BSNL- Vi Merger : బీఎస్ఎన్ఎల్తో వొడాఫోన్ ఐడియా విలీనం? వారం రోజులుగా దూసుకుపోతున్న షేరు ధర!
వారం రోజులుగా దూసుకుపోతున్న షేరు ధర!

BSNL- Vi Merger : ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు విలీనం కాబోతున్నాయనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. వొడాఫోన్ ఐడియాకు ఏజీఆర్ బకాయిల విషయంలో ప్రభుత్వం మినహాయింపు ఇవ్వాలని చూస్తోందనే వార్తల మధ్య, ఈ విలీన అవకాశం గురించి కూడా వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య గత కొన్ని రోజులుగా వొడాఫోన్ ఐడియా షేరు ధర పెరుగుతూ ఉండటం గమనార్హం. జూన్ 18 నుంచి విఐ షేరు ధర నిరంతరం పెరుగుతోంది.
వొడాఫోన్ ఐడియా షేరు ధర ఎందుకు పెరుగుతోంది?
జూన్ 19న రూ. 6.33 ఉన్న వొడాఫోన్ ఐడియా షేరు ధర, జూన్ 27 శుక్రవారం నాటికి రూ. 7.40 వద్ద ముగిసింది. గత 8-10 సెషన్లలో షేరు ధర ఏకంగా 12% పెరిగింది. పదేళ్ల క్రితం రూ. 118.96 ఉన్న దాని ధర 95% పడిపోయింది. అయితే, గత కొన్ని రోజులుగా అది తిరిగి పుంజుకోవడం ఆసక్తికరంగా మారింది. దీనికి వొడాఫోన్‌కు ఏజీఆర్ చెల్లింపుల నుండి మినహాయింపు లభించడం ఒక కారణం కాగా, బీఎస్‌ఎన్‌ఎల్ తో అది విలీనం కావచ్చనే వార్త కూడా ఒక కారణం కావచ్చు. వొడాఫోన్ ఐడియాలో ప్రభుత్వానికే ఎక్కువ వాటాలు ఉన్నాయి. కాబట్టి, ఈ రెండు సంస్థలు విలీనం అయితే ఆశ్చర్యపోనవసరం లేదు.
వొడాఫోన్ ఐడియాకు ప్రభుత్వ సాయం అవసరమా?
గత నెల వొడాఫోన్ ఐడియా సీఈఓ అక్షయ మూంద్ర ప్రభుత్వ సాయం అవసరం గురించి చెప్పారు. టెలికాం విభాగానికి రాసిన ఒక లేఖలో సీఈఓ, ఏజీఆర్ విషయంలో ప్రభుత్వం సరైన సమయానికి సాయం చేయకపోతే, వొడాఫోన్ ఐడియా 2025-26 తర్వాత పనిచేయడం కష్టమని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వొడాఫోన్‌కు ఏజీఆర్ రిలీఫ్ ఇవ్వడానికి ప్రభుత్వం మార్గాలు వెతుకుతోందని వార్తలు వస్తున్నాయి. టెలికాం విభాగానికి వొడాఫోన్ ఐడియా దాదాపు రూ. 84,000 కోట్లు ఏజీఆర్ బకాయిలు చెల్లించాలి. ఈ మొత్తాన్ని ఆరు సంవత్సరాలలోపు చెల్లించాలనే ఆదేశం ఉంది.
అప్పు తీర్చే గడువు పొడిగిస్తారా?
ప్రభుత్వం ఈ గడువును ఆరు సంవత్సరాల బదులు 20 సంవత్సరాలకు పెంచాలని ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. లేదా, ఏజీఆర్ విషయం పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు సంవత్సరానికి రూ. 1,000-1,500 కోట్లు మాత్రమే చెల్లించడానికి అనుమతించడం గురించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తోందని సమాచారం. ఈ చర్యలు వొడాఫోన్ ఐడియాకు పెద్ద ఊరటనిస్తాయి.
