EPFO : భారతదేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు చేస్తూ పీఎఫ్ ఖాతాలు కలిగి ఉన్న లక్షలాది మంది మధ్యతరగతి ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. పీఎఫ్ ఖాతాదారులు తమ డిజిటల్ రికార్డులను భద్రపరచడంతో పాటు ఆన్‌లైన్ సేవలను వేగవంతం చేయడానికి ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఖాతాదారులు తమ యూనిఫైడ్ మెంబర్ పోర్టల్‎లో వెంటనే తమ లేటెస్ట్ ప్రొఫైల్ ఫోటోను అప్‌డేట్ చేయాలని ఈపీఎఫ్ఓ కోరింది. ఒకవేళ ఈ ఫోటో అప్‌డేట్ చేయకపోతే ఆన్‌లైన్ ద్వారా పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవడానికి లేదా ఇతర క్లెయిమ్‌లు సెటిల్ చేసుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతాయని స్పష్టం చేసింది.

మనీకంట్రోల్ నివేదికల ప్రకారం.. ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో ఆన్‌లైన్ వెరిఫికేషన్ ప్రక్రియ సజావుగా సాగడానికి ఈ ప్రొఫైల్ ఫోటో ఎంతో అవసరం. ముఖ్యంగా మీ పీఎఫ్ అకౌంట్‌ ఈ-నామినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలంటే ప్రొఫైల్ ఫోటో అప్‌డేట్ తప్పనిసరి. ఖాతాదారుడికి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లేదా పదవీ విరమణ చేసినప్పుడు ఈపీఎఫ్ బ్యాలెన్స్‌తో పాటు ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS), ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) ద్వారా వచ్చే ఆర్థిక ప్రయోజనాలు సరైన లబ్ధిదారునికి సులభంగా బదిలీ కావడానికి ఈ నామినేషన్ ప్రక్రియ ఉపయోగపడుతుంది. ఒకవేళ అకౌంట్ హోల్డర్ నామినీని ఎంచుకోకపోతే, భవిష్యత్తులో వారి కుటుంబ సభ్యులు డబ్బు క్లెయిమ్ చేయడానికి భారీగా పేపర్ వర్క్ చేయాల్సి వస్తుంది, తీవ్ర ఆలస్యం జరుగుతుంది. ఈ-నామినేషన్ చెల్లుబాటు కావడానికి ఈ-సైన్ ప్రక్రియను కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్ పీఎఫ్ క్లెయిమ్స్ సులభం కావాలా?

* మీ పీఎఫ్ ఖాతాలో లేటెస్ట్ ఫోటో లేకపోతే, ఇంటి వద్ద నుంచే ఆన్‌లైన్ ద్వారా చాలా సులభంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. దీనికోసం క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి:

* మొదటగా ఈపీఎఫ్ఓ యూనిఫైడ్ మెంబర్ పోర్టల్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

* మీ విశ్వసనీయమైన యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN), పాస్‌వర్డ్, స్క్రీన్ పై కనిపించే క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.

* అనంతరం మెయిన్ డాష్‌బోర్డ్‌లోకి వెళ్లి, అక్కడ కనిపించే ప్రొఫైల్ లేదా వ్యూ సెక్షన్‌పై క్లిక్ చేయండి.

* ఆ తర్వాత మీ తాజా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను అప్‌లోడ్ లేదా అప్‌డేట్ చేసే ఆప్షన్‌ను ఎంచుకుని, ఫోటోను సెలెక్ట్ చేసి మార్పులను సేవ్ చేయండి.

* అయితే, ఈ-నామినేషన్ లేదా ఆన్‌లైన్ పీఎఫ్ క్లెయిమ్ దరఖాస్తు చేసుకునే ముందు అప్‌డేట్ చేసిన ఫోటో మీ ప్రొఫైల్‌పై స్పష్టంగా కనిపిస్తోందో లేదో ఒకసారి సరిచూసుకోవడం మంచిది.

పీఎఫ్ ఖాతాలో ఎవరిని పడితే వారిని నామినీగా పెట్టడానికి వీలుండదు. దీనికోసం ఈపీఎఫ్ఓ కొన్ని స్పష్టమైన నిబంధనలను విధించింది. పురుష సబ్‌స్క్రైబర్ల విషయానికి వస్తే.. వారి భార్య, పిల్లలు, వారిపై ఆధారపడిన తల్లిదండ్రులు, అలాగే మరణించిన కుమారుడి భార్య, వారి పిల్లలు అర్హులుగా ఉంటారు. అదేవిధంగా మహిళా సబ్‌స్క్రైబర్ల విషయానికి వస్తే.. వారి భర్త, పిల్లలు, వారిపై ఆధారపడిన తల్లిదండ్రులు, భర్త తరపున ఆధారపడిన తల్లిదండ్రులు నామినీలుగా ఉండటానికి అర్హులు. వివాహితులైన సబ్‌స్క్రైబర్లు తమ జీవిత భాగస్వామి (భర్త/భార్య) పేరును ఖచ్చితంగా నామినేషన్ జాబితాలో చేర్చాల్సి ఉంటుంది. అలాగే నామినీగా ఎంచుకున్న కుటుంబ సభ్యుడి ఫోటోతో పాటు వారి గుర్తింపు కార్డు కాపీని కూడా పోర్టల్‌లో సమర్పించాల్సి ఉంటుంది.

కేవలం ప్రొఫైల్ ఫోటోను అప్‌డేట్ చేయడం మాత్రమే కాకుండా, పీఎఫ్ ఖాతాదారులు తమ అకౌంట్ పూర్తిగా అప్‌డేట్‌గా ఉందో లేదో క్రమం తప్పకుండా చూసుకోవాలి. మీ పీఎఫ్ ఖాతాకు మీ అధికారిక గుర్తింపు కార్డు వివరాలు, పాన్ కార్డ్, సరైన బ్యాంక్ ఖాతా వివరాలు (IFSC కోడ్‌తో సహా), ప్రస్తుత మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ సరిగ్గా లింక్ అయి వెరిఫై అయ్యాయో లేదో చూసుకోవడం చాలా ముఖ్యం. ఈ వివరాలన్నీ సరిగ్గా ఉంటేనే ఈపీఎఫ్ఓ అందించే డిజిటల్ సేవలైన ఈ-నామినేషన్, ఆన్‌లైన్ పీఎఫ్ విత్‌డ్రాయల్, పెన్షన్ సేవలను ఎలాంటి అడ్డంకులు లేకుండా పొందవచ్చు. దీనివల్ల క్లెయిమ్ చేసిన కొద్ది రోజుల్లోనే డబ్బులు నేరుగా మీ బ్యాంక్ ఖాతాలోకి చేరతాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story