Car Buying Guide: సెకండ్ హ్యాండ్ కార్ కొనాలనుకుంటున్నారా? పైపైన మెరుపులు చూసి మోసపోకండి
పైపైన మెరుపులు చూసి మోసపోకండి

Car Buying Guide: తక్కువ ధరలో సొంత కారు కలిగి ఉండాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. కొత్త కారు కొనే స్థోమత లేనివారు సెకండ్ హ్యాండ్ కార్ల వైపు మొగ్గు చూపుతుంటారు. తక్కువ బడ్జెట్లో మంచి కారు దొరికినప్పటికీ, పైపైన మెరిసిపోతున్న అందాన్ని చూసి మురిసిపోవడం సరికాదు. సరైన పరిశీలన లేకుండా కొనుగోలు చేస్తే ఆ తర్వాత రిపేర్లు, మెంటెనెన్స్ ఖర్చులతో జేబు గుల్ల కావడం ఖాయం. అందుకే డీల్ ఫైనల్ చేసే ముందు బడ్జెట్ ఎంతనేది స్పష్టంగా నిర్ణయించుకోవాలి. కేవలం కారు కొనుగోలు ధర మాత్రమే కాకుండా ఇన్సూరెన్స్, ఆర్సీ ట్రాన్స్ఫర్, టాక్సులు, సర్వీసింగ్ ఖర్చులను కూడా అంచనా వేసుకోవాలి.
బాడీ, ఇంటీరియర్ పరిశీలన
కారును ఎంచుకునే ముందు దాని బాడీ కండిషన్‌ను నిశితంగా పరిశీలించాలి. ఎక్కడైనా డెంట్లు, తుప్పు పట్టడం, రీ-పెయింటింగ్ గుర్తులు లేదా ప్రమాదానికి గురైన ఆనవాళ్లు ఉన్నాయేమో చూసుకోవాలి. తలుపులు, బోనెట్, డిక్కీ సరిగ్గా క్లోజ్ అవుతున్నాయో లేదో పరీక్షించాలి. ఇక ఇంటీరియర్‌కి వస్తే సీట్లు, ఏసీ, మ్యూజిక్ సిస్టమ్, పవర్ విండోస్, హెడ్లైట్లు అన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో స్వయంగా ఆన్ చేసి చెక్ చేయాలి. ఇవన్నీ కారు వాస్తవ పరిస్థితిని మనకు కళ్లకు కట్టినట్లు వివరిస్తాయి.
ఇంజన్, టెస్ట్ డ్రైవ్ ప్రాముఖ్యత
సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలులో ఇంజన్ మరియు మెకానికల్ పార్ట్స్ తనిఖీ అత్యంత కీలకమైన ఘట్టం. మీకు కార్లపై అవగాహన లేకపోతే అనుభవజ్ఞుడైన మెకానిక్‌ను వెంట తీసుకెళ్లడం ఉత్తమం. క్లచ్, గేర్‌బాక్స్, బ్రేకులు, సస్పెన్షన్ పనితీరును అంచనా వేయాలి. కనీసం 5 నుంచి 10 కిలోమీటర్ల దూరం టెస్ట్ డ్రైవ్ చేయడం తప్పనిసరి. డ్రైవింగ్ చేసే సమయంలో ఎలాంటి శబ్దాలు వస్తున్నాయి, గేర్లు సులువుగా మారుతున్నాయా లేదా అనేది స్పష్టంగా గమనించాలి.
పేపర్లు, ఓడోమీటర్ రీడింగ్ చెకింగ్
కారు కొనే ముందు దాని డాక్యుమెంట్ల వెరిఫికేషన్ చాలా ముఖ్యం. ఆర్సీ బుక్, ఇన్సూరెన్స్, పీయూసీ సర్టిఫికేట్, సర్వీస్ హిస్టరీని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఒకవేళ కారుపై లోన్ ఉంటే ఆ క్లియరెన్స్ పత్రాలు సరి చూసుకోవాలి. ఇంజన్ నంబర్, ఛాసిస్ నంబర్ ఆర్సీలోని వివరాలతో సరిపోలుతున్నాయో లేదో చూడాలి. అలాగే ఓడోమీటర్ రీడింగ్‌ను సర్వీస్ రికార్డులతో బేరీజు వేసి కిలోమీటర్లు ట్యాంపరింగ్ జరగలేదని నిర్ధారించుకోవాలి. మార్కెట్లో అదే మోడల్ ధరలతో పోల్చి సరైన ధరకు బేరం కుదుర్చుకోవాలి.

