Crude Oil : ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు మళ్ళీ కమ్ముకున్నాయి. అగ్రరాజ్యం అమెరికాకు చెందిన యుద్ధనౌకపై హోర్ముజ్ జలసంధిలో మిసైల్ దాడి జరగడం సంచలనం రేపుతోంది. ఈ పరిణామంతో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీని ప్రభావం రేపు ఉదయం భారత స్టాక్ మార్కెట్‌పై గట్టిగా పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి. ఇరాన్‌కు చెందిన ఫార్స్ న్యూస్ ఏజెన్సీ కథనం ప్రకారం.. జాస్క్ ద్వీపం సమీపంలో ఉన్న అమెరికా యుద్ధనౌకపై రెండు క్షిపణులను ప్రయోగించారు. ఇరాన్ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ముందుకు వెళ్తున్న అమెరికా నౌక.. ఈ దాడితో వెనక్కి మళ్లినట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రాజెక్ట్ ఫ్రీడమ్ పేరుతో హోర్ముజ్ జలసంధిలో చిక్కుకున్న వాణిజ్య నౌకలను కాపాడేందుకు ఆపరేషన్ మొదలుపెట్టబోతున్న తరుణంలోనే ఈ దాడి జరగడం గమనార్హం.

భగ్గుమంటున్న చమురు ధరలు

ఈ మిసైల్ దాడి వార్త తెలియగానే అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా 5 శాతం పెరిగి బ్యారెల్‌కు $113.35 వద్ద ట్రేడవుతోంది. భారత్ తన అవసరాల కోసం దిగుమతులపైనే ఆధారపడుతుంది కాబట్టి, ముడిచమురు ధరలు పెరిగితే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉంది. ఇది రవాణా ఖర్చులను పెంచి, సామాన్యుడిపై నిత్యావసర వస్తువుల ధరల భారం మోపుతుంది.

భారత స్టాక్ మార్కెట్‌కు గండం

సోమవారం భారత స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 77,269 వద్ద, నిఫ్టీ 24,119 వద్ద స్థిరపడ్డాయి. అయితే, రాత్రికి గ్లోబల్ మార్కెట్లలో పరిస్థితులు మారిపోయాయి. అమెరికా మార్కెట్లు (నాస్డాక్, డౌ జోన్స్) నష్టాల్లోకి వెళ్లాయి. గిఫ్ట్ నిఫ్టీ కూడా 24,010 వద్ద అంటే దాదాపు 100 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. దీనివల్ల రేపు మంగళవారం ఉదయం మన మార్కెట్లు గ్యాప్-డౌన్ (భారీ నష్టాలతో) ప్రారంభమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

ముందు జాగ్రత్తగా ఉండాల్సిన ఇన్వెస్టర్లు

యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని తరుణంలో మార్కెట్లు చాలా అస్థిరంగా ఉంటాయి. ముఖ్యంగా ఆయిల్ కంపెనీలు, పెయింట్స్, టైర్ తయారీ సంస్థల షేర్లు (క్రూడాయిల్ ముడి పదార్థంగా వాడేవి) ఒత్తిడికి లోనయ్యే ఛాన్స్ ఉంది. మరోవైపు బంగారం ధరలు సురక్షిత పెట్టుబడిగా మారి మరింత పెరగవచ్చు. సోమవారం నాటి లాభాలు ఆవిరి కాకుండా ఉండాలంటే ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండి, యుద్ధ పరిస్థితులను గమనిస్తూ నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

PolitEnt Media

PolitEnt Media

Next Story