FIFA PASS : ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్.. ఇక అమెరికా వీసా చిటికెలో
ఇక అమెరికా వీసా చిటికెలో

FIFA PASS : ఫుట్‌బాల్ ప్రపంచకప్ 2026కు రంగం సిద్ధమవుతోంది. అయితే అమెరికా వీసా కోసం ఉన్న భారీ వెయిటింగ్ పీరియడ్ చూసి చాలా మంది అభిమానులు బెంబేలెత్తిపోతున్నారు. ఇలాంటి వారి కోసం అమెరికా ప్రభుత్వం జనవరి 20 నుంచి FIFA PASS (FIFA Priority Appointment Scheduling System)ను ప్రారంభించింది. దీని ద్వారా వరల్డ్ కప్ టికెట్లు కలిగిన ప్రయాణికులకు వీసా ఇంటర్వ్యూలలో ప్రాధాన్యత లభిస్తుంది. నవంబర్ 2025లో వైట్ హౌస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫిఫా అధ్యక్షుడు జియాని ఇన్ఫాంటినో సమక్షంలో ఈ పథకాన్ని ప్రకటించారు.
అసలు ఈ ఫిఫా పాస్ అంటే ఏమిటి?
ప్రపంచవ్యాప్తంగా అమెరికా వీసా కోసం నెలల తరబడి వేచి చూస్తున్న వారికి ఇదొక ప్రయారిటీ పాస్. మీ దగ్గర వరల్డ్ కప్ మ్యాచ్ టికెట్ ఉంటే, మీకు వీసా ఇంటర్వ్యూ కోసం ప్రత్యేకంగా త్వరితగతిన అపాయింట్‌మెంట్ కేటాయిస్తారు. తద్వారా టోర్నమెంట్ ప్రారంభమయ్యే లోపే మీరు వీసా పొంది అమెరికా చేరుకోవచ్చు. ముఖ్యంగా భారత్ వంటి దేశాల్లో వీసా వెయిటింగ్ పీరియడ్ ఎక్కువగా ఉన్నందున, మన ఫుట్‌బాల్ అభిమానులకు ఇది ఒక గొప్ప అవకాశం.
2026 ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలోనే అతిపెద్దదిగా నిలవనుంది. అమెరికా, కెనడా, మెక్సికోలలోని 16 నగరాల్లో 48 జట్లు మొత్తం 104 మ్యాచ్‌లు ఆడనున్నాయి. జూన్ 11 నుంచి జూలై 19 వరకు ఈ సంబరం జరగనుంది. అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు సాధారణంగా B1/B2 విజిటర్ వీసా అవసరం. కెనడా, బెర్ముడా పౌరులకు వీసా అక్కర్లేదు, అలాగే వీసా వైవర్ ప్రోగ్రామ్ ఉన్న దేశాల వారు ESTA ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ భారతీయులు మాత్రం ఫిఫా పాస్ ద్వారా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్ వేగంగా పొందవచ్చు.
దీని కోసం దరఖాస్తు చేసుకోవడం కూడా చాలా సులభం. మొదట మీ FIFA.com ఖాతాలోకి వెళ్లి ఫిఫా పాస్ ఫామ్ నింపాలి. ఆ తర్వాత సాధారణ వీసా ప్రక్రియ (DS-160 ఫామ్, ఫీజు చెల్లింపు) పూర్తి చేయాలి. ఇంటర్వ్యూ బుక్ చేసేటప్పుడు మీరు ఫిఫా టికెట్ హోల్డరా? అనే ప్రశ్నకు అవును అని సమాధానం ఇస్తే, మీ వివరాలను ధృవీకరించి ప్రయారిటీ అపాయింట్‌మెంట్ ఇస్తారు. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, కేవలం టికెట్ ఉన్నంత మాత్రాన వీసా గ్యారెంటీ కాదు. సాధారణ దరఖాస్తుదారుల మాదిరిగానే మీ పత్రాలను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. అంతా సవ్యంగా ఉంటే, మీ వరల్డ్ కప్ కల నెరవేరుతుంది.

