Water Business : భారతదేశంలో రోజురోజుకూ నీటి సంక్షోభం తీవ్రరూపం దాల్చుతోంది. అయితే ఈ పెను సవాలులోనే ఊహించని విధంగా లక్షల కోట్ల రూపాయల భారీ వ్యాపార అవకాశం దాగి ఉందని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ప్రభుదాస్ లీలాధర్ తాజా నివేదిక వెల్లడించింది. ప్రపంచ జనాభాలో దాదాపు 18 శాతం మంది మన దేశంలోనే నివసిస్తున్నప్పటికీ, ప్రపంచంలో అందుబాటులో ఉన్న మంచి నీటి వనరులలో కేవలం 4 శాతం మాత్రమే భారత్‌లో ఉన్నాయి. ఈ తీవ్రమైన వ్యత్యాసం కారణంగా, రాబోయే పదేళ్లలో దేశంలో వాటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాన్ని బలోపేతం చేయడానికి ఏకంగా రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. ఇది వాటర్ టెక్నాలజీ, ఇన్‌ఫ్రా కంపెనీల ఆదాయాన్ని రాకెట్‌లా దూసుకెళ్లేలా చేయనుంది.

ప్రస్తుత అంచనాల ప్రకారం.. 2030 నాటికి దేశంలో నీటి డిమాండ్ అందుబాటులో ఉన్న సప్లై కంటే రెట్టింపు కానుంది. ఈ కొరతను అధిగమించాలంటే తాగునీటి సరఫరా, సీవేజ్ ట్రీట్‌మెంట్, మురుగునీటి పునరుద్ధరణ (రీసైక్లింగ్), ఉప్పు నీటిని మంచి నీరుగా మార్చడం (డీసాలినేషన్) వంటి ప్రాజెక్టులపై భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల భారతీయ వాటర్ ట్రీట్‌మెంట్ మార్కెట్ విలువ వచ్చే ఐదారేళ్లలో ఏటా 10 శాతం చొప్పున వృద్ధి చెందుతూ 5.2 బిలియన్ డాలర్లకు చేరుకోనుంది. అలాగే పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలపై ప్రభుత్వాలు నిబంధనలు కఠినతరం చేయడంతో, ఇండస్ట్రియల్ వాటర్ ఇన్‌ఫ్రాపై ఖర్చు కూడా ఏటా 8 శాతం పెరగనుంది.

ఈ రంగం ఇంత వేగంగా పుంజుకోవడానికి ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులు ప్రధాన ఇంజిన్‌లా పనిచేస్తున్నాయి. దేశంలో ప్రతి ఇంటికి తాగునీరు అందించే జల జీవన్ మిషన్ కోసం ఏటా సుమారు రూ. 67,000 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అలాగే ఆర్థిక సంవత్సరం 2026 కోసం జల శక్తి మంత్రిత్వ శాఖకు రూ. 99,500 కోట్లు కేటాయించారు. పట్టణాల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన అమృత్ 2.0 పథకానికి రూ. 2.99 లక్షల కోట్లు, నదుల శుద్ధీకరణ కోసం నమామి గంగే ఫేజ్-2 కింద రూ. 22,500 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం దేశంలో రోజుకు 72,000 మిలియన్ లీటర్ల మురుగునీరు ఉత్పత్తి అవుతుండగా, కేవలం 27,000 మిలియన్ లీటర్లను మాత్రమే శుద్ధి చేసే సామర్థ్యం ఉంది. మిగిలిన 70 శాతం వ్యర్థాలను శుద్ధి చేసేందుకు కొత్త ప్లాంట్ల నిర్మాణం పెద్ద ఎత్తున జరగాల్సి ఉంది.

ఈ భారీ పెట్టుబడుల సైకిల్ వల్ల స్టాక్ మార్కెట్లోని వాటర్ ఇన్‌ఫ్రా కంపెనీలు అద్భుతమైన లాభాలను ఆర్జించే స్థితిలో ఉన్నాయి. దేశంలోనే అతిపెద్ద వాటర్ టెక్నాలజీ సంస్థ అయిన వీఏ టెక్ వాబాగ్ చేతిలో ప్రస్తుతం రూ. 17,200 కోట్ల విలువైన ఆర్డర్లు ఉన్నాయి. కంపెనీ వార్షిక ఆదాయం 15 నుండి 20 శాతం పెరగొచ్చని యాజమాన్యం ధీమాగా ఉంది. అలాగే ఎన్విరో ఇన్‌ఫ్రా ఇంజనీర్స్ సంస్థ రూ. 6,814 కోట్ల భారీ ఆర్డర్ బుక్‌తో రాబోయే రెండేళ్ల ఆదాయానికి తిరుగులేకుండా చేసుకుంది. మరోవైపు, అత్యంత తక్కువ వాల్యుయేషన్‌లో లభిస్తున్న డెంటా వాటర్ అండ్ ఇన్‌ఫ్రా సొల్యూషన్స్ సంస్థ రూ. 728 కోట్ల ఆర్డర్లతో దూసుకుపోతోంది, ఇందులో 73 శాతం ప్రభుత్వ ప్రాజెక్టులే ఉన్నాయి. పెరుగుతున్న పట్టణీకరణ, కఠినమైన పర్యావరణ నియమాలు ఈ రంగాన్ని దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్ థీమ్‌గా మారుస్తున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story