UPI : ఇకపై షాపింగ్ ఇంకా ఈజీ.. యూపీఐలో కొత్త రూల్స్
యూపీఐలో కొత్త రూల్స్

UPI : డిజిటల్ చెల్లింపులు పెరిగే కొద్దీ, ఎక్కువ మొత్తంలో డబ్బులను యూపీఐ ద్వారా పంపించాల్సిన అవసరం కూడా పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యూపీఐ లావాదేవీల లిమిట్స్‌లో భారీ మార్పులు చేసింది. ఈ కొత్త నియమాలు సెప్టెంబర్ 15, 2025 నుండి అమలులోకి రానున్నాయి. ఈ మార్పుల వల్ల కొన్ని ప్రత్యేక కేటగిరీలలో యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ రూ.లక్ష నుంచి రూ. 5లక్షల వరకు, కొన్నింటికి రూ. 10 లక్షల వరకు పెంచారు.
ఏ కేటగిరీలకు కొత్త లిమిట్స్ వర్తిస్తాయి?
ఈ కొత్త నిబంధనలు అన్ని రకాల ట్రాన్సాక్షన్లకు వర్తించవు. ముఖ్యంగా పెద్ద మొత్తంలో చేసే చెల్లింపుల కోసం ఎంపిక చేసిన 12 కేటగిరీలకు ఈ లిమిట్స్ పెంచారు. ఈ మార్పుల వల్ల ఎక్కువ ప్రయోజనం పొందేవాళ్ళు:
* పెట్టుబడులు : షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేవారికి
* బీమా ప్రీమియంలు: ఇన్సూరెన్స్ ప్రీమియంలు చెల్లించేవారికి
* ప్రభుత్వ ప్లాట్‌ఫారమ్‌లలో కొనుగోలు (GeM): ప్రభుత్వ ఇ-మార్కెట్ ప్లేస్‌లో వ్యాపారం చేసేవారికి
* ట్రావెల్ బుకింగ్‌లు: ఫ్లైట్ లేదా ఇతర ప్రయాణాలకు పెద్ద మొత్తంలో బుకింగ్‌లు చేసేవారికి
* క్రెడిట్ కార్డ్ బిల్లుల చెల్లింపులు: క్రెడిట్ కార్డ్ బిల్లులు కట్టే వారికి
ఈ కేటగిరీలలో ప్రతి లావాదేవీకి ఇప్పుడు రూ.5 లక్షల వరకు చెల్లింపు చేయవచ్చు. అంతేకాకుండా, కొన్ని కేటగిరీలలో 24 గంటల్లో మొత్తం లావాదేవీల పరిమితిని రూ.10 లక్షల వరకు పెంచారు.
పాత లిమిట్స్ ఎలా ఉన్నాయి?
సాధారణంగా వ్యక్తిగత యూపీఐ లావాదేవీలకు పరిమితి రూ.లక్షగా ఉండేది. ఈ కొత్త మార్పులు వ్యక్తిగత లావాదేవీలపై ఎలాంటి ప్రభావం చూపవు. మీరు స్నేహితులు లేదా కుటుంబ సభ్యులకు పంపే డబ్బులకు పాత రూ.లక్ష లిమిట్ అలాగే ఉంటుంది. ఈ మార్పులు కేవలం వ్యాపారాలకు సంబంధించిన లేదా కొన్ని ప్రత్యేక సేవల కోసం చేసే లావాదేవీలకు మాత్రమే వర్తిస్తాయి.
ఎందుకు ఈ మార్పులు?
డిజిటల్ చెల్లింపులు పెరిగే కొద్దీ, ప్రజలు పెద్ద మొత్తంలో చేసే చెల్లింపులను కూడా యూపీఐ ద్వారా సులభంగా చేయాలనుకుంటున్నారు. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, యూపీఐ ప్లాట్‌ఫామ్‌ను మరింత పటిష్టం చేయడానికి, పెద్ద మొత్తాల లావాదేవీలను సురక్షితంగా, సులభంగా చేయడానికి NPCI ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మార్పులు వినియోగదారులకు సౌలభ్యం కల్పించడమే కాకుండా, వ్యాపార రంగంలో డిజిటల్ చెల్లింపులకు మరింత ఊతం ఇస్తాయి.
