UPI : డాలర్లు, యూరోల గొడవ లేదు.. యూరప్ వెళ్లినా ఫోన్ పే, గూగుల్ పే వాడొచ్చు
యూరప్ వెళ్లినా ఫోన్ పే, గూగుల్ పే వాడొచ్చు

UPI : భారతదేశం డిజిటల్ పేమెంట్స్ రంగంలో మరో పెద్ద విజయాన్ని సాధించింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ చేసిన ప్రకటన ప్రకారం.. మనదేశానికి చెందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) త్వరలో యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ టార్గెట్ ఇన్‌స్టెంట్ పేమెంట్ సెటిల్‌మెంట్ సిస్టమ్ (TIPS) తో అనుసంధానం కానుంది. ఈ చారిత్రక నిర్ణయం వల్ల భారత్, యూరోపియన్ దేశాల మధ్య డబ్బు పంపడం, స్వీకరించడం గతంలో కంటే చాలా సులభంగా, వేగంగా, తక్కువ ఖర్చుతో పూర్తవుతుంది. ముఖ్యంగా యూరప్‌లో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయులకు, విద్యార్థులకు, ఉద్యోగులకు దీని ద్వారా నేరుగా ప్రయోజనం చేకూరనుంది.
TIPS అంటే ఏమిటి?
TIPS అనేది యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ నిర్వహిస్తున్న ఒక రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్. దీని ద్వారా యూరప్‌లోని 30కి పైగా దేశాల బ్యాంకులు అనుసంధానం అయి ఉన్నాయి. ఈ వ్యవస్థను యూరప్‌లో మన యూపీఐ లాంటి వేగవంతమైన పేమెంట్ నెట్‌వర్క్‌గా పరిగణిస్తారు. గత కొన్ని నెలలుగా ఆర్‌బీఐ, ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ కలిసి యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్‌తో యూపీఐను TIPS తో అనుసంధానం చేయడం గురించి చర్చలు జరుపుతున్నారు. తాజాగా, ఇరు పక్షాలు UPI-TIPS లింక్ అమలు దశను ప్రారంభించడానికి అంగీకరించాయి.
ఈ ఒప్పందం వల్ల కలిగే ప్రయోజనాలు
యూరప్ వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థతో UPI అనుసంధానం కావడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి. భారత్, యూరప్ మధ్య రెమిటెన్స్ (విదేశాల నుంచి డబ్బు బదిలీ) తక్షణమే జరుగుతుంది. బ్యాంకు ఛార్జీలు, ఫారెక్స్ ఫీజులు గణనీయంగా తగ్గుతాయి. యూరప్‌లో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయులకు వారి కుటుంబాలకు డబ్బు పంపడం చాలా సులభతరం అవుతుంది. భారతీయ పర్యాటకులు అనేక యూరోపియన్ దేశాలలో యూపీఐ ద్వారా నేరుగా చెల్లింపులు చేసే సౌకర్యం లభిస్తుంది.
గ్లోబల్ UPI దిశగా అడుగులు
ప్రస్తుతానికి యూపీఐ ఇప్పటికే సింగపూర్, యూఏఈ, ఫ్రాన్స్, మారిషస్, భూటాన్, నేపాల్ సహా పలు దేశాలలో ఆమోదం పొందుతోంది. ఇప్పుడు యూరప్‌లోని అతిపెద్ద చెల్లింపుల వ్యవస్థ అయిన TIPS తో అనుసంధానం కావడం, భారత డిజిటల్ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయనుంది. ఈ చొరవ G20 రోడ్‌మ్యాప్‌లో భాగం. ప్రపంచవ్యాప్తంగా చౌకగా, వేగంగా, సురక్షితంగా సరిహద్దులు దాటి పేమెంట్స్ ప్రోత్సహించడమే G20 లక్ష్యం. భారత G20 అధ్యక్షత సమయంలో యూపీఐని ప్రపంచవ్యాప్తం చేయాలని గట్టిగా కోరింది.. దానికి ఇప్పుడు ఫలితం కనిపిస్తోంది. ప్రస్తుతం, ఆర్‌బీఐ, ఎన్‌ఐపీఎల్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ సాంకేతిక అనుసంధానం, రిస్క్ మేనేజ్ మెంట్, సెటిల్‌మెంట్ వ్యవస్థలపై కలిసి పనిచేయడం ప్రారంభించాయి.

