ఫ్యామిలీ ప్లాన్ల ధరలు భారీగా పెంపు!

Vodafone Idea : టెలికాం రంగంలో అగ్రగామిగా ఉన్న వోడాఫోన్ ఐడియా తన ఆదాయాన్ని పెంచుకునే పనిలో పడింది. ఇందులో భాగంగా తన పాపులర్ ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల ధరలను సుమారు 7 నుంచి 9 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపు తక్షణమే అమల్లోకి రానుంది. ఈ నిర్ణయం వల్ల ఒకే బిల్లు కింద కుటుంబం అంతా మొబైల్ కనెక్షన్లు వాడుతున్న వారికి నెలవారీ ఖర్చు భారంగా మారనుంది. గతంలో భారతీ ఎయిర్‌టెల్‌తో సమానంగా ఉన్న ధరలు ఇప్పుడు ఎయిర్‌టెల్ కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం.

ముఖ్యంగా మూడు ప్రధాన ప్లాన్‌ల ధరల్లో మార్పులు జరిగాయి. గతంలో ఇద్దరు కస్టమర్లకు అనుసంధానంగా ఉన్న రూ.701 ప్లాన్ ధర ఇప్పుడు రూ.751కి చేరింది. అదేవిధంగా నలుగురు సభ్యులు వాడుకునే రూ.1201 ప్లాన్ ధర ఏకంగా రూ.1301కి పెరిగింది. ఇక ఐదుగురు సభ్యుల కోసం ఉన్న అత్యంత ఖరీదైన రూ.1401 ప్లాన్ ఇప్పుడు రూ.1525 అయ్యింది. అంటే ప్రతి ప్లాన్‌పై సగటున రూ.50 నుండి రూ.120 వరకు భారం పడింది. దీనివల్ల పోస్ట్‌పెయిడ్ వాడే మధ్యతరగతి కుటుంబాలకు ఏటా వేల రూపాయల అదనపు భారం పడుతుంది.

ఒకవైపు 5G సేవల విస్తరణలో వెనుకబడి ఉన్న వోడాఫోన్ ఐడియా, ఇలా ధరలు పెంచడం పట్ల కస్టమర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ధరల విషయంలో ఎయిర్‌టెల్‌తో పోటీ పడిన Vi, ఇప్పుడు అంతకంటే ఎక్కువ చార్జీలు వసూలు చేస్తోంది. క్వాలిటీ మరియు నెట్‌వర్క్ విషయంలో ఎయిర్‌టెల్ ముందంజలో ఉన్న తరుణంలో, Vi తన ధరలను పెంచడం వల్ల వినియోగదారులు ఇతర నెట్‌వర్క్‌ల వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ ధరల పెరుగుదల కేవలం పోస్ట్‌పెయిడ్ యూజర్లకే పరిమితం అవుతుందా లేదా రాబోయే రోజుల్లో ప్రీపెయిడ్ ప్లాన్లపై కూడా ప్రభావం చూపుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. టెలికాం కంపెనీలు తమ సగటు ఆదాయం పెంచుకోవడానికి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయని సమాచారం. అయితే ఇప్పటికే అన్ని వస్తువుల ధరలు పెరుగుతుండటంతో, మొబైల్ రీఛార్జ్ ధరలు కూడా పెరగడం సామాన్యులకు శరాఘాతంగా మారింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story