సౌదీ కూడా దీని వెనుకే

Crude Oil : ప్రపంచంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినప్పుడు దాని ప్రభావం నేరుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. ముఖ్యంగా దిగుమతులు, ఎగుమతులను ప్రభావితం చేసే ఉత్పత్తులలో ముడి చమురు చాలా ముఖ్యమైనది. ఇటీవల ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల సమయంలో కూడా ముడి చమురు గురించి చాలా చర్చ జరిగింది. అయితే, ప్రపంచంలో అత్యంత పవర్ ఫుల్ దేశాలలో ఎక్కువగా చమురు నిల్వలు ఎవరి దగ్గర ఉన్నాయో తెలుసా? ఈ విషయంలో అమెరికా, రష్యా, ఇరాన్, సౌదీ అరేబియా కూడా ఈ దేశం కంటే వెనుకబడి ఉన్నాయట.

వరల్డోమీటర్ గణాంకాల ప్రకారం.. ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలు వెనెజులా దగ్గర ఉన్నాయి. ఈ దేశం దగ్గర 303,008 మిలియన్ బ్యారెల్స్ చమురు నిల్వలు ఉన్నాయి. అయితే, ఇంత చమురు సంపద ఉన్నప్పటికీ, వెనెజులా ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇక్కడ 80 శాతానికి పైగా ప్రజలు పేదరికంలో జీవిస్తున్నారు. ప్రపంచంలో అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న టాప్-5 దేశాలలో ఇది కూడా ఒకటి.

వెనెజులా తర్వాత సౌదీ అరేబియా పేరు వస్తుంది. దీని దగ్గర 2023 గణాంకాల ప్రకారం 267,230 మిలియన్ బ్యారెల్స్ చమురు నిల్వలు ఉన్నాయి. సౌదీ అరేబియా చమురు ఉత్పత్తిలో ముందుండటమే కాకుండా, పర్యాటకం, సాంకేతికత వంటి రంగాలలో కూడా అభివృద్ధి చెందుతోంది. మూడో స్థానంలో ఇరాన్ ఉంది. దీని దగ్గర 208,600 మిలియన్ బ్యారెల్స్ చమురు నిల్వలు ఉన్నాయి. నాలుగో స్థానంలో ఇరాక్(145,019 మిలియన్ బ్యారెల్స్), ఐదో స్థానంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(113,000 మిలియన్ బ్యారెల్స్) ఉన్నాయి. కెనడా, కువైట్, లిబియా కూడా టాప్-10 చమురు నిల్వలు ఉన్న దేశాలలో ఉన్నాయి.

రష్యా దగ్గర 80,000 మిలియన్ బ్యారెల్స్ చమురు నిల్వలు ఉన్నాయి. ఇది భారత్ సహా చాలా దేశాలకు ముడి చమురును ఎగుమతి చేస్తుంది. ఇక అమెరికా దగ్గర 47,730 మిలియన్ బ్యారెల్స్, చైనా దగ్గర 27,889 మిలియన్ బ్యారెల్స్ చమురు నిల్వలు ఉన్నాయి. ఈ దేశాలు చమురు నిల్వల్లో బలంగా ఉండటమే కాకుండా, వాటి ఆర్థిక వ్యవస్థలు కూడా వివిధ రంగాలపై ఆధారపడి ఉన్నాయి.

ప్రపంచంలో అతిపెద్ద చమురు దిగుమతిదారులలో అమెరికా, చైనా మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. అవి తమ అవసరాల కోసం చమురును దిగుమతి చేసుకుంటాయి. భారత్ మూడవ అతిపెద్ద చమురు దిగుమతిదారు. భారత్ తన అవసరాలలో 80 శాతం చమురును దిగుమతి చేసుకుంటుంది. ఇందులో 40 శాతం చమురు స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మార్గం గుండా వస్తుంది. మధ్యప్రాచ్యంలో రుగుతున్న ఉద్రిక్తతల మధ్య భారత్, రష్యా, అమెరికా నుండి చమురు దిగుమతులను పెంచుకుని ఒక వ్యూహాత్మక అడుగు వేసింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story