, ఆ తర్వాత 12 గంటల్లో ఇజ్రాయెల్ కూడా యుద్ధ విరమణను మొదలుపెడుతుంది. రెండు వైపులా శాంతిని పాటిస్తే, 24 గంటల తర్వాత యుద్ధం అధికారికంగా ముగుస్తుంది. దీంతో 12 రోజుల పాటు కొనసాగిన సంఘర్షణకు తెరపడుతుంది" అని ట్రంప్ స్పష్టం చేశారు.

బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్, యూఎస్ డబ్ల్యూటీఐ... రెండు చమురు ఒప్పందాలు గత సెషన్‌లో 7% కంటే ఎక్కువ భారీగా పడిపోయాయి. అమెరికా వారం చివరిలో ఇరాన్ అణు స్థావరాలపై దాడి చేసిన తర్వాత చమురు ధరలు ఐదు నెలల గరిష్ట స్థాయికి చేరాయి. ఈ దాడి ఇజ్రాయెల్-ఇరాన్ సంఘర్షణ తీవ్రమవుతుందనే ఆందోళనలను పెంచింది. ప్రపంచంలో మూడో అతిపెద్ద ముడి చమురు ఉత్పత్తిదారు అయిన ఇరాన్, ఈ ఉద్రిక్తతలు తగ్గితే తన చమురు ఎగుమతులను పెంచే అవకాశం ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story