UPI: యూపీఐ సబ్సిడీ ఇక బంద్ కానుందా? కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో బ్యాంకుల కొత్త ప్లాన్ ఇదీ
కొత్త ప్లాన్ ఇదీ

UPI: భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ సిస్టమ్ ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో అత్యంత కీలకమైన భాగంగా మారిపోయింది. గ్రామస్థాయి నుంచి పట్టణాల వరకు చిరు వ్యాపారస్తుల నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు అందరూ యూపీఐ లావాదేవీలనే ఎక్కువగా వాడుతున్నారు. ఈ డిజిటల్ విప్లవాన్ని వేగవంతం చేయడానికి గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం బ్యాంకులకు భారీగా ఆర్థిక సబ్సిడీలను అందిస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు యూపీఐ ఎకోసిస్టమ్‌లో పెద్ద మార్పులు రాబోతున్నాయి. చిన్న మొత్తాల యూపీఐ లావాదేవీలపై ఇస్తూ వస్తున్న సబ్సిడీలను ఎప్పటికీ నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం గట్టిగా ఆలోచిస్తోంది.
ఎండీఆర్ అమలుతో బ్యాంకులకు భారీ ఆదాయం
ఈ సబ్సిడీలను ఎత్తివేయడానికి ప్రధాన కారణం పెద్ద లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేటు మళ్లీ అమల్లోకి రావడం. రాబోయే అక్టోబర్ 15 నుంచి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త నిబంధనల ప్రకారం రూ.2,000 కంటే ఎక్కువ విలువైన కొన్ని నిర్దిష్ట మర్చంట్ (P2M) యూపీఐ చెల్లింపులపై 0.4 శాతం ఎండీఆర్ ఛార్జీ వర్తించనుంది. దీనివల్ల బ్యాంకులు, పేమెంట్ కంపెనీలకు నేరుగా లావాదేవీల ద్వారా మంచి ఆదాయం సమకూరుతుంది. బ్యాంకులు సొంతంగా డబ్బు సంపాదించడం ప్రారంభించిన తర్వాత, ప్రభుత్వ ఖజానా నుంచి సబ్సిడీలు ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భావిస్తోంది.
ట్యాక్స్ పేయర్ల డబ్బు ఆదా చేయడమే లక్ష్యం
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశం సామాన్య ప్రజలు కట్టే పన్నుల డబ్బును ఆదా చేయడమే. గతంలో డిజిటల్ పేమెంట్స్‌ను ప్రోత్సహించడానికి 2020 జనవరిలో ప్రభుత్వం ఎండీఆర్ ఛార్జీలను పూర్తిగా సున్నా చేసింది. ఆ సమయంలో బ్యాంకులకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి ప్రభుత్వం సబ్సిడీలు ఇచ్చింది. కానీ ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ బాగా స్థిరపడినందున, ట్యాక్స్ పేయర్ల కష్టపడి సంపాదించిన డబ్బును వ్యాపార చెల్లింపుల కోసం సబ్సిడీ రూపంలో ఇవ్వడం సరికాదని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే గడిచిన రెండేళ్లుగా సబ్సిడీ నిధులను క్రమంగా తగ్గిస్తూ వచ్చారు.
క్రమంగా తగ్గుతూ వచ్చిన ప్రభుత్వ నిధులు
గత కొన్ని సంవత్సరాల ప్రభుత్వ గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆర్థిక సంవత్సరం 2024లో యూపీఐ ప్రోత్సాహకం కింద బ్యాంకులకు ఏకంగా రూ.3,631 కోట్లు అందజేశారు. అయితే 2025 ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి ఈ మొత్తం భారీగా తగ్గి కేవలం రూ.1,046 కోట్లకు పడిపోయింది. అంతేకాకుండా ఏప్రిల్ 2025 తర్వాత ఎలాంటి కొత్త సబ్సిడీలను కూడా ప్రభుత్వం విడుదల చేయలేదు. ఈ పరిణామాలన్నీ గమనిస్తే.. ప్రభుత్వం ఎప్పుడో ఈ సబ్సిడీ పథకానికి స్వస్తి చెప్పాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది.

