Trump : H-1B వీసా ఫీజు పెంపు.. ట్రంప్‌కు సొంత దేశంలోనే షాక్
ట్రంప్‌కు సొంత దేశంలోనే షాక్

Trump : అమెరికన్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఇటీవల తీసుకున్న H-1B వీసా ఫీజు పెంపు నిర్ణయానికి ఆయన సొంత దేశంలోనే వ్యతిరేకత మొదలైంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏకంగా అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టులో కేసు వేసింది. ఈ పెంపు చట్టవిరుద్ధమని, ఇది దేశంలోని వ్యాపారాలకు నష్టం కలిగిస్తుందని ఛాంబర్ ఆరోపిస్తోంది. ట్రంప్ ప్రభుత్వం H-1B వీసా ఫీజులను పెంచడాన్ని వ్యతిరేకిస్తూ అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టులో కేసు దాఖలు చేసింది. ఛాంబర్ దృష్టిలో, ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం తప్పు చట్టబద్ధంగా సరైనది కాదు. అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక ప్రకారం.. ఛాంబర్ గురువారం వాషింగ్టన్ కోర్టులో ఈ కేసును దాఖలు చేసింది. ఈ పెంపు నిర్ణయంపై వెంటనే స్టే విధించాలని ఛాంబర్ కోర్టును కోరింది.
అమెరికాలో దాదాపు 30 వేలకు పైగా వ్యాపారాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఛాంబర్ ఆఫ్ కామర్స్, ట్రంప్ ప్రభుత్వం ఈ చర్య అమెరికన్ ఇమ్మిగ్రేషన్ చట్టాన్ని ఉల్లంఘించడమే అని పేర్కొంది. అమెరికాలో వీసా ఫీజులు, వీసా ప్రాసెస్ చేయడానికి అయ్యే ఖర్చు ఆధారంగా నిర్ణయించబడతాయి. కానీ H-1B వీసా ఫీజును పెంచడం ఈ పద్ధతికి పూర్తిగా విరుద్ధం అని ఛాంబర్ వాదిస్తోంది. అంతేకాకుండా, వీసా ఫీజు పెంపు వల్ల ముఖ్యంగా అమెరికన్ టెక్ కంపెనీలలో నైపుణ్యం కలిగిన వర్క్ ప్రొఫెషనల్స్ కొరత ఏర్పడవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది.
కొద్ది రోజుల క్రితం ట్రంప్ ప్రభుత్వం H-1B వీసా ఫీజును ఏకంగా $100,000 (దాదాపు రూ.83 లక్షలు) కు పెంచుతున్నట్లు ప్రకటించింది. అమెరికాలోని ఉద్యోగాలను పెంచడానికి, తక్కువ ధరలలో విదేశీ టాలెంట్‌ను నియమించుకునే పద్ధతికి వ్యతిరేకంగా ఈ చర్య తీసుకున్నట్లు అప్పట్లో తెలిపింది. అయితే, కొత్త వీసాదారులకు మాత్రమే ఈ అధిక ఫీజు వర్తిస్తుందని, పాత వీసాదారులకు దీని నుండి మినహాయింపు ఉంటుందని ట్రంప్ ప్రభుత్వం తర్వాత స్పష్టం చేసింది.
H-1B వీసా అనేది ప్రపంచం నలుమూలల నుండి, ముఖ్యంగా ఐటీ రంగంలో నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు అమెరికాలో పని చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ వీసాదారుల్లో భారతీయుల భాగస్వామ్యం దాదాపు 71 శాతం ఉంటుంది. చాలా మంది భారతీయ యువత అమెరికాలో పనిచేయాలని కలలు కంటారు. ఈ భారీ ఫీజు పెంపు నిర్ణయం, భారత్‌తో సహా అనేక దేశాలలోని యువ నిపుణుల కలలకు పెద్ద అడ్డుకట్టగా మారింది. H-1B వీసా ప్రోగ్రాం ద్వారా అమెరికా ప్రతి సంవత్సరం సుమారు 85,000 మంది నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు వీసాలు జారీ చేస్తుంది. ఈ వీసా పొందిన వారు ఆరు సంవత్సరాల వరకు అమెరికాలో పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఈ నిపుణులు ఎక్కువగా ఐటీ, హెల్త్ సెక్టార్ రంగాలలో పనిచేస్తున్నారు.
