UPI: సాధారణంగా ప్రజలు పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిపితేనే ఆదాయపు పన్ను శాఖ దృష్టి పెడుతుందని భావిస్తుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం అరవై వేల రూపాయల లావాదేవీలు ఉన్నా సరే సరైన లెక్క చూపించకపోతే ఇంటికి ట్యాక్స్ నోటీసులు వచ్చే అవకాశం ఉంది. మీ బ్యాంకు ఖాతాలో కనిపించే ఆదాయం మీరు ప్రభుత్వానికి చూపించే వార్షిక సంపాదన కంటే ఎక్కువగా ఉంటే డిపార్ట్‌మెంట్ వెంటనే ఆరా తీస్తుంది. డిజిటల్ పేమెంట్స్ పెరిగిన తరుణంలో యూపీఐ లావాదేవీలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బ్యాంకు ఖాతాలలో ఒక సంవత్సరంలో రూ.10లక్షలు నగదు రూపంలో జమ అయితేనే సంబంధిత వివరాలు ట్యాక్స్ అధికారులకు వెళ్తాయి. అయితే ఈ నిబంధనలు కేవలం క్యాష్ డిపాజిట్లకు మాత్రమే వర్తిస్తాయి. యూపీఐ, నెఫ్ట్ లేదా ఆర్టీజీఎస్ వంటి డిజిటల్ మార్గాల ద్వారా జరిగే లావాదేవీలకు ప్రత్యేకంగా ఎలాంటి వార్షిక పరిమితి లేదు. అధికారులు ఆడిట్ చేసే సమయంలో మీ పూర్తి బ్యాంకు స్టేట్‌మెంట్‌ను పరిశీలిస్తారు. ఆ సమయంలో మీ అసలు ఆదాయానికి మించి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనేదానికి సరైన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది.

చాలామంది స్నేహితులు లేదా బంధువుల కోసమని వారి డబ్బును తమ బ్యాంకు ఖాతాలోకి మార్చుకుని తర్వాత ఇతరులకు పంపిస్తుంటారు. మీ ఉద్దేశం మంచిదే అయినప్పటికీ ఈ రకమైన ఆర్థిక లావాదేవీలు మనీ మ్యూల్ ఖాతాలను పోలి ఉంటాయి. మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడేవారు ఇటువంటి పద్ధతులనే ఉపయోగిస్తారు. కర్ణాటకలో ఒక కూరగాయల వ్యాపారికి యూపీఐ లావాదేవీల ఆధారంగా రూ.29లక్షల నోటీసు వచ్చిన ఉదాహరణే ఇందుకు నిదర్శనం. వ్యక్తిగత ఖర్చులు అలాగే వ్యాపార లావాదేవీల కోసం ఎప్పుడూ ఒకే బ్యాంకు ఖాతాను ఉపయోగించకూడదు.

ఫ్రీలాన్సర్లు, ట్యూషన్ చెప్పే ఉపాధ్యాయులు అలాగే చిన్న వ్యాపారస్తులు ఎప్పుడూ తమ వ్యాపార లావాదేవీల కోసం ప్రత్యేకంగా వేరే బ్యాంకు ఖాతాను మెయింటైన్ చేయాలి. ఎవరి నుంచైనా సేవలకు ప్రతిఫలంగా డబ్బు తీసుకున్నప్పుడు దానికి తగినట్లుగా పక్కా రసీదులు లేదా బిల్లులు ఇవ్వడం మంచిది. ఫోన్ ద్వారా జరిగే ప్రతి చిన్న లావాదేవీకి సంబంధించిన న్యాయబద్ధమైన రికార్డులను భద్రపరుచుకుంటే భవిష్యత్ లో ఎలాంటి ఆదాయపు పన్ను విచారణనైనా సులభంగా ఎదుర్కోవచ్చు.

Next Story