New Aadhaar App : కొత్త ఆధార్ యాప్ ఎలా సెటప్ చేయాలి? మీ ఆధార్ డేటాను మరింత సురక్షితంగా మార్చుకోండి
మీ ఆధార్ డేటాను మరింత సురక్షితంగా మార్చుకోండి

New Aadhaar App : దేశంలో గుర్తింపునకు అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్ అయిన ఆధార్ కార్డు ఇప్పుడు మరింత అధునాతన రూపంలో అందుబాటులోకి వచ్చింది. యూఐడీఏఐ తాజాగా సరికొత్త ఆధార్ యాప్ ను విడుదల చేసింది. ఈ కొత్త యాప్ పాతదాని కంటే మరింత సురక్షితంగా, సులభంగా, పేపర్‌లెస్ పద్ధతిలో పనిచేస్తుంది. దీని ద్వారా ఆధార్ సంబంధిత సేవలను ఎప్పుడైనా, ఎక్కడైనా మొబైల్‌లోనే ఉపయోగించుకోవచ్చు. ప్రభుత్వం విడుదల చేసిన ఈ యాప్‌లో ఏయే ఫీచర్లు ఉన్నాయి, దీనిని ఎలా ఉపయోగించాలి అనే పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
యూఐడీఏఐ తమ కొత్త ఆధార్ యాప్‌ను విడుదల చేసినట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X ద్వారా తెలియజేసింది. ఈ కొత్త యాప్ ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ యాప్ దేశంలోని డిజిటల్ ఐడెంటిటీ ప్లాట్‌ఫామ్‌ను మరింత మెరుగుపరుస్తుంది. ఇప్పుడు యూజర్లు తమ గుర్తింపు సంబంధిత సేవలను డిజిటల్‌గా, సురక్షితంగా ఉపయోగించుకోవచ్చు. ఈ యాప్‌లో లాగిన్ ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు, డేటా భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో ప్రతిసారీ ఫిజికల్ ఆధార్ కార్డును వెంట ఉంచుకోవాల్సిన అవసరం తగ్గుతుంది.
కొత్త ఆధార్ యాప్ ముఖ్య ఫీచర్లు
ఈ కొత్త యాప్ పౌరుల భద్రత, సౌలభ్యం కోసం అనేక అత్యాధునిక ఫీచర్లను తీసుకొచ్చింది. యూజర్లు తమ బయోమెట్రిక్ డేటాను (వేలిముద్రలు, కనుపాప) లాక్ లేదా అన్‌లాక్ చేసుకునే సౌకర్యం ఉంది. దీని వల్ల దుర్వినియోగం అయ్యే ప్రమాదం తగ్గుతుంది. ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా కూడా ఆధార్ వెరిఫికేషన్ చేయవచ్చు. ఇది భద్రతను మరింత పెంచుతుంది. యూజర్లు తమ గుర్తింపును డిజిటల్ పద్ధతిలో షేర్ చేయవచ్చు. అలాగే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే ఫీచర్ కూడా ఇందులో ఉంది. ఆధార్‌లో ఏ సమాచారాన్ని ఇతరులతో పంచుకోవాలి, దేన్ని పంచుకోకూడదో యూజరే నిర్ణయించుకోవచ్చు. మీ ఆధార్ కార్డును ఎప్పుడు, ఎక్కడ ఉపయోగించారో యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఒకే యాప్‌లో కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డులను సురక్షితంగా యాడ్ చేసుకునే అవకాశం ఉంది.
యాప్ సెటప్ విధానం
కొత్త ఆధార్ యాప్‌ను ఉపయోగించడానికి ఈ ఈజీ స్టెప్స్ ఫాలో అవ్వండి. ఆండ్రాయిడ్ లేదా iOS స్టోర్ నుంచి Aadhaar Appను డౌన్‌లోడ్ చేయండి. అవసరమైన అనుమతులు ఇచ్చి, మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి. నిబంధనలు, షరతులు అంగీకరించి, ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌ను వెరిఫై చేయండి. మొబైల్ ధృవీకరణ తప్పనిసరి. తదుపరి దశలో ఫేస్ అథెంటికేషన్ ప్రక్రియను పూర్తి చేయండి. చివరగా, యాప్ కోసం ఒక సెక్యూరిటీ పిన్‌ను సెట్ చేసుకొని, ఆధార్ సేవలను ఉపయోగించడం ప్రారంభించవచ్చు.

