WhatsApp : ఫ్రీగా వాట్సాప్ వాడే రోజులు పోయాయ్..సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లకు మెటా ప్లాన్
సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లకు మెటా ప్లాన్

WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వాడుతున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో త్వరలో పెను మార్పులు రాబోతున్నాయి. ఇప్పటివరకు ఉచితంగా సేవలు అందిస్తున్న ఈ యాప్, ఇప్పుడు సబ్‌స్క్రిప్షన్ మోడల్ వైపు అడుగులు వేస్తోంది. అంటే ఇకపై వాట్సాప్‌ను పూర్తిస్థాయిలో వాడుకోవాలంటే జేబుకు చిల్లు పడక తప్పదన్నమాట. మెటా సంస్థ తన ఆదాయాన్ని పెంచుకోవడానికి వాట్సాప్‌లో ప్రకటనలు ప్రవేశపెట్టాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తోంది. ఇప్పుడు ఆ ప్లాన్ అమలుకు సమయం దగ్గరపడినట్లు కనిపిస్తోంది.
వాట్సాప్ బీటా వెర్షన్ 2.26.3.9 లో కొన్ని కొత్త కోడ్స్ బయటపడ్డాయి. వీటి ప్రకారం, వాట్సాప్ త్వరలో తన యూజర్ల కోసం ఒక ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను లాంచ్ చేయబోతోంది. గత ఏడాది నుంచే మెటా సంస్థ వాట్సాప్ స్టేటస్, ఛానల్స్ సెక్షన్‌లో ప్రకటనలను ప్రదర్శించే అంశంపై ట్రయల్స్ నిర్వహిస్తోంది. దీనిపై యూజర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పటికీ, కంపెనీ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రకటనలు చూడటం ఇష్టం లేని వారు కొంత మొత్తం చెల్లించి సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే వారికి యాడ్-ఫ్రీ అనుభవం లభిస్తుంది.
మీరు గనుక డబ్బులు చెల్లించి సబ్‌స్క్రిప్షన్ తీసుకోకపోతే, మీరు వాట్సాప్ స్టేటస్ చూస్తున్నప్పుడు లేదా ఛానల్స్ ఫాలో అవుతున్నప్పుడు మధ్యమధ్యలో వాణిజ్య ప్రకటనలు ప్రత్యక్షమవుతాయి. ప్రస్తుతానికి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ మధ్యలో ఎలాగైతే ప్రకటనలు వస్తున్నాయో, అదే పద్ధతిని వాట్సాప్‌లో కూడా తీసుకురాబోతున్నారు. అయితే ఈ ప్రకటనలు కేవలం స్టేటస్, ఛానల్స్ సెక్షన్లకే పరిమితం అవుతాయని, మన వ్యక్తిగత చాట్స్ మధ్యలో ప్రకటనలు రావని నివేదికలు చెబుతున్నాయి. ఇది యూజర్ల ప్రైవసీని దెబ్బతీయకుండా ఆదాయాన్ని పెంచుకోవడానికి మెటా వేస్తున్న ఎత్తుగడ.
ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ధర ఎంత ఉంటుంది? ఎప్పటి నుంచి అమలులోకి వస్తుంది? అనే విషయాలపై మెటా ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ, యాడ్-ఫ్రీ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు ప్రీమియం యూజర్లకు మరికొన్ని అదనపు ఫీచర్లు కూడా ఇచ్చే అవకాశం ఉందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. యూట్యూబ్ ప్రీమియం లాగే వాట్సాప్ కూడా ఇప్పుడు డబ్బులు ఇస్తారా.. యాడ్స్ చూస్తారా? అనే ఆప్షన్ యూజర్ల ముందు ఉంచబోతోంది. ఒకప్పుడు పూర్తిగా ఫ్రీగా ఉన్న వాట్సాప్, ఇప్పుడు కమర్షియల్ బాట పట్టడం సామాన్య వినియోగదారులను కొంత ఆందోళనకు గురిచేస్తోంది.
ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఇంకా టెస్టింగ్ దశలోనే ఉంది. రాబోయే కొద్ది నెలల్లో ఇది అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మెటా తన ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో బ్లూ టిక్ కోసం డబ్బులు వసూలు చేస్తోంది. ఇప్పుడు అదే దారిలో వాట్సాప్‌ను కూడా ఆదాయ వనరుగా మార్చుకోవాలని చూస్తోంది. ఒకవేళ మీరు యాడ్స్ చూస్తూనే వాట్సాప్ వాడుకోవాలనుకుంటే, ఎలాంటి డబ్బులు కట్టాల్సిన పని లేదు. కానీ, ఆ యాడ్స్ డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలంటే మాత్రం తప్పకుండా సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే.

