UPI: యూపీఐ యూజర్లకు గుడ్ న్యూస్.. ఆ పేమెంట్స్‌పై ఎలాంటి అదనపు భారం పడదు
అదనపు భారం పడదు

UPI: రోజూ యూపీఐ ద్వారా లావాదేవీలు చేసే కోట్లాది మందికి ప్రభుత్వం నుంచి కీలక స్పష్టత వచ్చింది. అక్టోబర్ 15 నుంచి రూ.2,000 కంటే ఎక్కువ మొత్తంలో చేసే మర్చంట్ పేమెంట్స్‌పై 0.4 శాతం ఎండీఆర్ విధించనున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో సామాన్య ప్రజల్లో ఆందోళన వ్యక్తమైంది. అయితే ఈ అదనపు భారం అంతా సామాన్యులపై పడదని, కేవలం వ్యాపారులకే ఇది వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ వసూళ్లలో ప్రభుత్వ ఖజానాకు రూపాయి కూడా చేరదని క్లారిటీ ఇచ్చింది.
ప్రభుత్వ ఖాతాలోకి వెళ్లని ఎండీఆర్ మొత్తం
ఈ నిర్ణయాన్ని విపక్షాలు పన్నుగా అభివర్ణించగా, ప్రభుత్వం ఆ వాదనలను ఖండించింది. ఎండీఆర్ ద్వారా వచ్చే మొత్తంలో ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి చెందదని, ఇది ఎలాంటి పన్ను లేదా సెస్ కాదని స్పష్టం చేశారు. ఈ మొత్తాన్ని యూపీఐ వ్యవస్థను నడిపే వివిధ బ్యాంకులు, పేమెంట్ గేట్‌వేలు, యాప్‌ల మధ్య నిబంధనల ప్రకారం పంపిణీ చేస్తారు. ఉదాహరణకు వసూలైన మొత్తంలో 40 శాతం కస్టమర్ బ్యాంక్‌కు, 30 శాతం పేమెంట్ గేట్‌వేకు, 20 శాతం యూపీఐ యాప్‌కు, మిగతా 10 శాతం ఆ యాప్‌ను స్పాన్సర్ చేసిన బ్యాంకుకు అందజేస్తారు. డిజిటల్ పేమెంట్ వ్యవస్థను ఆర్థికంగా బలోపేతం చేసేందుకే ఈ ఏర్పాటు చేశారు.
చిన్న వ్యాపారులకు, పీ2పీ లావాదేవీలకు మినహాయింపు
ఈ కొత్త నిబంధనల వల్ల చిన్న వ్యాపారులు ఎలాంటి నష్టాన్ని చవిచూడాల్సిన అవసరం లేదు. క్యూఆర్ కోడ్ ద్వారా నెలకు రూ.లక్ష వరకు లావాదేవీలు నిర్వహించే చిన్న వ్యాపారులపై ఎలాంటి కొత్త ఛార్జీలు పడవు. దేశంలోని దాదాపు 96 శాతం మంది మర్చంట్లు ఈ పరిధిలోనే వస్తారు. ఇక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే పీ2పీ మనీ ట్రాన్స్‌ఫర్‌లు ఎప్పటిలాగే పూర్తిగా ఉచితంగా కొనసాగుతాయి. కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు ఎంత మొత్తమైనా ఎలాంటి అదనపు రుసుము లేకుండా పంపుకోవచ్చు.
ప్రత్యేక సేవలు, పరిమిత ఛార్జీల వివరాలు
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సర్క్యులర్ ప్రకారం కొన్ని ప్రత్యేక సేవలకు మాత్రం వేరే నిబంధనలు వర్తిస్తాయి. రైల్వే, టెలికాం, పెట్రోల్ బంకులు మరియు బీమా వంటి అత్యవసర రంగాల్లో రూ.2,000 దాటిన పేమెంట్స్‌పై కేవలం రూ.5 ఫ్లాట్ ఛార్జ్ మాత్రమే ఉంటుంది. షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ లావాదేవీలపై ఇది కేవలం 0.02 శాతంగా ఉంది. అలాగే రూ.75,000 అంతకంటే ఎక్కువ పెద్ద మొత్తంలో చెల్లింపులు చేసినా గరిష్టంగా రూ.300 వరకు మాత్రమే ఎండీఆర్ వర్తిస్తుంది.
అపోహలను తొలగించేందుకు చర్యలు
డిజిటల్ పేమెంట్స్ ఆగిపోయి ప్రజలు మళ్లీ క్యాష్ పద్ధతికి మరులుతారనే అపోహలను ప్రభుత్వం కొట్టిపారేసింది. ఈ అంశంపై నెలకొన్న గందరగోళాన్ని తొలగించేందుకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ త్వరలో అవగాహన కార్యక్రమాలు చేపట్టనుంది. చిన్న వ్యాపారులను ప్రోత్సహించేందుకు ఈ ఆదాయంలో కొంత భాగం ప్రత్యేక నిధికి కేటాయించనున్నారు. డిజిటల్ లావాదేవీలకు ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది.

