Google : విశాఖలో ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్.. రూ.52వేల కోట్లు ఇన్వెస్ట్ చేయనున్న గూగుల్
రూ.52వేల కోట్లు ఇన్వెస్ట్ చేయనున్న గూగుల్

Google : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాపార విధానాలకు భిన్నంగా, అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం గూగుల్ భారత్‌లో భారీ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైంది. రాయిటర్స్ వార్తా సంస్థ నివేదిక ప్రకారం.. గూగుల్ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో 6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.52,000 కోట్లు) పెట్టుబడితో 1 గిగావాట్ డేటా సెంటర్‌ను నిర్మించబోతోంది. గూగుల్ నిర్మించనున్న ఈ డేటా సెంటర్ ఆసియాలోనే అతిపెద్దది కానుంది. సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్ వంటి దేశాల్లో ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్లు ఉన్నాయి. అయితే, విశాఖపట్నంలో నిర్మించబోయే డేటా సెంటర్ వాటికంటే పెద్దదిగా ఉంటుంది. ఈ భారీ ప్రాజెక్టులో 2 బిలియన్ డాలర్ల (సుమారు రూ.17,000 కోట్లు) పునరుత్పాదక ఇంధన అభివృద్ధి కూడా ఉంది. ఈ ప్లాంట్ ఉత్పత్తి చేసే విద్యుత్ డేటా సెంటర్ అవసరాలకు సరిపోతుంది.
ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రకారం.. రాష్ట్రంలో ఇప్పటికే 1.6 గిగావాట్ల డేటా సెంటర్ల స్థాపనకు పెట్టుబడులు ఖరారయ్యాయి. గూగుల్ డేటా సెంటర్ తో పాటు, ఇతర సంస్థల నుంచి కూడా పెట్టుబడులు రాబోతున్నాయి. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో మొత్తం 6 గిగావాట్ల డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యం సాధిస్తే, విశాఖపట్నం దేశంలోనే అతిపెద్ద టెక్ మరియు డేటా హబ్‌గా మారే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో డిజిటల్ మౌలిక సదుపాయాలను విస్తరిస్తోంది. విశాఖపట్నంలో మూడు కొత్త కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తోందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ స్టేషన్ల వల్ల అంతర్జాతీయ నెట్‌వర్క్‌లకు అత్యంత వేగవంతమైన కనెక్టివిటీ లభిస్తుంది. ముంబైలో ప్రస్తుతం ఉన్న దానికంటే రెట్టింపు పెద్ద కేబుల్ నెట్‌వర్క్‌ను విశాఖపట్నంలో ఏర్పాటు చేయవచ్చని మంత్రి లోకేష్ అన్నారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలో వేగవంతమైన ఇంటర్నెట్ సేవలకు మార్గం సుగమం చేస్తాయి.
