US Iran Deal : అంతర్జాతీయ రాజకీయాలలో చోటుచేసుకున్న ఒకే ఒక్క చారిత్రాత్మక పరిణామం భారతదేశానికి ఎనలేని ఊరటనిచ్చింది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందం కారణంగా, గత మూడు నెలలుగా పర్షియన్ గల్ఫ్ సముద్ర పరిధిలో చిక్కుకుపోయిన భారత భారీ గ్యాస్ నౌక దిశ ఎట్టకేలకు ముందుకు కదిలింది. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి మళ్లీ తెరుచుకోనుండటంతో భారత ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన ఈ ఎల్‌ఎన్‌జీ ట్యాంకర్ తన ప్రయాణాన్ని పునఃప్రారంభించింది.

హోర్ముజ్ జలమార్గం పునరుద్ధరణ

ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు, సహజ వాయువు సరఫరాకు హోర్ముజ్ జలమార్గం ఒక జీవనాడి లాంటిది. గత ఫిబ్రవరి నెల చివరి వారంలో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, సైనిక ఘర్షణలు తీవ్రం కావడంతో ఈ సముద్ర రవాణా మార్గం పూర్తిగా స్తంభించిపోయింది. అయితే, తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో శాంతి ఒప్పందం ముగింపు దశకు వచ్చిందని సంచలన ప్రకటన చేశారు. ఈ శుక్రవారం కల్లా ఇరు దేశాల ప్రతినిధులు ఈ అధికారిక ఒప్పందంపై సంతకాలు చేయనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఈ వార్త ఇంధన కొరతతో ఇబ్బంది పడుతున్న అనేక దిగుమతి దేశాలకు పెద్ద సంజీవనిలా పనిచేసింది.

మూడు నెలల తర్వాత లంగర్ ఎత్తిన దిశ

అమెరికా-ఇరాన్ డీల్ వార్తలు బయటకు రాగానే ఓమన్ సముద్ర తీరం నుంచి దుబాయ్ తీరం వరకు లంగరు వేసి నిలిచిపోయిన వందలాది అంతర్జాతీయ నౌకల్లో ఒక్కసారిగా హడావుడి మొదలైంది. బ్లూమ్‌బెర్గ్ షిప్-ట్రాకింగ్ డేటా అందించిన తాజా సమాచారం ప్రకారం, భారత ప్రభుత్వ రంగ సంస్థ దీర్ఘకాలిక ఒప్పందం కింద నడుపుతున్న దిశ గ్యాస్ నౌక ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు ఉత్తర దిశగా ప్రయాణిస్తూ.. వేగంగా ఓమన్ తీరానికి చేరుకుంటోంది. ఈ నౌక మార్చి 1వ తేదీన కతర్‌లోని రాస్ లఫాన్ గ్యాస్ ప్లాంట్ నుంచి భారీ ఎల్‌ఎన్‌జీ కన్సైన్‌మెంట్‌ను లోడ్ చేసుకుంది. కానీ, సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా మూడు నెలలుగా సముద్రంలోనే ఆగిపోవాల్సి వచ్చింది.

గ్లోబల్ మార్కెట్లో పడిపోయిన చమురు, గ్యాస్ ధరలు

హోర్ముజ్ జలమార్గం ద్వారా అంతర్జాతీయ ఎల్‌ఎన్‌జీ రవాణా మళ్లీ సాధారణ స్థితికి రానుందనే వార్తలతో ప్రపంచ మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. సరఫరా కొరత కారణంగా గత మార్చి నెల నుంచి యూరప్, ఆసియా ఖండాలలో ఆకాశాన్ని తాకిన గ్యాస్ ధరలు సోమవారం ఉదయం మార్కెట్లు ఓపెన్ కాగానే భారీగా పడిపోయాయి. అంతర్జాతీయ ట్రేడింగ్‌లో యూరోపియన్ సహజ వాయువు ధరలు ఏకంగా 5.8 శాతం మేర దిగివచ్చాయి. గ్యాస్ ధరలతో పాటు అంతర్జాతీయ ముడి చమురు మార్కెట్ కూడా చల్లబడింది. దీని ప్రభావంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు ఒకేరోజు 4 శాతానికి పైగా క్షీణించాయి. ఈ ధరల తగ్గుదల భారత్ లాంటి పెద్ద దిగుమతి దేశానికి ఆర్థికంగా భారీగా కలిసి రానుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story