Vodafone Idea : వోడాఫోన్-ఐడియాకు బంపర్ ఆఫర్? ఎస్‌బీఐ నుంచి రూ.25,000 కోట్ల లోన్
ఎస్‌బీఐ నుంచి రూ.25,000 కోట్ల లోన్

Vodafone Idea : భారతదేశంలో మూడో అతిపెద్ద ప్రైవేట్ టెలికాం కంపెనీ అయిన వోడాఫోన్ ఐడియా, తన నెట్‌వర్క్‌ను బలోపేతం చేసుకోవడానికి, అలాగే రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ వంటి పెద్ద పోటీదారులతో పోటీ పడటానికి రూ.25,000 కోట్ల లోన్ తీసుకోవడానికి బ్యాంకులతో మాట్లాడుతోంది. ఈ లోన్ కోసం ఏర్పడే బ్యాంకుల బృందానికి (కన్సార్టియం) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నాయకత్వం వహించే అవకాశం ఉంది. ఈ లోన్ దేశీయ, విదేశీ బ్యాంకుల నుంచి వస్తుంది. దీని కాలపరిమితి దాదాపు 10 సంవత్సరాలు ఉండొచ్చు.
అరబిపతి కుమార్ మంగళం బిర్లా నాయకత్వంలో నడుస్తున్న వోడాఫోన్ ఐడియా, గతంలో ఈ లోన్ ప్లాన్‌ను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే, కంపెనీ ఆర్థిక పరిస్థితి అంత బాగోకపోవడం, ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలపై బ్యాంకులు ఆందోళన చెందాయి. ఇప్పుడు మళ్లీ లోన్ పొందే ప్రయత్నాలు వేగవంతమయ్యాయి. ఎందుకంటే, ప్రభుత్వం టెలికాం కంపెనీల బకాయిలపై కొంత ఆర్థిక సహాయం ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా, వోడాఫోన్ ఐడియా నుండి యూజర్లు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ వైపు వెళ్ళిపోతుండటంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. ఈ లోన్ గనుక లభిస్తే, కంపెనీ తన నెట్‌వర్క్‌ను విస్తరించడానికి, స్పీడ్‌ను పెంచడానికి ఖర్చు చేయగలదు. ఇది మార్కెట్‌లో తమ వాటాను తిరిగి పొందడానికి సహాయపడుతుంది.
ఈ సంవత్సరం ఏప్రిల్‌లో, ప్రభుత్వం కంపెనీకి చెల్లించాల్సిన స్పెక్ట్రమ్ బకాయిలను షేర్లుగా మార్చింది. దీనితో వోడాఫోన్ ఐడియాలో ప్రభుత్వ వాటా 48.99% వరకు పెరిగింది. ఈ లోన్ వార్తలపై వోడాఫోన్ ఐడియా ఇప్పటివరకు ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఎస్‌బీఐ కూడా ఎలాంటి సమాధానం చెప్పలేదు. లోన్ కోసం నిధులు సమీకరించే ఈ ప్రక్రియలో విదేశీ బ్యాంకులు కూడా పాల్గొనవచ్చని, ఇది ఒక సంవత్సరంలోగా పూర్తవుతుందని కొన్ని వర్గాల సమాచారం.
బకాయిలపై ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం లభిస్తుందనే మీడియా కథనాలపై, జూన్ 24న వోడాఫోన్ ఐడియా స్పందించింది. తమకు ఈ విషయంలో ప్రభుత్వం నుండి ఎటువంటి అధికారిక సమాచారం రాలేదని స్పష్టం చేసింది. మే నెలలో, కంపెనీ బోర్డు రూ.20,000 కోట్లను ఈక్విటీ లేదా లోన్ ద్వారా సేకరించడానికి ఆమోదం తెలిపింది.
