Vodafone Idea: కష్టాల్లో ఉన్న టెలికాం దిగ్గజం వోడాఫోన్ ఐడియా అద్భుతమైన పునరాగమనం దిశగా అడుగులు వేస్తోంది. రాబోయే మూడేళ్ల కాలంలో ఏకంగా రూ. 49,000 కోట్ల స్పెక్ట్రమ్ బకాయిలను చెల్లిస్తామని కంపెనీ చైర్మన్ కుమార మంగళం బిర్లా సంచలన ప్రకటన చేశారు. కంపెనీ 31వ వార్షిక సర్వసభ్య సమావేశంలో రూపుదిద్దిన ఈ మాస్టర్ ప్లాన్ విశ్లేషకులను ఆకట్టుకుంటోంది. కంపెనీ భుజాలపై ఉన్న బ్యాంక్ రుణం ప్రస్తుతం కేవలం రూ.225 కోట్లకు తగ్గిందని బిర్లా స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి లభించిన ఏజిఆర్ ఉపశమనంతో ప్రధాన బకాయిల చెల్లింపుల గడువును 2035 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగించారు. ఈ క్రమంలో 2027 ఆర్థిక సంవత్సరంలో రూ.7,000 కోట్లు, 2028లో రూ.15,000 కోట్లు, 2029 ఆర్థిక సంవత్సరంలో రూ.27,000 కోట్లు చొప్పున కేంద్ర ప్రభుత్వానికి స్పెక్ట్రమ్ బకాయిలు చెల్లించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

ఇంత పెద్ద మొత్తాన్ని కంపెనీ ఎలా సమకూర్చుకుంటుందనే అంశంపై మార్కెట్ విశ్లేషకులు కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకే సమయంలో నెట్‌వర్క్ విస్తరణ, రుణాల చెల్లింపులతో పాటు స్పెక్ట్రమ్ బకాయిల సమకూర్పు సాధ్యమేనా అని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటిదనపు గడువు కోరకుండానే, సంస్థాగత సంపాదన, అంతర్గత నిధులు, బ్యాంకుల నుంచి వచ్చే కొత్త ఫండ్స్ ద్వారా ఈ బకాయిలను సులువుగా చెల్లిస్తామని మేనేజ్‌మెంట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

2026 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.19,411 కోట్ల ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో సాధించింది. ఫిబ్రవరి నెల నుంచి కంపెనీలో కొత్త చందాదారుల చేరికలు పెరిగాయి. దేశవ్యాప్తంగా 86 శాతానికి పైగా జనాభాకు 4జి కవరేజ్ అందుబాటులోకి రాగా, బ్రాడ్‌బ్యాండ్ టవర్ల సంఖ్య 2 లక్షలు దాటింది. 2026 ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి మొత్తం కస్టమర్ల సంఖ్య 19.28 కోట్లకు చేరగా, ఇందులో 12.9 కోట్ల మంది కేవలం 4జి, 5జి సేవలను ఉపయోగిస్తున్నారు.

నెట్‌వర్క్ బలోపేతం కోసం రూ. 45,000 కోట్ల పెట్టుబడి ప్రణాళికను విఐ అమలు చేస్తోంది. ప్రస్తుతం 200 కంటే ఎక్కువ నగరాల్లో 5జి సేవలు అందుబాటులోకి రాగా, రాబోయే రెండు మూడు నెలల్లో ఈ సంఖ్యను 450 నగరాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గడిచిన ఆరు త్రైమాసికాల వ్యవధిలో 32,000 కొత్త 4జి సైట్లు, 16,000 కొత్త 5జి సైట్లను ఏర్పాటు చేయడంతో నెట్‌వర్క్ సామర్థ్యం 47 శాతం పెరిగింది. వోడాఫోన్ గ్రూప్ నుంచి లభించిన రూ.6,394 కోట్ల సెటిల్‌మెంట్ నిధులు కూడా కంపెనీకి కొండంత బలాన్నిచ్చాయి.

Next Story