జేబులో పైసా లేకపోయినా కార్పొరేట్ వైద్యం

Vaya Vandana Card : 70 ఏళ్లు దాటిన తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అంటే కొండను తవ్వి ఎలుకను పట్టినంత కష్టం. ఒకవేళ ఇన్సూరెన్స్ కంపెనీలు పాలసీ ఇచ్చినా, ప్రీమియంలు ఆకాశంలో ఉంటాయి, కవర్ అయ్యే జబ్బులు మాత్రం నేల మీద ఉంటాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో వృద్ధులకు కొండంత అండగా నిలుస్తోంది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వయ వందన కార్డ్. ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా వచ్చిన ఈ స్కీమ్ ద్వారా 70 ఏళ్లు పైబడిన వారు ఏటా 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సదుపాయం పొందవచ్చు.

ఎవరికి ఈ కార్డు దక్కుతుంది?

ఈ పథకం ప్రధానంగా 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధుల కోసం రూపొందించబడింది. అయితే, ఇది అందరికీ ఆటోమేటిక్‌గా రాదు. ఇది ఆయుష్మాన్ భారత్ డేటాబేస్‌పై ఆధారపడి ఉంటుంది. ఒక కుటుంబంలో 70 ఏళ్లు దాటిన వృద్ధులు ఎంతమంది ఉన్నా, వారందరికీ ఈ వయ వందన కార్డు జారీ చేస్తారు. ఈ కార్డు ద్వారా కుటుంబంలో ఉన్న మిగతా సభ్యులకు సంబంధం లేకుండా, వృద్ధులకు ప్రత్యేకంగా రూ.5 లక్షల టాప్-అప్ కవర్ లభిస్తుంది.

ఏయే ఖర్చులు కవర్ అవుతాయి?

ఇది కేవలం హాస్పిటల్‌లో జాయిన్ అయినప్పుడు మాత్రమే కాకుండా, అడ్మిట్ కావడానికి మూడు రోజుల ముందు మరియు డిశ్చార్జ్ అయిన తర్వాత 15 రోజుల వరకు అయ్యే మందుల ఖర్చులు, టెస్టుల ఖర్చులను కూడా కవర్ చేస్తుంది. ఈ పథకం పూర్తిగా క్యాష్‌లెస్ ప్రాతిపదికన పనిచేస్తుంది. అంటే మీరు హాస్పిటల్‌లో చేరేటప్పుడు మీ కార్డు చూపిస్తే చాలు, ఒక్క రూపాయి కూడా ముందుగా కట్టాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం నేరుగా హాస్పిటల్ బిల్లులను చెల్లిస్తుంది.

నమోదు చేసుకోవడం ఎలా?

వయ వందన కార్డు పొందడం చాలా సులభం. మీరు ఆన్‌లైన్‌లో ఆయుష్మాన్ భారత్ పోర్టల్ ద్వారా లేదా సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC) కి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. మీ ఆధార్ కార్డులో వయస్సు 70 ఏళ్లు దాటినట్లు ఉంటే చాలు, బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి చేసి వెంటనే ఈ కార్డును పొందవచ్చు. ఒకవేళ మీరు ఇప్పటికే ఏదైనా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కలిగి ఉన్నా లేదా ఈఎస్ఐ వంటి పథకాల్లో ఉన్నా, మీరు అదనంగా ఈ కార్డును కూడా తీసుకోవచ్చు.

ఎక్కడ చికిత్స చేయించుకోవచ్చు?

దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ నెట్‌వర్క్‌లో ఉన్న వేల సంఖ్యలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో ఈ కార్డు చెల్లుతుంది. ఒక రాష్ట్రంలో తీసుకున్న కార్డును దేశంలో ఎక్కడైనా వాడుకోవచ్చు. ఇది ముఖ్యంగా క్యాన్సర్, గుండె జబ్బులు, కిడ్నీ సంబంధిత వ్యాధులు వంటి ఖరీదైన చికిత్సలకు బాగా ఉపయోగపడుతుంది. అయితే, సాధారణ జ్వరం లేదా డాక్టర్ కన్సల్టేషన్ వంటి చిన్న చిన్న పనులకు ఇది వర్తించదు, కేవలం హాస్పిటల్‌లో అడ్మిట్ అయితేనే క్లెయిమ్ చేసుకోవడానికి వీలుంటుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story