UPI : ప్రపంచంలోనే నంబర్ 1 పేమెంట్ సిస్టమ్‌గా చరిత్ర సృష్టించిన యూపీఐ
చరిత్ర సృష్టించిన యూపీఐ

UPI : భారతదేశానికి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) హిస్టరీ క్రియేట్ చేసింది. ఇది ఆర్థిక చెల్లింపుల వ్యవస్థలో ఒక పెద్ద విప్లవాన్ని తీసుకువస్తోంది. దశాబ్దాలుగా ప్రపంచ ఆర్థిక చెల్లింపుల వ్యవస్థను శాసిస్తున్న వీసా, మాస్టర్‌కార్డ్ కంపెనీల ఆధిపత్యం ముగిసిపోతుందేమో అన్నంతగా భారతదేశ స్వదేశీ చెల్లింపుల వ్యవస్థ పెరుగుతోంది. ఇటీవల ఐఎంఎఫ్ విడుదల చేసిన డేటా ప్రకారం.. యూపీఐ ప్రపంచంలోనే అత్యధిక చెల్లింపుల లావాదేవీలను నిర్వహిస్తోంది. అమెరికన్ కంపెనీ వీసా రికార్డును యూపీఐ బద్దలు కొట్టింది.
యూపీఐ ద్వారా రోజుకు 65 కోట్ల చెల్లింపుల లావాదేవీలు జరుగుతున్నాయి. 2025 జూన్ నెలలో ఈ మైలురాయిని చేరుకుంది. ఇదే నెలలో యూపీఐ మొత్తం 1,839 కోట్ల లావాదేవీలను నిర్వహించింది. ఇంత పెద్ద సంఖ్యలో ప్రపంచంలో ఏ పేమెంట్ సిస్టమ్ కూడా లావాదేవీలను నిర్వహించలేదు. ప్రపంచంలోని అతిపెద్ద పేమెంట్ నెట్‌వర్క్‌లలో ఉన్న వీసా, మాస్టర్‌కార్డ్ సంస్థల రికార్డును UPI బద్దలు కొట్టింది. వీసా సంస్థ ఒక రోజులో సగటున 63.9 కోట్ల చెల్లింపుల లావాదేవీలను నిర్వహిస్తుంది. మాస్టర్‌కార్డ్ ద్వారా సగటున 45 కోట్ల లావాదేవీలు జరుగుతాయి. భారతదేశంలో 80%, ప్రపంచంలో 60% లావాదేవీలు యూపీఐ ద్వారా జరుగుతున్నాయనేది విశేషం.
కార్డ్ చెల్లింపుల వ్యవస్థలైన వీసా, మాస్టర్‌కార్డ్ ఒక సంవత్సరంలో వరుసగా $13.2 ట్రిలియన్, $6 ట్రిలియన్ మొత్తం లావాదేవీలను నిర్వహిస్తాయి. యూనియన్‌పే అనేది చైనాలో ఉన్న ఒక కార్డ్ పేమెంట్స్ సంస్థ. వీసా, మాస్టర్‌కార్డ్‌లను అధిగమించి ఇది సంవత్సరానికి అత్యధిక మొత్తంలో ఆర్థిక చెల్లింపులను నిర్వహిస్తుంది. అయితే, ఎంత మొత్తం అనేది ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు.
వీటితో పోలిస్తే, భారతదేశం యూపీఐ ద్వారా సుమారు 300 బిలియన్ డాలర్ల మొత్తం లావాదేవీలు మాత్రమే జరుగుతాయి. అయితే, అకౌంట్ టు అకౌంట్ డబ్బు బదిలీలో మాత్రం UPI కింగ్ అనే చెప్పాలి. వీసా, మాస్టర్‌కార్డ్ సంస్థలు భారతదేశంలో అత్యధికంగా ఉపయోగించబడుతున్న కార్డ్ నెట్‌వర్క్‌లు. భారతదేశానికి సొంతంగా రూపే ఉన్నప్పటికీ, వీసా, మాస్టర్‌కార్డ్‌లు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీని మధ్య యూపీఐ కేవలం 9 సంవత్సరాల కాలంలో తనదైన ముద్రవేసుకుంది.
