రూ.16 లక్షల కోట్లు వెనక్కి ఇచ్చేయాలని సంచలన తీర్పు

Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు న్యాయస్థానంలో భారీ షాక్ తగిలింది. ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వాణిజ్య విధానాలపై కోర్టు కొరడా ఝుళిపించింది. ట్రంప్ హయాంలో అక్రమంగా వసూలు చేసిన పన్నులను తిరిగి చెల్లించాలని కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ ఒక్క నిర్ణయంతో అమెరికా ఖజానాకు అక్షరాలా రూ.16 లక్షల కోట్ల గండి పడనుంది. అమెరికా వాణిజ్య చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో రీఫండ్ ఇవ్వాల్సి రావడం ఇదే తొలిసారి.

అసలేం జరిగిందంటే.. 1977 నాటి ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్‎ను అడ్డుపెట్టుకుని ట్రంప్ ప్రభుత్వం విదేశీ దిగుమతులపై భారీగా టారిఫ్స్ విధించింది. అయితే ఈ పన్నుల విధింపు రాజ్యాంగ విరుద్ధమని గత నెలలో అమెరికా సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. తాజాగా న్యూయార్క్ ఫెడరల్ జడ్జి రిచర్డ్ ఈటన్ మరో అడుగు ముందుకేసి.. కేవలం కోర్టుకు వచ్చిన కంపెనీలకే కాకుండా, ఈ చట్టం కింద పన్నులు కట్టిన ప్రతి దిగుమతిదారునికి ఆ సొమ్మును వడ్డీతో సహా తిరిగి ఇచ్చేయాలని ఆదేశించారు. ఇది వేలాది కంపెనీలకు ఊరటనిచ్చే అంశం.

ఈ తీర్పు వల్ల అమెరికా ప్రభుత్వం సుమారు 175 బిలియన్ డాలర్లు (రూ.16.12 లక్షల కోట్లు) రీఫండ్ రూపంలో చెల్లించాల్సి ఉంటుందని అంచనా. ఇప్పటికే డిసెంబర్ మధ్య నాటికి ప్రభుత్వం రూ.12 లక్షల కోట్లు వసూలు చేసింది. ఈ భారీ మొత్తాన్ని వెనక్కి ఇవ్వాల్సి రావడంతో ట్రంప్ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ ప్రక్రియను ఆలస్యం చేసేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను కూడా అప్పీల్ కోర్టు తిరస్కరించింది. కేసును త్వరగా తేల్చాలని అధికారులను ఆదేశించింది.

అయితే, ట్రంప్ ఊరుకుంటారా? కోర్టు షాక్ నుంచి తేరుకోకముందే ఆయన మరో కొత్త ఎత్తుగడ వేశారు. కోర్టు కొట్టేసిన 10 శాతం పన్నుకు బదులుగా, ఇప్పుడు దానిని 15 శాతానికి పెంచుతూ కొత్త పన్ను విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించారు. దీనిపై ఈ వారంలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ కొత్త పన్నులు కేవలం 150 రోజుల వరకు మాత్రమే అమలులో ఉండే అవకాశం ఉంది. ఈ లోపు పాత పద్ధతుల్లో కాకుండా, మరింత పటిష్టమైన చట్టపరమైన మార్గాల ద్వారా పన్నులు ఎలా విధించాలో ట్రంప్ టీమ్ కసరత్తు చేస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story