Vijay Sales: విజయ్ సేల్స్‌లో షాపింగ్ చేశారా? మీ డేటా లీక్ అయిందేమో చెక్ చేస్కోండి
చెక్ చేస్కోండి

Vijay Sales: ఎలక్ట్రానిక్స్ కొనుగోళ్లకు పేరొందిన విజయ్ సేల్స్ సంస్థకు సంబంధించి భారీ డేటా లీక్ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. కంపెనీ ఇంటర్నల్ సిస్టమ్స్ లోకి చొరబడి లక్షలాది రికార్డులను యాక్సెస్ చేసినట్లు ఓ హ్యాకర్ గ్రూప్ ప్రకటించింది. ఇందులో 30 లక్షలకు పైగా కస్టమర్ల ఆర్డర్ వివరాలు, సుమారు 15 వేల మంది ఉద్యోగుల సమాచారం, 1.4 లక్షల మంది విక్రేతలకు సంబంధించిన బిల్లింగ్ రికార్డులు ఉన్నాయని పేర్కొంది. ఈ సమాచారాన్ని డార్క్ వెబ్‌లో 25 వేల డాలర్లకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. భారత కరెన్సీలో ఈ మొత్తం దాదాపు రూ.21 లక్షలు. అయితే ఈ ఆరోపణలు నిజమా? ఎంతమంది కస్టమర్ల సమాచారం ప్రభావితమైంది? అనే విషయాలపై ఇంకా క్లారిటీ రాలేదు.
డార్క్ వెబ్‌లో అమ్మకం?
డిజిట్ నివేదిక ప్రకారం.. డార్క్ వెబ్ ఇన్ఫార్మర్ అనే ఖాతా సోషల్ మీడియా వేదిక Xలో ఈ వ్యవహారాన్ని బయటపెట్టింది.షైనీ మొంటానా అనే పేరుతో ఉన్న థ్రెట్ యాక్టర్ విజయ్ సేల్స్ ఇంటర్నల్ సిస్టమ్స్‌కు సంబంధించిన సూపర్ అడ్మిన్ యాక్సెస్ తన వద్ద ఉందని చెబుతున్నాడు. దీన్ని కొనుగోలు చేయాలనుకునే వారికి 25 వేల డాలర్లకు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. ఈ యాక్సెస్ నిజంగా పనిచేస్తుందా? హ్యాకర్ చెప్పిన స్థాయిలో సమాచారం అతడి చేతిలో ఉందా? అనే విషయాలు నిర్ధారణ కాలేదు.
30 లక్షల ఆర్డర్ల వివరాలు
హ్యాకర్ చెబుతున్న లెక్కల ప్రకారం.. 30 లక్షలకు పైగా ఆర్డర్ రికార్డులు, 15 వేల మంది ఉద్యోగుల వివరాలు, 1.4 లక్షల మంది విక్రేతల బిల్లింగ్ సమాచారం అతడి వద్ద ఉన్నాయట. ఈ వివరాలు నిజమైతే ప్రభావం కస్టమర్లకే పరిమితం కాకుండా కంపెనీ ఉద్యోగులు, వ్యాపార భాగస్వాములపైనా పడే అవకాశం ఉంటుంది. ఆర్డర్ల వివరాలతో పాటు కంపెనీ ఇంటర్నల్ డేటాబేస్లు, ఇన్వెంటరీ సమాచారం కూడా యాక్సెస్ చేసినట్లు హ్యాకర్ ఆరోపిస్తున్నాడు. అయితే ఈ రికార్డులన్నీ నిజంగా లీక్ అయ్యాయనే ఆధారాలు ప్రస్తుతం బయటకు రాలేదు.
ఏ వివరాలు బయటపడే ప్రమాదం?
నివేదిక ప్రకారం.. కస్టమర్ల వ్యక్తిగత వివరాలు, పేమెంట్లకు సంబంధించిన రికార్డులు, బ్యాంక్ ట్రాన్స్ఫర్ సమాచారం లీక్ అయ్యే అవకాశం ఉందని హ్యాకర్ చెబుతున్నాడు. కంపెనీ ఆర్థిక నివేదికలు, ఇన్వెంటరీ వివరాలు, అంతర్గత అప్లికేషన్లు కూడా తనకు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నాడు. ఇలాంటి సమాచారం దుర్వినియోగమైతే నకిలీ కాల్స్, మోసపూరిత మెసేజ్‌లు, ఫిషింగ్ లింకుల ద్వారా కస్టమర్లను లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉంటుంది. అయితే ఇప్పటివరకు ఎవరి బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు పోయినట్లు లేదా కస్టమర్ల వివరాలను దుర్వినియోగం చేసినట్లు నిర్ధారణ కాలేదు.
కస్టమర్లు ఏం చేయాలి?
విజయ్ సేల్స్‌లో గతంలో కొనుగోళ్లు చేసినవారు ప్రస్తుతానికి అప్రమత్తంగా ఉండాలి. కంపెనీ పేరు చెప్పి ఫోన్ చేసే వ్యక్తులకు ఓటీపీ, యూపీఐ పిన్, ఏటీఎం పిన్, కార్డు వివరాలు చెప్పకూడదు. ఆర్డర్ డెలివరీ, రీఫండ్, వారంటీ లేదా క్యాన్సిలేషన్ పేరుతో వచ్చే అనుమానాస్పద లింకులను తెరవకూడదు. బ్యాంక్ ఖాతాలు, క్రెడిట్ కార్డుల లావాదేవీలను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. అనుమానాస్పద చెల్లింపు కనిపిస్తే వెంటనే బ్యాంకును సంప్రదించాలి. ఇతర ఖాతాల్లోనూ ఒకే పాస్వర్డ్ వాడుతుంటే మార్చుకోవడం మంచిది.

