Unemployment : గ్రామాల్లో ఊరట..నగరాల్లో నోకరీ కరువు..డిసెంబర్ నిరుద్యోగ గణాంకాలు విడుదల
డిసెంబర్ నిరుద్యోగ గణాంకాలు విడుదల

Unemployment : దేశంలో 15 ఏళ్లు పైబడిన వారిలో నిరుద్యోగిత రేటు పెరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నవంబర్‌లో 4.7 శాతంగా ఉన్న నిరుద్యోగిత, డిసెంబర్ నాటికి 4.8 శాతానికి చేరుకుంది. ఇది చిన్న మార్పులా అనిపించినా మనలాంటి భారీ జనాభా ఉన్న దేశంలో లక్షలాది మంది యువత ఉపాధి కోసం రోడ్ల మీద పడటంతో సమానం. పీఎల్ఎఫ్ఎస్ నివేదిక ప్రకారం.. గ్రామాల్లో నిరుద్యోగిత రేటు 3.9 శాతం వద్ద స్థిరంగా కొనసాగుతోంది. కానీ నగరాల్లో మాత్రం పరిస్థితి దారుణంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం 6.5 శాతం నుంచి 6.7 శాతానికి ఎగబాకింది.
ఈ గణాంకాలను గమనిస్తే పట్టణ ప్రాంతాల్లోని పురుషులపై నిరుద్యోగ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. నగరాల్లో పని చేసే పురుషుల నిష్పత్తి 70.9 శాతం నుంచి 70.4 శాతానికి పడిపోయింది. అంటే పట్టణాల్లో మగవారికి ఉద్యోగ అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. అయితే, ఆశ్చర్యకరంగా పట్టణ మహిళల్లో నిరుద్యోగిత రేటు 9.3 శాతం నుంచి 9.1 శాతానికి తగ్గింది. అంటే నగరాల్లో మహిళలు గతంలో కంటే చురుగ్గా ఉపాధి పొందుతున్నారు. అటు గ్రామాల్లో కూడా మహిళలు వ్యవసాయం, స్థానిక పరిశ్రమల్లో తమ భాగస్వామ్యాన్ని పెంచుకుంటున్నారు.
దేశ ఆర్థిక స్థితిని అంచనా వేసే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ కూడా డిసెంబర్‌లో పెరిగింది. నవంబర్‌లో 55.8 శాతంగా ఉన్న ఈ రేటు, డిసెంబర్‌లో 56.1 శాతానికి చేరింది. దీని అర్థం ఏమిటంటే.. పని చేయాలనే ఆసక్తితో ఇంటి నుంచి బయటకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పని కోసం వెతుకుతున్న వారి సంఖ్య 59 శాతానికి చేరగా, నగరాల్లో ఇది 50.2 శాతం వద్దే ఉంది. పెరిగిన ఖర్చులు, ఇంటి అవసరాల దృష్ట్యా ఎక్కువ మంది ఉపాధి వేటలో పడ్డట్లు ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.
ఈ నివేదికను సుమారు 3.73 లక్షల మందిపై సర్వే చేసి రూపొందించారు. నిరుద్యోగిత, ఉపాధి అవకాశాల గురించి మరింత స్పష్టమైన డేటాను సేకరించేందుకు జనవరి 2025 నుంచి ప్రభుత్వం గణన పద్ధతిని మార్చింది. వచ్చే నెల నుంచి రాబోయే నివేదికల్లో మరిన్ని ఖచ్చితమైన వివరాలు వెల్లడి కానున్నాయి. ప్రస్తుతానికి మాత్రం నగరాల్లో నివసించే సామాన్యులకు పెరుగుతున్న నిరుద్యోగం ఒక పెద్ద సవాలుగా మారింది.

