Vaibhav Sooryavanshi : ఐపీఎల్ అంటేనే రాత్రికి రాత్రే సామాన్యులను కోటీశ్వరులను చేసే వేదిక. కానీ, కేవలం 13 ఏళ్ల వయసుకే కోటీశ్వరుడిగా మారి, 14 ఏళ్లకే ప్రపంచ క్రికెట్ రికార్డులను తిరగరాస్తున్న ఒక కుర్రాడి గురించి ఇప్పుడు దేశమంతా చర్చ నడుస్తోంది. అతనే బీహార్ కుర్రాడు, రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ. మైదానంలో సిక్సర్ల వర్షం కురిపిస్తున్న ఈ చిన్నారి ఆటగాడి సంపాదన ఎంత? అతను ఎలా కోటీశ్వరుడయ్యాడు? అతని ఆస్తుల విలువ ఎంత? అనే ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.

ఐపీఎల్ వేలంతో మారిన జీవితం

వైభవ్ సూర్యవంశీ కేవలం 13 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే ఐపీఎల్ వేలంలో హాట్ టాపిక్ అయ్యాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈ చిన్నారిని ఏకంగా రూ.1.1 కోట్లకు కొనుగోలు చేసింది. అతని కనీస ధర రూ.30 లక్షలు కాగా, ఢిల్లీ క్యాపిటల్స్ వంటి జట్లు పోటీ పడటంతో ధర కోటి దాటిపోయింది. దీంతో అతి చిన్న వయసులోనే కోటీశ్వరుడైన ఆటగాడిగా వైభవ్ రికార్డు సృష్టించాడు. ప్రతి సీజన్‌కు గాను రాజస్థాన్ రాయల్స్ అతనికి రూ.1.1 కోట్ల జీతాన్ని అందిస్తోంది.

వైభవ్ సూర్యవంశీ నెట్ వర్త్

తాజా నివేదికల ప్రకారం.. వైభవ్ సూర్యవంశీ మొత్తం ఆస్తి విలువ ప్రస్తుతం రూ.2 నుంచి 3 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. ఇందులో ప్రధాన భాగం ఐపీఎల్ ద్వారా వచ్చిన జీతమే. దీనికి అదనంగా అతను బీహార్ ప్రభుత్వం నుంచి కూడా ప్రోత్సాహకాలను అందుకుంటున్నాడు. గుజరాత్ టైటాన్స్‌పై కేవలం 35 బంతుల్లోనే రికార్డు సెంచరీ బాదినందుకు బీహార్ ప్రభుత్వం అతనికి రూ.10 లక్షల నగదు బహుమతిని ప్రకటించింది. ఇది అతని పాపులారిటీని మరియు సంపాదనను మరింత పెంచింది.

బ్రాండ్ డీల్స్, అదనపు ఆదాయం

మైదానంలో అతను చూపిస్తున్న విధ్వంసకర బ్యాటింగ్ తీరు చూసి పెద్ద పెద్ద బ్రాండ్లు ఇప్పుడు అతని వైపు చూస్తున్నాయి. ఇప్పటికే కొన్ని లోకల్ బ్రాండ్లతో ఒప్పందాలు చేసుకున్న వైభవ్, త్వరలోనే జాతీయ స్థాయి బ్రాండ్లకు అంబాసిడర్‌గా మారబోతున్నాడు. స్పోర్ట్స్ గూడ్స్, ఎనర్జీ డ్రింక్స్, షూ కంపెనీలు అతనితో ఒప్పందాల కోసం క్యూ కడుతున్నాయి. నిపుణుల అంచనా ప్రకారం.. రాబోయే ఏడాదిలో అతని నెట్ వర్త్ రెట్టింపు అయ్యే అవకాశం ఉంది.

బీహార్ మట్టిలో పుట్టిన డైమండ్

2011 మార్చి 27న బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లా మోతీపూర్ గ్రామంలో వైభవ్ జన్మించాడు. 9 ఏళ్ల వయసు నుంచే క్రికెట్ బ్యాట్ పట్టిన వైభవ్ కు, అతని తండ్రి సంజీవ్ సూర్యవంశీ తొలి కోచ్. తండ్రి ట్రైనింగులో రాటుదేలిన వైభవ్, తర్వాత ప్రొఫెషనల్ అకాడమీలో చేరి తన ప్రతిభకు మెరుగులు దిద్దుకున్నాడు. బీహార్ అండర్-19 జట్టులో రాణించి, నేరుగా రంజీ ట్రోఫీలో కూడా అడుగుపెట్టాడు. చిన్న వయసులోనే ఇంతటి పరిణతితో బ్యాటింగ్ చేయడం అతనికి అపారమైన కీర్తిని, సంపదను తెచ్చిపెడుతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story