UDAN 2.0 : సామాన్యుడి విమాన ప్రయాణానికి రూ.28,840 కోట్లు.. ఉడాన్ పథకం మరో పదేళ్లు పొడిగింపు
ఉడాన్ పథకం మరో పదేళ్లు పొడిగింపు

UDAN 2.0 : సామాన్యుడు కూడా విమానం ఎక్కాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉడాన్ పథకం సరికొత్త రూపంలో ముందుకు రాబోతోంది. ఈ పథకాన్ని మరో పదేళ్ల పాటు, అంటే 2035-36 వరకు పొడిగిస్తూ కేంద్ర మంత్రివర్గం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఏకంగా రూ.28,840 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించింది. దీనివల్ల దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా విమాన ప్రయాణం అందుబాటులోకి రానుంది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ పథకం వివరాలను మీడియాకు వెల్లడించారు. దీని ప్రకారం, ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న ఎయిర్‌స్ట్రిప్ లను అభివృద్ధి చేసి, వాటిని వంద పూర్తి స్థాయి విమానాశ్రయాలుగా మారుస్తారు. దీనికోసం రాబోయే ఎనిమిదేళ్లలో రూ.12,159 కోట్లు ఖర్చు చేయనున్నారు. వీటితో పాటు మారుమూల ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలు, పర్యాటకాన్ని పెంపొందించడానికి 200 ఆధునిక హెలిప్యాడ్లను అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం సుమారు రూ.3,661 కోట్లు కేటాయించారు. ఈ చర్యల వల్ల చిన్న పట్టణాల్లో ఆర్థిక వృద్ధి పెరగడమే కాకుండా, ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయి.
మేడ్-ఇన్-ఇండియా విమానాలకే మొగ్గు
ఈ పథకంలో మరో విశేషం ఏంటంటే, విదేశీ విమానాల కంటే స్వదేశీ విమానాల తయారీకి, కొనుగోలుకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా రూ.400 కోట్లు కేటాయించింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) తయారు చేసే ధృవ్ హెలికాప్టర్లను పవన్ హన్స్ కోసం, అలాగే డోర్నియర్ విమానాలను అలయన్స్ ఎయిర్ కోసం కొనుగోలు చేయనున్నారు. దీనివల్ల దేశీయంగా విమానాల తయారీ రంగం బలోపేతం అవడమే కాకుండా, చిన్న విమానాల కొరత తీరి ప్రాంతీయ విమాన సర్వీసులు మరింత వేగంగా నడుస్తాయి.
ఎయిర్ లైన్లకు ఆర్థిక చేయూత
విమానయాన సంస్థలు నష్టపోకుండా ఉండేందుకు, మారుమూల ప్రాంతాలకు సర్వీసులు నడిపే కంపెనీలకు ప్రభుత్వం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద రూ.10,043 కోట్లు అందజేయనుంది. అంటే టికెట్ ధరలు తక్కువగా ఉన్నప్పుడు వచ్చే నష్టాన్ని ప్రభుత్వం భరిస్తుందన్నమాట. అలాగే విమానాశ్రయాల నిర్వహణ (O&M) కోసం ప్రతి ఎయిర్‌పోర్ట్‌కు ఏడాదికి రూ.3 కోట్లు, ప్రతి హెలిప్యాడ్‌కు రూ.90 లక్షల వరకు ఆర్థిక సహాయం ఇస్తారు. దీనివల్ల చిన్న ఎయిర్ పోర్టులు కూడా ప్రపంచ స్థాయి సౌకర్యాలతో నడుస్తాయి.
వికసిత్ భారత్ 2047 దిశగా అడుగులు
2016లో ప్రారంభమైన ఉడాన్ పథకం ద్వారా ఇప్పటివరకు (ఫిబ్రవరి 2026 నాటికి) 95 విమానాశ్రయాలు, హెలిపోర్ట్ లలో 663 రూట్లలో విమానాలు నడుస్తున్నాయి. సుమారు 1.62 కోట్ల మంది ప్రయాణికులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. ఇప్పుడు ఈ పథకాన్ని మరింత విస్తరించడం వల్ల టీర్-2, టీర్-3 నగరాల్లో వ్యాపారాలు, టూరిజం ఒక రేంజ్ లో పెరుగుతాయని నిపుణులు భావిస్తున్నారు. భారతదేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంలో భాగంగా ఏవియేషన్ రంగాన్ని బలోపేతం చేయడం అత్యంత అవసరమని ప్రభుత్వం భావిస్తోంది.

