Meta : ప్రపంచ ప్రసిద్ధ సోషల్ మీడియా సంస్థ మెటాకి కష్టాల కాలం ముగిసేలా కనిపించడం లేదు. ఒకవైపు భారతదేశంలో అల్గోరిథంలు, దేశీయ చట్టాల ఉల్లంఘనపై అధికారుల విచారణను ఎదుర్కొంటూ వివరణ ఇవ్వాల్సి రాగా, మరోవైపు అమెరికాలోని న్యూ మెక్సికో స్టేట్ కోర్టు మెటాకు షాకింగ్ తీర్పునిచ్చింది. టీనేజర్ల మానసిక ఆరోగ్య నిధికి 567 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 5,400 కోట్లు) చెల్లించాలని, ప్లాట్‌ఫారమ్‌లలో యంగ్ యూజర్ల రక్షణ కోసం తమ పనితీరును మార్చుకోవాలని కోర్టు ఆదేశించింది. చిన్నారులకు హాని కలిగించడంలో కంపెనీ బాధ్యత వహించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.

సంచలన తీర్పు ఇచ్చిన న్యూ మెక్సికో కోర్టు

న్యూ మెక్సికోలోని శాంటా ఫే కోర్టులో విచారణ సందర్భంగా జడ్జి బ్రయాన్ బీడ్‌షైడ్, డెమోక్రాట్ అటార్నీ జనరల్ రౌల్ టోరెజ్ తరఫున ఈ కీలక తీర్పునిచ్చారు. మెటా తన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లలో యువ యూజర్లు బానిసలుగా మారేలా ఉత్పత్తులను రూపొందించిందని, అలాగే ప్లాట్‌ఫారమ్‌పై పిల్లల లైంగిక వేధింపులను అరికట్టడంలో విఫలమై పబ్లిక్ న్యూసెన్స్ సృష్టించిందని ఆరోపణలు రుజువయ్యాయి. వినియోగదారుల రక్షణ చట్టాలను ఉల్లంఘించినందుకు గాను ఐదు నెలల క్రితం జ్యూరీ విధించిన 375 మిలియన్ డాలర్ల జరిమానాకు ఇది అదనం కావడం గమనార్హం.

మారనున్న సోషల్ మీడియా రూల్స్

అమెరికాలో దాదాపు 40కి పైగా రాష్ట్రాలు, 1,300 కంటే ఎక్కువ పాఠశాల డిస్ట్రిక్ట్‌లు సోషల్ మీడియా కంపెనీలపై కేసులు వేశాయి. ఈ నేపథ్యంలో జడ్జి బీడ్‌షైడ్ మెటాకు పలు కీలక భద్రతా మార్గదర్శకాలను జారీ చేశారు. టీనేజర్లు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఉపయోగించడంపై నెలవారీ నియంత్రణలు, నోటిఫికేషన్‌ల నిరోధం, మైనర్‌లతో పెద్దల పరిచయాలపై కఠిన ఆంక్షలు, ఏఐ చాట్‌బాట్‌లకు భద్రతా చర్యలు మరియు పిల్లలపై జరిగే వేధింపుల నివేదికల పరిశీలన వంటి నిబంధనలను విధించారు. ఈ ఆదేశాలు రాబోయే 5 సంవత్సరాల పాటు అమల్లో ఉంటాయి.

తీర్పుపై అప్పీలు చేస్తామన్న మెటా

కోర్టు తీర్పుపై మెటా ప్రతినిధులు స్పందిస్తూ, తాము ఈ తీర్పుపై పైకోర్టులో అప్పీల్ చేస్తామని తెలిపారు. ప్లాట్‌ఫారమ్ నుంచి హానికరమైన కంటెంట్‌ను తొలగించడానికి నిరంతరం శ్రమిస్తున్నామని, ఆన్‌లైన్‌లో టీనేజర్ల భద్రత విషయంలో తమ ట్రాక్ రికార్డ్‌పై పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నారు. కాగా, న్యూ మెక్సికో అటార్నీ జనరల్ రౌల్ టోరెజ్ మాట్లాడుతూ.. మెటా పిల్లల భద్రత కంటే లాభాలకే ప్రాధాన్యత ఇచ్చిందని, ఈ తీర్పు ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఒక రోడ్‌మ్యాప్‌లా ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story