US Federal Reserve : యూఎస్ ఎకానమీకి బూస్ట్..మూడోసారి వడ్డీ రేట్లను తగ్గించిన ఫెడరల్ రిజర్వ్
మూడోసారి వడ్డీ రేట్లను తగ్గించిన ఫెడరల్ రిజర్వ్

US Federal Reserve : అమెరికాలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ మరోసారి వడ్డీ రేట్లను తగ్గించింది. డిసెంబర్ 10 న జరిగిన ఎఫ్ఓఎంసీ సమావేశంలో, ఫెడ్ పాలసీ రేటులో 0.25 శాతం (25 బేసిస్ పాయింట్లు) కోత విధించింది. యూఎస్ ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచేందుకు ఫెడ్ వడ్డీ రేట్లను వరుసగా మూడోసారి తగ్గించడం ఇది. ఈ తగ్గింపు తర్వాత యూఎస్‌లో వడ్డీ రేటు 3.50% నుంచి 3.75% పరిధిలోకి వచ్చింది, ఇది గత 3 సంవత్సరాలలో కనిష్ఠ స్థాయి. అయితే ఎఫ్ఓఎంసీ ఛైర్మన్, యూఎస్ ఫెడ్ చీఫ్ జెరోమ్ పావెల్ భవిష్యత్తు విధానాలపై కఠిన సంకేతాలు కూడా ఇచ్చారు.
మీటింగ్ తర్వాత ఫెడ్ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. దేశ ఆర్థిక కార్యకలాపాలు చాలా నెమ్మదిగా పెరుగుతున్నాయని తెలిపింది. దీనికి విరుద్ధంగా ఉపాధి మార్కెట్‌లో నిరంతర బలహీనత, పెరుగుతున్న ద్రవ్యోల్బణం స్థాయి విధాన నిర్ణయంపై భారీ ప్రభావం చూపాయి. దీని ఫలితమే ఫండ్స్ రేటు 3.50% నుంచి 3.75% మధ్యకు వచ్చింది. ఇకపై 2026 లో రేట్ల కోత నిర్ణయం డేటాను పరిశీలించిన తర్వాతే తీసుకుంటామని ఫెడ్ స్పష్టం చేసింది.
యూఎస్ ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ పాలసీ రేటులో 25 బేసిస్ పాయింట్ల కోత విధిస్తూ.. మారుతున్న ఆర్థిక పరిస్థితులు, రిస్క్‌లను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో వడ్డీ రేట్లు ఎంత వేగంగా, ఎంత మేరకు మారుతాయనేది రాబోయే డేటా, ఆర్థిక అంచనాలు, రిస్క్‌లపై ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణాన్ని 2% లక్ష్యం వరకు తీసుకురావడానికి, ఉపాధిని సురక్షితంగా ఉంచడానికి అవసరమైతే, ఫెడ్ పాలసీలో మార్పులు చేయడానికి సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. బ్యాంకింగ్ వ్యవస్థలో రిజర్వ్ బ్యాలెన్స్ తగినంతగా ఉండేందుకు అవసరమైతే, షార్ట్-టర్మ్ ట్రెజరీ బిల్లులను కొనుగోలు చేయడం ద్వారా లిక్విడిటీని స్థిరంగా ఉంచుతామని కూడా ఫెడ్ సూచించింది.
ఈ పాలసీ సమావేశంలో సభ్యుల మధ్య పెద్ద అభిప్రాయ భేదం కనిపించింది. స్టీఫెన్ మిరాన్ (0.50% పెద్ద కోత విధించాలని డిమాండ్ చేయగా, ఆస్టన్ గూల్స్‌బీ, జెఫ్రీ స్మిడ్ ఎలాంటి మార్పులకు వ్యతిరేకంగా ఉన్నారు. అయినప్పటికీ జెరోమ్ పావెల్, మెజారిటీ సభ్యులు 25 బీపీఎస్ కోతకు మద్దతు ఇచ్చారు. ఈ నిర్ణయం ఫెడ్ జాగ్రత్త, బ్యాలెన్స్ వైఖరిని సూచిస్తుంది. ఫెడ్ నిర్ణయం 9-3 వంటి పెద్ద అభిప్రాయ భేదంతో రావడం 2019 తర్వాత ఇదే మొదటిసారి.

