14 దేశాలపై అమెరికా కొత్త దిగుమతి సుంకాలు!

Trump Tariffs : అమెరికా ప్రభుత్వం జపాన్, బంగ్లాదేశ్, సౌత్ కొరియా సహా మొత్తం 14 దేశాలపై కొత్త దిగుమతి సుంకాలను ప్రకటించింది. అయితే, ఈ జాబితాలో భారత్ పేరు లేదు. ఈ విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదిర్చేందుకు తుది దశ చర్చల్లో ఉన్నామని ఆయన తెలిపారు. ఈ కొత్త టారిఫ్‌లు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయి. డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ అకౌంట్‌లో జపాన్, సౌత్ కొరియా దేశాలపై 25% టారిఫ్ విధిస్తున్నట్లు మొదట ప్రకటించారు. ఆ తర్వాత, మరో 12 దేశాలపై కూడా టారిఫ్‌లు విధిస్తున్నట్లు తెలియజేస్తూ, దానికి సంబంధించిన పత్రాలను పంచుకున్నారు.

కొత్త టారిఫ్‌లు విధించబడిన 14 దేశాలు ఇవే

జపాన్, సౌత్ కొరియా, మయన్మార్, లావోస్, థాయ్‌లాండ్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, కజకిస్తాన్, ఇండోనేషియా, ట్యునీషియా, మలేషియా, సెర్బియా, కంబోడియా, బోస్నియా హెర్జెగోవినా. ఈ దేశాలపై కొత్త దిగుమతి సుంకాలు ఆగస్టు 1 నుంచి వర్తిస్తాయి.

భారత్‌కు ఎందుకు ఊరట?

డొనాల్డ్ ట్రంప్ అన్ని దేశాలపై టారిఫ్‌లు విధించేందుకు బెదిరిస్తున్న ముఖ్య ఉద్దేశ్యం – ట్యాక్స్-రహిత వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడమే. అమెరికాకు ఉన్న భారీ వాణిజ్య లోటును తగ్గించాలనేది ట్రంప్ ప్రణాళిక. అందుకే, అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలని ఆయన అన్ని దేశాలను ఆహ్వానిస్తున్నారు. ఒప్పందాలు చేసుకునే లేదా ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్న దేశాలను మినహాయించి, మిగిలిన దేశాలపై ఆయన దిగుమతి సుంకాలు విధిస్తున్నారు. దానిలో భాగంగానే ఈ 14 దేశాలపై టారిఫ్‌లను ప్రకటించారు.

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం

భారత్ గత కొన్ని వారాలుగా అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి నిరంతరం చర్చలు జరుపుతోంది. ఇటీవలే, భారత ప్రతినిధి బృందం అమెరికాకు వెళ్లి చర్చలు జరిపి వచ్చింది. ఈ ఒప్పందానికి సంబంధించిన చర్చలు చివరి దశలో ఉన్నాయని భారత్ అంతకుముందే ప్రకటించింది. ఈ విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ కూడా తాజాగా మరోసారి పునరుద్ఘాటించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story