H-1B వీసాలపై కఠిన చట్టానికి ప్లాన్

US Layoffs : అమెరికాలో ఇటీవల భారీగా ఉద్యోగుల తొలగింపు జరిగిన తర్వాత, ప్రముఖ భారతీయ ఐటీ కంపెనీలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, కాగ్నిజెంట్ సహా మొత్తం 10 కంపెనీలపై అమెరికన్ ఎంపీలు తీవ్రంగా స్పందించారు. వేలాది మంది అమెరికన్ ఉద్యోగులను తీసేసిన వెంటనే, ఈ కంపెనీలు భారీ సంఖ్యలో H-1B వీసా దరఖాస్తులు దాఖలు చేయడంపై అమెరికా సెనేట్ న్యాయవ్యవస్థ కమిటీ చైర్మన్ చార్లెస్ గ్రాస్లీ, ర్యాంకింగ్ సభ్యుడు రిచర్డ్ డర్బిన్ ప్రశ్నల వర్షం కురిపించారు. అమెరికన్ల నిరుద్యోగిత పెరుగుతున్న సమయంలో విదేశాల నుంచి చౌక శ్రామికులను తీసుకురావడానికి వీసాలను దుర్వినియోగం చేస్తున్నారంటూ ఈ కంపెనీల తీరుపై మండిపడ్డారు.

ప్రముఖ టెక్ దిగ్గజాలు పెద్ద ఎత్తున అమెరికన్ ఉద్యోగులను తొలగించిన తర్వాత, వాటిలో చాలా కంపెనీలు పెద్ద సంఖ్యలో H-1B వీసా దరఖాస్తులు దాఖలు చేయడంపై అమెరికన్ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీసీఎస్, కాగ్నిజెంట్ తో పాటు అమెజాన్, యాపిల్, డెలాయిట్, గూగుల్, జేపీ మోర్గాన్ చేజ్, మెటా, మైక్రోసాఫ్ట్, వాల్‌మార్ట్ వంటి 10 పెద్ద కంపెనీలకు ఎంపీలు నోటీసులు పంపి, వివరణ కోరారు. ఈ కంపెనీలు వారి నియామక పద్ధతులు, సాలరీ స్ట్రక్ఛర్, అలాగే అమెరికన్ ఉద్యోగులకు, H-1B వీసా హోల్డర్లకు మధ్య ఉండే వేతనాలు, ప్రయోజనాల తేడాల వివరాలను అడిగారు. ప్రస్తుతం అమెరికాలో టెక్నాలజీ రంగంలో నిరుద్యోగిత రేటు మొత్తం నిరుద్యోగిత రేటు కంటే ఎక్కువగా ఉందని ఎంపీలు గుర్తుచేశారు.

చార్లెస్ గ్రాస్లీ, రిచర్డ్ డర్బిన్ మొదటి నుంచి H-1B వీసా విధానంలో లోపాలు ఉన్నాయని విమర్శిస్తున్నారు. కంపెనీలు ఈ వీసాలను ఉపయోగించి అమెరికన్ కార్మికుల స్థానంలో తక్కువ జీతానికి విదేశీ ఉద్యోగులను తీసుకుంటున్నారని వీరు ఆరోపిస్తున్నారు. వీరు H-1B, L-1 వీసా కార్యక్రమాలలో సంస్కరణల కోసం ఒక ద్వైపాక్షిక చట్టాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చట్టం ద్వారా వీసా వ్యవస్థలోని మోసాలు, దుర్వినియోగాన్ని అరికట్టడం, అమెరికన్ కార్మికులు, వీసా హోల్డర్ల భద్రతను నిర్ధారించడం, విదేశీ ఉద్యోగుల నియామక ప్రక్రియలో పారదర్శకత పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్, కాగ్నిజెంట్ వంటి భారతీయ ఐటీ కంపెనీలకు అమెరికాలో ప్రాజెక్టులు దక్కాలంటే H-1B వీసాలు చాలా కీలకం. ఈ వీసాల ద్వారానే భారతీయ ఐటీ నిపుణులను క్లయింట్ స్థానాలకు పంపిస్తారు. ఎంపీల డిమాండ్‌ల ప్రకారం.. H-1B వీసా హోల్డర్లకు అమెరికన్ ఉద్యోగులతో సమానంగా లేదా అంతకంటే ఎక్కువ వేతనం ఇవ్వాల్సి వస్తే, భారతీయ కంపెనీల మెయింటెనెన్స్ ఖర్చు భారీగా పెరుగుతుంది. దీనివల్ల వారి లాభాల మార్జిన్ తగ్గిపోతుంది. ఈ కఠిన నిబంధనల కారణంగా భారతీయ ఐటీ కంపెనీలు ఆఫ్‌షోర్ డెలివరీ మోడల్‌ను ఎక్కువగా అనుసరించే అవకాశం ఉంది. ఇది భారతదేశంలో ఉద్యోగ అవకాశాలు పెరగడానికి దోహదపడినప్పటికీ, అమెరికన్ క్లయింట్లకు ఆన్‌సైట్ సపోర్ట్ తగ్గవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story