US Tech Stock: వాల్‌స్ట్రీట్‌లో కంటతడి పెట్టిస్తున్న టెక్ షేర్లు..ఎన్విడియా నుంచి డెల్ వరకు అన్నీ ఢమాల్
ఎన్విడియా నుంచి డెల్ వరకు అన్నీ ఢమాల్

US Tech Stock: అమెరికన్ స్టాక్ మార్కెట్లో టెక్నాలజీ షేర్లు అకస్మాత్తుగా కుప్పకూలడం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లలో గుబులు పుట్టిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే దిగ్గజ కంపెనీల షేర్లు దారుణంగా పడిపోవడంతో వాల్‌స్ట్రీట్ బజార్లో అలజడి రేగింది. ముఖ్యంగా సెమీకండక్టర్ రంగానికి చెందిన ప్రముఖ కంపెనీ ఇంటెల్ షేర్ ఏకంగా 28 శాతానికి పైగా కుప్పకూలింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంపై చేస్తున్న భారీ పెట్టుబడుల భవిష్యత్తు ఏంటనే ప్రశ్న ఇప్పుడు మార్కెట్ వర్గాలను తీవ్రంగా వేధిస్తోంది.
వాల్‌స్ట్రీట్‌లో టెక్ షేర్ల సునామీ
అమెరికా మార్కెట్లో టెక్ దిగ్గజాల షేర్ల పతనం ఊహించని పరిణామం. శుక్రవారం ఒక్కరోజే నాస్డాక్ కాంపోజిట్ ఇండెక్స్ 2.86 శాతం అంటే సుమారు 747 పాయింట్లు నష్టపోయి 25,437 వద్ద ముగిసింది. జూన్ 5 తర్వాత నాస్డాక్లో ఇదే అతిపెద్ద భారీ పతనం. అక్టోబర్ నెలవారీ ట్రేడింగ్‌ను పరిశీలిస్తే నాస్డాక్ 100 ఇండెక్స్ మార్కెట్ విలువ ఏకంగా 2 ట్రిలియన్ డాలర్ల మేర ఆవిరైపోయింది. ఇంటెల్‌తో పాటు అమెజాన్ కంపెనీల బలహీనమైన త్రైమాసిక ఫలితాలే ఈ పతనానికి ప్రధాన కారణమయ్యాయి.
ఎన్విడియా నుంచి డెల్ వరకు అంతటా భారీ నష్టం
ఈ టెక్ దివాలా కోరల్లో చిక్కుకుని చిప్ తయారీ రంగానికి చెందిన పెద్ద కంపెనీలన్నీ విలవిలాడాయి. ఏఐ చిప్స్ తయారు చేసే ప్రపంచ ప్రసిద్ధ సంస్థ ఎన్విడియా షేర్ 4.2 శాతం పడిపోగా, ఏఎండీ షేర్ దాదాపు 11 శాతం క్షీణించింది. ఇక సర్వర్లు తయారు చేసే డెల్ కంపెనీ షేర్ 10.8 శాతం, హెచ్‌పీ షేర్ 9.6 శాతం చొప్పున పడిపోయాయి. అమెరికా మార్కెట్లలో నెలకొన్న ఈ సెల్లింగ్ ప్రెజర్ ప్రభావం కచ్చితంగా సోమవారం నాడు తైవాన్, దక్షిణ కొరియా లాంటి ఆసియా దేశాల స్టాక్ మార్కెట్లపై తీవ్రంగా చూపించే అవకాశం ఉంది.
భారీ అప్పుల ఊబిలో టెక్ కంపెనీలు
ఇంటెల్, అమెజాన్ బలహీన ఫలితాలతో ఏఐ క్రేజ్ నడుమ జరుగుతున్న వ్యాపారాలపై అనుమానాలు ముసురుకుంటున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కోసం కంపెనీలు చేస్తున్న వేల కోట్ల పెట్టుబడులకు తగినట్లుగా రిటర్న్స్ వస్తాయా అనే ఆందోళన ఇన్వెస్టర్లలో పెరిగింది. గడచిన కొద్ది సంవత్సరాలుగా మెటా, అమెజాన్, ఆల్ఫాబెట్ వంటి దిగ్గజాలు విపరీతంగా అప్పులు చేసి బాండ్లు జారీ చేశాయి. మోర్గాన్ స్టాన్లీ అంచనాల ప్రకారం రాబోయే సంవత్సరంలో ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద జరిగే పెట్టుబడులు 1 ట్రిలియన్ డాలర్లు దాటనున్నాయి. కంపెనీలపై పెరుగుతున్న ఈ భారీ అప్పుల భారమే మార్కెట్‌ను పాతాళానికి తొక్కుతోంది.

