Food Inflation: 10 శాతం పెరిగిన భోజనం ధర.. మండిపోతున్న ఉల్లిపాయలు, నూనె రేట్లు
ఉల్లిపాయలు, నూనె రేట్లు

Food Inflation: సామాన్య కుటుంబాల వంటింటి బడ్జెట్‌కు మళ్లీ గండి పడింది. రోజువారీ భోజనం తయారీ వ్యయం గణనీయంగా పెరిగినట్లు ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ తమ రోటీ రైస్ రేట్ నివేదికలో స్పష్టం చేసింది. గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే ఈ ఏడాది ఇంట్లో తయారుచేసే శాకాహార థాళీ ధర 10 శాతం పెరగ్గా, మాంసాహార థాళీ వ్యయం 6 శాతం పెరిగింది. ఆగస్టు నెలతో పోల్చినా వెజ్ థాళీ 4 శాతం, నాన్-వెజ్ థాళీ 3 శాతం ప్రియమయ్యాయి.
ఉల్లిపాయల ధరల్లో ఏకంగా 89 శాతం ఉద్ధృతి
భోజనం వ్యయం ఈ స్థాయిలో పెరగడానికి ప్రధాన కారణం ఉల్లిపాయల ధరలు ఆకాశాన్నంటడమే. గత ఏడాది సెప్టెంబర్‌లో కిలో రూ.28 లభించిన ఉల్లిపాయల ధర ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఏకంగా రూ.53కి చేరింది. వర్షపాతం తగ్గడం, రబీ పంట దిగుబడి పడిపోవడంతో మార్కెట్లో ఉల్లి సరఫరా తగ్గిపోయింది. కేవలం ఒక్క నెల వ్యవధిలోనే ఉల్లిపాయల రేటు 34 శాతం దాకా పెరగడం గమనార్హం.
నూనె, బియ్యం, సిలిండర్ బాదుడు
ఉల్లిపాయలతో పాటు రోజువారీ వాడే ఇతర నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరిగాయి. అంతర్జాతీయంగా దిగుబడి తగ్గడంతో వంటనూనెల ధరలు ఏడాది కాలంలో 12 శాతం పెరిగాయి. అంతర్జాతీయ సరఫరా సమస్యల కారణంగా గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరలు 10 శాతం, వరి సాగు విస్తీర్ణం తగ్గి బియ్యం ధరలు 8 శాతం దాకా ప్రియమయ్యాయి. ఇవన్నీ కలిసి సామాన్యుడి నెలవారీ వ్యయాన్ని పెంచేశాయి.
నాన్-వెజ్ థాళీలో స్వల్ప మార్పు
శాకాహార థాళీతో పోలిస్తే మాంసాహార థాళీ ధరల్లో పెరుగుదల కాస్త తక్కువగానే ఉంది. నాన్-వెజ్ థాళీ మొత్తం వ్యయంలో బ్రాయిలర్ చికెన్ వాటా సగానికి పైగా ఉంటుంది. సెప్టెంబర్ నెలలో బ్రాయిలర్ చికెన్ ధరలు కేవలం 2 శాతం మాత్రమే పెరగడం వల్ల నాన్-వెజ్ థాళీ భారం 6 శాతానికి పరిమితమైంది. చికెన్ దానా ధరలు పెరిగినప్పటికీ, చికెన్ విక్రయ రేట్లు పెద్దగా మారకపోవడం మాంసాహారులకు కాస్త ఊరట కలిగించింది.
అక్టోబర్ ముగింపు వరకు ఇదే పరిస్థితి
రాబోయే దసరా, దీపావళి పండగల సీజన్‌లో ఉల్లిపాయల డిమాండ్ ఇంకా పెరిగే అవకాశం ఉందని క్రిసిల్ వెల్లడించింది. అక్టోబర్ మొదటి రెండు వారాల్లో ఉల్లిపాయల ధరలు ఉచ్ఛస్థాయిలోనే ఉండే అవకాశం ఉంది. అయితే అక్టోబర్ చివరి నాటికి కొత్త ఖరీఫ్ పంట మార్కెట్లకు భారీగా తరలివచ్చిన తర్వాతే ఉల్లి రేట్లు తగ్గి, వంటింటి బడ్జెట్ మళ్లీ సర్దుకునే వీలుంది.

