H1B Visa: ట్రంప్ కొత్త H-1B రూల్.. అమెరికాలో చదివి ఉద్యోగం సాధించడం ఇక అంత ఈజీ కాదు
ఇక అంత ఈజీ కాదు

H1B Visa:ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి, చదువు పూర్తయిన తర్వాత అక్కడే సాఫ్ట్‌వేర్ లేదా ఇతర కార్పొరేట్ ఉద్యోగాలు చేయాలని భావిస్తున్న భారతీయ విద్యార్థుల ఆశలపై ట్రంప్ ప్రభుత్వం నీళ్లు చల్లేలా ఒక ప్రతిపాదన తెచ్చింది. డోనాల్డ్ ట్రంప్ పరిపాలనా యంత్రాంగం H-1B వీసా ప్రాసెసింగ్‌కు సంబంధించి ఒక కొత్త ఫీజును తీసుకురావాలని భావిస్తోంది. దీని ప్రకారం, ఎంపిక చేసిన కొన్ని H-1B దరఖాస్తులపై కంపెనీలు 1,03,265 డాలర్లు (భారతీయ కరెన్సీలో సుమారు రూ.90 లక్షలకు పైగానే) రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది.
విదేశీ విద్యార్థులపైనే పడనున్న ప్రత్యక్ష ప్రభావం
అమెరికాలో అత్యధిక సంఖ్యలో విదేశీ విద్యార్థులు F-1 వీసాపై చదువుకుంటారు. కోర్సు పూర్తయిన తర్వాత వారు H-1B వీసా పొంది ఉద్యోగాల్లో చేరడం ఆనవాయితీగా వస్తోంది. అయితే కొత్త ప్రతిపాదన ప్రకారం.. F-1 వీసాపై ఉన్న విద్యార్థి H-1B వార్షిక లాటరీలో ఎంపికై, సదరు కంపెనీ అతని కోసం అప్లై చేస్తే, కంపెనీ ఈ భారీ రుసుమును చెల్లించాల్సి వస్తుంది. అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ చదివిన వారికి ప్రత్యేకంగా కేటాయించే 20,000 వీసా సీట్ల కింద అప్లై చేసే వారికి కూడా ఈ నిబంధన వర్తిస్తుంది.
కంపెనీల బాధ్యతే.. కానీ అభ్యర్థులకే నష్టం
ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయమేమిటంటే.. ఈ $1,03,265ల ఫీజును విద్యార్థులు సొంతంగా చెల్లించాల్సిన అవసరం లేదు. సదరు అభ్యర్థిని హైర్ చేసుకునే అమెరికన్ కంపెనీయే ఈ మొత్తాన్ని భరించాల్సి ఉంటుంది. అయినప్పటికీ, ఒకే ఒక్క ఉద్యోగి వీసా కోసం దాదాపు రూ. 90 లక్షలు ఖర్చు చేయడానికి కంపెనీలు వెనుకాడతాయి. దీనివల్ల విదేశీ విద్యార్థులను లేదా భారత్ వంటి దేశాల నుంచి కొత్త ఉద్యోగులను తీసుకోవడానికి కంపెనీలు ఆసక్తి చూపకపోవచ్చు, ఫలితంగా ఉద్యోగావకాశాలు గణనీయంగా తగ్గే ప్రమాదం ఉంది.
పాత ఫీజు నిబంధనకు, దీనికి తేడా ఏమిటి?
గతంలో కూడా ట్రంప్ సర్కార్ లక్ష డాలర్ల ఫీజు గురించి ప్రకటించినప్పటికీ, అది ప్రధానంగా అమెరికా వెలుపల (ఉదాహరణకు భారత్ నుండి నేరుగా) ఉన్న H-1B ఉద్యోగులను అమెరికాకు తీసుకురావడానికి సంబంధించినది. కానీ ప్రస్తుత కొత్త ప్రతిపాదన అమెరికాలోనే F-1 వీసాపై ఉంటూ చదువు పూర్తి చేసిన విద్యార్థులపై కూడా పడుతుంది. అయితే ఇప్పటికే H-1B పొంది పని చేస్తున్న పాత ఉద్యోగుల వీసా ఎక్స్‌టెన్షన్‌కు లేదా కంపెనీ మారడానికి ఈ కొత్త ఫీజు వర్తించదని సమాచారం. ఈ ప్రతిపాదన ప్రస్తుతం చర్చల దశలోనే ఉందని, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాతే తుది నిర్ణయం వెలువడుతుందని నిపుణులు చెబుతున్నారు.

