Worlds Richest People : వారెన్ బఫెట్‌కే షాక్.. టాప్-10 ధనికుల జాబితాలో వాల్‌మార్ట్ వారసుల హవా
టాప్-10 ధనికుల జాబితాలో వాల్‌మార్ట్ వారసుల హవా

Worlds Richest People : ప్రపంచ కుబేరుల జాబితాలో పెను మార్పులు సంభవించాయి. అపర కుబేరుడు, దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్‌కు గట్టి షాక్ తగిలింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తాజా నివేదిక ప్రకారం.. ప్రపంచంలోని టాప్-10 ధనికుల జాబితా నుంచి వారెన్ బఫెట్ బయటకు వచ్చారు. ఆయన స్థానాన్ని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆక్రమించడం విశేషం. వాళ్లు మరెవరో కాదు.. ప్రపంచంలోనే అతిపెద్ద రిటైల్ నెట్‌వర్క్ వాల్‌మార్ట్ వారసులు.
అమీరుల జాబితాలో వాల్‌మార్ట్ వ్యవస్థాపకుడు సామ్ వాల్టన్ సంతానం ఈసారి సంచలనం సృష్టించారు. సామ్ వాల్టన్ ముగ్గురు పిల్లలు - జిమ్ వాల్టన్, రాబ్ వాల్టన, అలిస్ వాల్టన్ - ఒకేసారి టాప్-10లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుత ర్యాంకింగ్స్ ప్రకారం జిమ్ వాల్టన్ 8వ స్థానంలో, రాబ్ వాల్టన్ 9వ స్థానంలో, అలిస్ వాల్టన్ 10వ స్థానంలో నిలిచారు. ముఖ్యంగా అలిస్ వాల్టన్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలైన మహిళగా అవతరించారు. వాల్‌మార్ట్ కంపెనీలో ఈ కుటుంబానికి దాదాపు 47 శాతం వాటా ఉండటమే వీరి సంపదకు ప్రధాన ఆధారం.
వీరి ఆస్తుల విలువ వింటే సామాన్యులకు కళ్లు తిరగడం ఖాయం. బ్లూమ్‌బెర్గ్ లెక్కల ప్రకారం..
జిమ్ వాల్టన్ (8వ స్థానం): ఇతని నికర ఆస్తుల విలువ 158 బిలియన్ డాలర్లు. గడిచిన ఏడాది కాలంలోనే ఈయన సంపద 21.3 బిలియన్ డాలర్లు పెరిగింది.
రాబ్ వాల్టన్ (9వ స్థానం): ఇతని ఆస్తి 154 బిలియన్ డాలర్లు. ఈ ఏడాది ఈయన ఖాతాలో 20.7 బిలియన్ డాలర్లు వచ్చి చేరాయి.
అలిస్ వాల్టన్ (10వ స్థానం): ఈమె ఆస్తి కూడా దాదాపు 154 బిలియన్ డాలర్ల వద్ద ఉంది. ఈమె సంపదలోనూ ఈ సంవత్సరం 21 బిలియన్ డాలర్ల పెరుగుదల కనిపించింది.
వాల్టన్ కుటుంబంలోని ఐదుగురు సభ్యులు టాప్-100 ధనికుల జాబితాలో ఉన్నారు. వీరందరి మొత్తం సంపద దాదాపు 545 బిలియన్ డాలర్లు (సుమారు రూ.45 లక్షల కోట్లు). ఈ మొత్తం గ్రీస్, హంగేరి, ఇరాన్ వంటి అనేక దేశాల మొత్తం జిడిపి కంటే కూడా ఎక్కువ. అంటే ఒక దేశం మొత్తం ఉత్పత్తి చేసే ఆదాయం కంటే ఈ ఒక్క కుటుంబం దగ్గర ఉన్న సంపదే ఎక్కువన్నమాట.
సామ్ వాల్టన్ 1962లో వాల్‌మార్ట్‌ను స్థాపించినప్పుడు ఒకే ఒక సూత్రాన్ని నమ్మారు. అదే డిస్కౌంట్ కల్చర్. వస్తువులను తక్కువ ధరకు విక్రయించడం ద్వారా ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించడం వీరి ప్రత్యేకత. నేడు 19 దేశాల్లో 10,500 కంటే ఎక్కువ స్టోర్లతో వాల్‌మార్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద రిటైల్ కంపెనీగా వెలుగొందుతోంది. గత ఏడాది ఈ కంపెనీ ఏకంగా 703.06 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని గడించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, వీరి బిజినెస్ మోడల్ మాత్రం లాభాల పంట పండిస్తూనే ఉంది.

