Trump Tariffs : ట్రంప్ టారిఫ్ బాంబు..రష్యా నుంచి చమురు కొంటే 500 శాతం టాక్స్..భారత్, చైనాలే టార్గెట్
భారత్, చైనాలే టార్గెట్

Trump Tariffs : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రెండో ఇన్నింగ్స్‌లో ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తున్నారు. ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై ఆయన ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యారు. ఈ జాబితాలో భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలు ప్రధానంగా ఉన్నాయి. రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొంటూ పుతిన్ యుద్ధ యంత్రానికి ఇంధనాన్ని అందిస్తున్నారనేది ట్రంప్ ప్రధాన ఆరోపణ. దీనిని అడ్డుకోవడానికి ఏకంగా 500 శాతం టారిఫ్ విధిస్తామంటూ ట్రంప్ హెచ్చరించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. అధ్యక్షుడు ట్రంప్ రష్యా ఆంక్షల బిల్లు 2025కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ బిల్లు ప్రకారం రష్యా నుంచి వస్తువులు లేదా సేవలను దిగుమతి చేసుకునే దేశాలపై భారీగా జరిమానాలు విధిస్తారు. ముఖ్యంగా రష్యా నుంచి దిగుమతి అయ్యే అన్ని వస్తువులపై కనీసం 500 శాతం పన్ను పెంచాలని ప్రతిపాదించారు. వచ్చే వారం ఈ బిల్లుపై సెనేట్‌లో ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీయడం ద్వారా యుద్ధాన్ని ఆపడమే ట్రంప్ లక్ష్యమని గ్రాహం పేర్కొన్నారు.
రష్యా నుంచి భారీగా ముడి చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్, చైనా , బ్రెజిల్ దేశాలపై అపరిమితమైన ఒత్తిడి తీసుకురావడానికి ఈ బిల్లును ఒక ఆయుధంగా ట్రంప్ వాడుకోనున్నారు. ఇటీవల రిపబ్లికన్ పార్టీ నేతలతో జరిగిన భేటీలో ట్రంప్ మాట్లాడుతూ.. భారత్‌పై తాము విధిస్తున్న అధిక టారిఫ్‌ల పట్ల ప్రధాని నరేంద్ర మోదీ అసంతృప్తిగా ఉన్నారని వ్యాఖ్యానించారు. మోదీతో తనకు మంచి సంబంధాలు ఉన్నప్పటికీ, రష్యా చమురు కొనుగోలు విషయంలో అమెరికా ప్రయోజనాలే ముఖ్యమని ట్రంప్ స్పష్టం చేశారు. ఒకవేళ భారత్ తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే టారిఫ్‌లను మరింత పెంచుతామని ఆయన హెచ్చరించారు.
అయితే ట్రంప్ చేసిన వ్యాఖ్యలను భారత్ గతంలోనే తోసిపుచ్చింది. రష్యా నుంచి చమురు కొనడం ఆపేస్తామని మోదీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్ చేసిన వాదనలో నిజం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరలు మారుతున్న తరుణంలో, తమ దేశ ఇంధన భద్రత, జాతీయ ప్రయోజనాల ఆధారంగానే నిర్ణయాలు ఉంటాయని భారత్ తేల్చి చెప్పింది. ఏ దేశం ఒత్తిడికి తలొగ్గే ప్రసక్తే లేదని ఢిల్లీ తన విదేశీ విధానాన్ని చాటిచెప్పింది.
ఈ కొత్త చట్టం ప్రకారం రష్యాతో వ్యాపారం చేసే వ్యక్తులు, సంస్థలపై కఠినమైన చర్యలు ఉంటాయి. కేవలం చమురు మాత్రమే కాకుండా రష్యాకు సహకరించే ఏ దేశం నుంచైనా అమెరికాకు వచ్చే దిగుమతులపై 500% వరకు సుంకం విధించే అధికారం అధ్యక్షుడికి లభిస్తుంది. దీనివల్ల ఆయా దేశాల ఎగుమతులు అమెరికాలో చాలా ఖరీదైనవిగా మారి, మార్కెట్ దెబ్బతినే ప్రమాదం ఉంది. ట్రంప్ తన అమెరికా ఫస్ట్ విధానంలో భాగంగానే ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.

