కానీ ఇది కస్టమర్ల డిమాండ్ కాదట!

Smartphone : భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో పండుగ సీజన్ ప్రారంభంతో కాస్త జోష్ పెరిగింది. పరిశోధనా సంస్థ ఓమ్డియా విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2025 క్యాలెండర్ సంవత్సరం మూడవ త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్) స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్‌లు (కంపెనీల నుండి పంపిణీదారులకు పంపిన ఫోన్లు) స్వల్పంగా 3 శాతం పెరిగాయి. ఈ మూడు నెలల్లో మొత్తం 4.84 కోట్ల యూనిట్లు మార్కెట్‌లోకి విడుదలయ్యాయి. అయితే, ఈ పెరుగుదల పట్ల విశ్లేషకులు అంతగా ఉత్సాహం చూపడం లేదు. ఎందుకంటే, ఈ అమ్మకాలు వినియోగదారుల సహజ డిమాండ్‌ కంటే, కంపెనీలు దుకాణాల్లో సరుకు నింపే వ్యూహం వల్ల వచ్చిందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ త్రైమాసికంలో వివో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, యాపిల్ అత్యధిక షిప్‌మెంట్‌తో సంచలనం సృష్టించింది.

పండుగ సీజన్ నేపథ్యంలో జూలై నుండి సెప్టెంబర్ వరకు భారత స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్‌లో స్వల్ప వృద్ధి కనిపించింది. ఈ త్రైమాసికంలో మొత్తం 4.84 కోట్ల యూనిట్ల స్మార్ట్‌ఫోన్లు మార్కెట్‌కు పంపారు. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 3 శాతం పెరుగుదల. ఈ వృద్ధిపై విశ్లేషకులు పెద్దగా సంతోషంగా లేరు. ఎందుకంటే, కంపెనీలు రిటైలర్లకు భారీ తగ్గింపులు, బహుమతులు (బైక్‌లు, విదేశీ పర్యటనలు, బంగారు నాణేలు) వంటివి ఇవ్వడం ద్వారా తమ ఉత్పత్తులను దుకాణాల్లోకి అధికంగా నింపాయి. కస్టమర్ల నుంచి సహజమైన డిమాండ్ మాత్రం ఇప్పటికీ తక్కువగానే ఉందని నివేదిక స్పష్టం చేసింది.

మార్కెట్ వాటా విషయంలో చైనా కంపెనీ వివో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. వివో 97 లక్షల యూనిట్ల షిప్‌మెంట్‌తో 20 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. శాంసంగ్ 68 లక్షల యూనిట్లతో 14 శాతం వాటాతో రెండవ స్థానంలో నిలిచింది. షావోమీ, ఒప్పో రెండూ 65 లక్షల యూనిట్ల చొప్పున షిప్‌మెంట్ చేయగా, షావోమీ స్వల్ప తేడాతో మూడో స్థానంలో నిలిచింది. ఈ త్రైమాసికంలో అతిపెద్ద విజయం యాపిల్ సాధించింది. యాపిల్ ఏకంగా 49 లక్షల యూనిట్లను షిప్‌మెంట్ చేసి, 10 శాతం మార్కెట్ వాటాతో టాప్-5లో స్థానం సంపాదించింది. భారతదేశంలో యాపిల్‌కు ఇదే అత్యధిక త్రైమాసిక షిప్‌మెంట్ రికార్డు.

యాపిల్ ఇంత పెద్ద ఎత్తున వృద్ధి సాధించడానికి ముఖ్య కారణం చిన్న పట్టణాల నుండి పెరిగిన డిమాండ్. చిన్న పట్టణాల్లో ఐఫోన్ కొనాలనే కోరిక పెరగడం, పండుగ ఆఫర్‌లు, సులభంగా లభించడం యాపిల్‌కు బాగా కలిసొచ్చింది. ముఖ్యంగా ఐఫోన్ 16ఎస్, 15ఎస్ వంటి పాత మోడళ్లను భారీ తగ్గింపులతో విక్రయించడం ఈ అమ్మకాలకు ప్రధాన కారణమైంది. ఐఫోన్ 17 బేస్ మోడల్ కూడా 12 నుండి 15 సిరీస్ నుంచి అప్‌గ్రేడ్ అయ్యే కస్టమర్లను ఆకర్షించింది.

కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టినా, స్టాక్ (ఇన్వెంటరీ) పెరిగిపోతుందనే ఆందోళన నిపుణుల్లో ఉంది. కంపెనీల నుంచి దుకాణాలకు సరుకు చేరుకుంది కానీ, దుకాణాల నుంచి కస్టమర్‌లకు అమ్మకాలు ఆ వేగంతో జరగడం లేదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. పెరిగిన జీవన వ్యయం, ఉద్యోగాల అనిశ్చితి కారణంగా పట్టణ వినియోగదారులు ఫోన్లు అప్‌గ్రేడ్ చేయడాన్ని ఆలస్యం చేస్తున్నారు. పండుగ సీజన్ ముగిసిన తర్వాత (అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికం) దుకాణాల్లో సరుకు మిగిలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. 2025 మొత్తం మీద స్మార్ట్‌ఫోన్ మార్కెట్ స్వల్పంగా క్షీణించే అవకాశం ఉందని, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడితేనే మార్కెట్ పుంజుకుంటుందని నివేదిక ముగించింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story